ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే పాకిస్థాన్‌ను అంతమే.. లష్కరే తోయిబా ఉగ్రవాది హెచ్చరిక
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి.
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులు, అలాగే అమెరికా-ఇరాన్ దేశాల మధ్య పెరుగుతున్న విభేదాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ అంతర్జాతీయ సంక్షోభం కాస్తా ఇప్పుడు పాకిస్థాన్ అంతర్గత భద్రతను, ఆ దేశ ఉనికిని ప్రశ్నించే స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్‌కు లేదా అమెరికా అనుకూల శక్తులకు పాకిస్థాన్ గనుక మద్దతు ఇస్తే ఆ దేశాన్ని పూర్తిగా అంతం చేస్తామంటూ అంతర్జాతీయ నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కు చెందిన కీలక కమాండర్ సైఫుల్లా కసూరి ఘాటైన హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పశ్చిమాసియా సంక్షోభం.. హార్మూజ్ జలసంధి దిగ్బంధం
ఇటీవలి కాలంలో ఇరాన్, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక ఉద్రిక్తతలు మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. అమెరికా సైనిక చర్యలు, దానికి ప్రతిగా ఇరాన్ క్షిపణి దాడులతో పశ్చిమాసియా ప్రాంతం ఒక అగ్నిగుండంలా మారింది. ఈ ఉద్రిక్తతల్లో భాగంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన "హార్మూజ్ జలసంధి" ను ఇరాన్ మూసివేయడం అంతర్జాతీయ వాణిజ్యాన్ని కోలుకోలేని దెబ్బతీసింది.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు, గ్యాస్‌లో సింహభాగం ఈ మార్గం గుండానే సాగుతుంది. ఈ జలసంధి మూతపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఎనర్జీ సంక్షోభం ఎదుర్కొంటున్న అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆందోళనలో పడ్డాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో, ఇరాన్, అమెరికా దేశాల మధ్య సయోధ్య కుదిర్చి, ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు దౌత్య వర్గాల ద్వారా తెలుస్తోంది.
పాక్ ఆర్మీ ప్రయత్నాలు.. ఉగ్రవాద సంస్థల అసహనం
ప్రస్తుత సమాచారం ప్రకారం.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ నేతృత్వంలో ఇరాన్-అమెరికా మధ్య సంధి చర్చల కోసం తెరవెనుక దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయంగా తనను తాను ఒక శాంతి స్థాపకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తోంది. అయితే పాక్ ఆర్మీ తీసుకుంటున్న ఈ చొరవపై ఆ దేశంలోనే ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద సంస్థలు తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా ఒత్తిడికి లొంగిపోయి పాకిస్థాన్ ఈ మధ్యవర్తిత్వ నాటకమాడుతోందని ఇది పరోక్షంగా ఇజ్రాయెల్ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని లష్కరే తోయిబా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సైఫుల్లా కసూరి చేసిన వ్యాఖ్యలు పాక్ పాలకులకు నిద్రలేకుండా చేస్తున్నాయి.
సైఫుల్లా కసూరి హెచ్చరిక
"పాకిస్థాన్ పాలకులు అమెరికా సామ్రాజ్యవాదానికి బానిసలుగా మారారు. అమెరికా ఒత్తిడికి తలవంచి, ఇస్లామిక్ శత్రువైన ఇజ్రాయెల్‌కు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇస్తే పాకిస్థాన్ అనే దేశం పూర్తిగా నాశనమవుతుంది. ఇస్లామిక్ విలువలని పక్కనబెట్టి శత్రువులతో చేతులు కలిపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని సైఫుల్లా కసూరిహెచ్చరించారు.
ఎవరీ సైఫుల్లా కసూరి? భద్రతా దళాల అప్రమత్తత
సైఫుల్లా కసూరి సాధారణ ఉగ్రవాది కాదు. ఐక్యరాజ్యసమితి చేత నిషేధించబడిన, ముంబై దాడుల సూత్రధారి అయిన లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్‌కు అత్యంత నమ్మకస్తుడు, కుడిభుజంగా ఇతడికి పేరుంది. భారత్‌కు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద చర్యలకు ఇతడు వ్యూహరచన చేశాడు. ముఖ్యంగా గత ఏడాది జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఘోర ఉగ్రదాడి వెనుక కసూరియే ప్రధాన సూత్రధారి అని భారత నిఘా వర్గాల నివేదికలు స్పష్టం చేశాయి.
ఇలాంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది నేరుగా పాకిస్థాన్ ఉనికిని ఉద్దేశించి హెచ్చరికలు చేయడంతో గ్లోబల్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఈ పరిణామాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ సమాజం ముందు మంచి దేశంగా నిరూపించుకోవాలని పాక్ ప్రయత్నిస్తుంటే, మరోవైపు తాము పెంచి పోషించిన దేశీయ ఉగ్రవాద భస్మాసురులే ఇప్పుడు ఆ దేశ ఆర్మీని తమ తీవ్రవాద ఎజెండా వైపు నడిపించేందుకు ఒత్తిడి తెస్తున్నారని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ దేశాల ఆర్థిక, రాజకీయ సమీకరణాలను వేగంగా మార్చేస్తున్నాయి. చమురు రవాణా మార్గాలు దెబ్బతినడం వల్ల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల గ్రూపింగ్‌ల మధ్య పాకిస్థాన్ లాంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలు నలిగిపోతున్నాయి. సొంత గడ్డపై ఉన్న ఉగ్రవాదులను అణచాలా లేక అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగాలా అనే సందిగ్ధంలో పాక్ కొట్టుమిట్టాడుతోంది.
లష్కరే తోయిబా చేసిన ఈ తాజా సంచలన హెచ్చరికల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం, అక్కడి ఆర్మీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. పాముకు పాలు పోసి పెంచితే అది చివరకు యజమానినే కరుస్తుందనే సామెత పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.