పశ్చిమాసియాపై దండెత్తుతున్న పాక్ బిచ్చగాళ్లు.. తెరపైకి షాకింగ్ లెక్కలు!

ఇటు భారతదేశంపై పాకిస్థాన్ అనధికారిక సైన్యం (ఉగ్రవాదులు) తోక జాడించే ప్రయత్నం చేయడం, తర్వాత చావుదెబ్బ తినడం వంటి ఘటనలు ఓ పక్క జరుగుతుంటే..;

Update: 2025-12-19 01:30 GMT

ఇటు భారతదేశంపై పాకిస్థాన్ అనధికారిక సైన్యం (ఉగ్రవాదులు) తోక జాడించే ప్రయత్నం చేయడం, తర్వాత చావుదెబ్బ తినడం వంటి ఘటనలు ఓ పక్క జరుగుతుంటే.. మరోవైపు పలు పశ్చిమాసియా దేశాల్లోని నగరాల్లో పాకిస్థాన్ బిచ్చగాళ్లు దండెత్తుతున్నారనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాలను పాకిస్థాన్ పార్లమెంటరీ ప్యానల్ జాతీయ అసెంబ్లీలో విడుదల చేయడం గమనార్హం.

అవును... ఓ పక్క దేశీయ నిషేధిత జాబితాలు, మరోవైపు విదేశీ ప్రభుత్వాల కఠినమైన హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయని వేలాది మంది పాకిస్థానీలు భిక్షాటన కోసం మాత్రమే విదేశాలకు ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇస్లాం రెండు పవిత్ర స్థలాలను కలిగి ఉన్న సౌదీ అరేబియా.. భిక్షాటన కోసం వచ్చిన సుమారు 56,000 మంది పాకిస్థానీలను బహిష్కరించించి.

మరోవైపు.. వ్యవస్థీకృత భిక్షాటన ముఠాలు విదేశాలకు వలస వెళ్లకుండా నిరోధించే క్రమంలో ఈ ఏడాది సుమారు 66,154 మంది ప్రయాణికులను ఆఫ్ లోడ్ చేసినట్లు పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. చాలా కాలంగా విదేశాలలో వీసాలను దుర్వినియోగం చేసే ఈ యాచకుల ధోరణి పాకిస్థాన్ తో పాటు నిజమైన వీసా కోరుకునేవారిని కూడా ఆందోళనకు గురిచేస్తోంది.

కాగా... గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్థానీ యాచకులు పశ్చిమాసియాలోని నగరాలను ముంచెత్తుతున్నారని.. విదేశీ వీధుల్లో భిక్షాటన కోసం తీర్థయాత్ర, పర్యాటక వీసాలను దుర్వినియోగం చేస్తున్నారని.. రోజు రోజుకీ పెరుగుతున్న ఈ సమస్య ఆతిథ్య దేశాలను ఆందోళనకు గురిచేసిందని.. ఇది నిజమైన పాక్ యాత్రికులు, కార్మికులు, విద్యార్థులకు పెద్ద దెబ్బగా మారిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో పరిస్థితిని నియంత్రించకపోతే పాకిస్థాన్ ఉమ్రా, హజ్ యాత్రికులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సౌదీ అరేబియా మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2024లోనే హెచ్చరింది. దీంతో.. బిక్షాటన ముఠాలు ప్రపంచవ్యాప్తంగా పాక్ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బ తీశాయని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చీఫ్ రిఫత్ ముఖ్తార్ తెలిపారు.

ఇదే సమయంలో.. పాకిస్థాన్ బిచ్చగాళ్లు కేవలం సౌదీ అరేబియాకు మాత్రమే పరిమితం కాలేదని.. యూఏఈ, కువైట్, అజర్ బైజాన్, బహ్రెయిన్ సహా అనేక పశ్చిమాసియా దేశాలలో కనిపిస్తున్నారని.. ఈ క్రమంలో పశ్చిమాసియాలో గత ఏడాది నిర్భందించబడిన మొత్తం యాచకుల్లో 90% మంది పాకిస్థాన్ కు చెందినవారే ఉన్నారని.. విదేశీ పాకిస్థానీల కార్యదర్శి జీషన్ ఖాన్జాదా అన్నారు.

Tags:    

Similar News