వైసీపీకి టీడీపీకి తేడా చెప్పిన మర్రి
తాజాగా ఆయన శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషెన్ రాజుని కలిసి తన రాజీనామాకు కారణాలు చెప్పారు.;
మర్రి రాజశేఖర్. పక్కా కాంగ్రెస్ వాది. కాంగ్రెస్ నుంచే ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్సార్ మీద అభిమానంతో ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆయన జగన్ వెంట నడిచి వైసీపీలో కూడా కీలకంగా వ్యవహరించారు. ఇక ఆయన 2014లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ఓటమి చూశారు. 2019 లో ఆయనని తప్పించి పార్టీలో కొత్తగా చేరిన విడదల రజనీకి టికెట్ ని ఇచ్చారు. ఇక మంత్రిని చేస్తామని చెప్పినా ఎమ్మెల్సీ పదవి చివరికి ఇచ్చారు. మంత్రిని అయితే చేయలేదు, 2024 ఎన్నికల్లో కూడా చిలకలూరిపేట టికెట్ ఇవ్వలేదు. దాంతో అన్నీ చూసిన మర్రి రాజశేఖర్ 2025 లో పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు.
ప్రజాస్వామ్యం ఎక్కువ :
తాజాగా ఆయన శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషెన్ రాజుని కలిసి తన రాజీనామాకు కారణాలు చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నా రాజీనామాకు కారణాలు వ్యక్తిగతం అయినా వైసీపీ తీరని అన్యాయం చేసింది కాబట్టే అందులో నుంచి బయటకు వచ్చాను అని కుండబద్ధలు కొట్టారు. అంతే కాదు వైసీపీ కంటే టీడీపీ ఎంతో బెటర్ అన్నారు వైసీపీలో లేనిది టీడీపీలో ఉన్నది ప్రజాస్వామ్యం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కంటే ప్రజాస్వామ్యం టీడీపీలో ఎక్కువ అని కూడా పేర్కొన్నారు. తాను కమ్మ అని టీడీపీ ఆ పార్టీలోకి తీసుకోలేదని నాకు ఎంతో గౌరవం ఇచ్చిన పార్టీ టీడీపీ అన్నారు.
వైసీపీ దూరం :
తనను అకారణంగా వైసీపీ నేతలు దూరం పెట్టారని మర్రి రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేసారు. తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను అని ఆయన అన్నారు. కానీ పార్టీ మాత్రం తనను కావాలనే దూరం పెడుతూ వచ్చింది అని ఆయన చెప్పారు. వైసీపీలో తనకు ఎంతో అన్యాయం జరిగిందని అందుకే తానుగానే పార్టీకి రాజీనామా చేశాను అన్నారు.
అది నా హక్కు :
తాను రూల్ బుక్ లో ఉన్న ప్రకారమే తన పదవికి రాజీనామా చేశాను అని ఆయన చెప్పారు అది తన హక్కు అన్నారు. తాను స్వచ్చందంగా రాజీనామా చేశాను అని అందువల్ల తన రాజీనామాను ఆమోదించాల్సిందే అని ఆయన అంటున్నారు. మొత్తానికి మర్రి రాజశేఖర్ చాలా కాలంగా తనలో దాచుకున్న ఆక్రోశాన్ని ఈ విధంగా వెళ్లగక్కారు అనుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో టీడీపీ తనను ఆదరించింది అని ఆయన చెబుతున్నారు. వైసీపీలో తనకు ఏ విధంగా ఇబ్బందులు కలిగాయో కూడా ఆయన చెబుతూ ఆ పార్టీ వద్దు పదవీ వద్దు రాజీనామా చేశాను కనుక ఆమోదించాల్సిందే అని పట్టుబడుతున్నారు. మరి చైర్మన్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.