మెస్సీ ఈవెంట్ విజయం: సీఎం రేవంత్ రెడ్డి మార్క్ హోస్టింగ్, గ్లోబల్ మ్యాప్‌లో హైదరాబాద్!

మెస్సీ టూర్ ఇండియాలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఎవ్వరూ ఊహించని రీతిలో ఘనవిజయం సాధించింది.;

Update: 2025-12-14 05:31 GMT

మెస్సీ టూర్ ఇండియాలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఎవ్వరూ ఊహించని రీతిలో ఘనవిజయం సాధించింది. కోల్ కతాలో జరిగిన గందరగోళం తర్వాత.. భారతదేశానికి మరోసారి అపకీర్తి వస్తుందా? అనే సందేహాల నడుమ దేశవ్యాప్తంగా అందరి చూపు హైదరాబాద్ పైనే పడింది. అయితే తెలంగాణ ప్రభుత్వం, అధికారులు వేగంగా స్పందించి.. పకడ్బందీ ఏర్పాట్లతో లియోనెల్ మెస్సీ ఈవెంట్ ను నిర్వహించి అద్భుత విజయాన్ని సాధించారు. ఈ విజయానికి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత పర్యవేక్షణ, ప్రొఫెషనల్ విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కోల్ కతా తప్పిదాల నుంచి పాఠాలు

కోల్ కతాలో మెస్సీని చూడలేక నిరాశ చెందిన అభిమానులు విధ్వంసానికి పాల్పడ్డడంతో నిర్వాహకుడిని కూడా అరెస్ట్ చేశారు. ఈ చేదు అనుభవాలను పక్కనపెడుతూ హైదరాబాద్ యంత్రాంగం సరికొత్త ఒరవడిని సృష్టించింది. స్పష్టమైన టైమ్ షెడ్యూల్, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, గుంపుల నియంత్రణ, లాజిస్టిక్స్ వంటి ప్రతి అంశాన్ని నిశితంగా పర్యవేక్షించడం ద్వారా ఈవెంట్ నూటికి నూరు శాతం విజయవంతమైంది.

మెస్సీ ముఖంలో సంతోషం, ప్రశాంతత..

ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ మైదానంలో స్వేచ్ఛగా తిరుగుతూ.. పిల్లలు, ఆటగాళ్లు , అభిమానులతో సౌకర్యంగా మమేకమవ్వగలిగారు. ఆయన ముఖంలో కనిపించిన సంతోషం, ప్రశాంతతే ఈవెంట్ విజయానికి ప్రధాన సూచికగా నిలిచింది. ఈవెంట్ లో జరిగిన జరిగిన ప్రత్యేక లేజర్ షోతోపాటు మెస్సీ చిరునవ్వులు, అభిమానులకు చేయి ఊపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ఈరోజు నాకు దక్కిన ప్రేమకు ధన్యవాదాలు. ఇక్కడ ఉండటం మా కోసం గౌరవం..’ అని స్టేడియం విడిచే ముందు మెస్సీ అభిమానులకు సందేశం ఇచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక మార్క్

ఈ ఈవెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత జోక్యం, ప్రొఫెషనల్ దృక్పథంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన అభిమానులకు ఆటంకం కలగకుండా మెస్సీ చుట్టూ భద్రతను పర్యవేక్షిస్తూ కనిపించారు. స్టేడియం సిద్ధతలను సమీక్షించడం.. అధికారులతో సమన్వయం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. క్రీడలపై తన ఆసక్తిని మరోసారి చాటుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ, ఇంటర్ మయామీ సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డీ పాల్ తో కలిసి స్నేహపూర్వక కిక్ అబౌట్ లో పాల్గొన్నారు. ఈ ప్రదర్శన మ్యాచ్ లో పాల్గొనేందుకు కొన్ని వారాలుగా ఆయన ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేయడం అందరి ప్రశంసలు అందుకుంది.

గ్లోబల్ ఫుట్ బాల్ మ్యాప్ పై హైదరాబాద్

శనివారం సాయంత్రం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించిన ఈవెంట్, తెలంగాణ రైజింగ్ సమ్మిట్ విజయానికి కొనసాగింపుగా నిలిచింది. క్రమబద్దత, ఆతిథ్యం, ప్రొఫెషనలిజం విజయం సాధించిన ఈ వేదిక, హైదరాబాద్ ను అంతర్జాతీయ ఈవెంట్లను సమర్ధవంతంగా నిర్వహించగల గ్లోబల్ సిటీగా మరోసారి నిరూపించింది.

‘మెస్సీ , తెలంగాణకు స్వాగతం.. తెలంగాణ రైజింగ్.. ఈ ఎదుగుదలలో భాగస్వామ్యం కావాలి’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఈవెంట్ కు ఉత్సాహాన్ని జోడించాయి. ఈ విధంగా హైదరాబాద్ ఈవెంట్ సానుకూల వాతావరణంలో ముగిసి ప్రపంచం దృష్టిని మరోసారి తనవైపుకు తిప్పుకుంది.




Tags:    

Similar News