హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ.. దేవ్ జీ, రాజ్ రెడ్డిపైనా క్లారిటీ

గతనెల 9న పార్టీ నుంచి కోసాల్ అనే సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు లొంగిపోయాడని, అతనికి హిడ్మా సమాచారం తెలుసనని వికల్ప్ ఆ లేఖలో పేర్కొన్నారు.;

Update: 2025-12-05 08:43 GMT

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. హిడ్మాను పోలీసులు పట్టుకుని కాల్చేశారని ఆరోపించింది. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మీడియా అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట తాజాగా ఓ లేఖ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. గత నెల 27నే ఈ లేఖ విడుదల చేయగా, తాజాగా బయటకు వచ్చింది. ఏపీలోని మారేడుమిల్లిలో నవంబరు 18న మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ జరిగింది. అయితే ఆ నెల 15న హిడ్మాను అరెస్టు చేశారని, మూడు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి 18న ఎన్‌కౌంటర్‌ చేసినట్లు ప్రకటించారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

మావోయిస్టు నేత హిడ్మాకు ఎవరెవరు కారణం అన్న విషయాలను వివరిస్తూ అధికార ప్రతినిధి వికల్ప్ ఆ లేఖలో తెలియజేశారు. హిడ్మాతోపాటు మరో ఐదుగురిని నవంబరు 15న పోలీసులు విజయవాడలో అరెస్టు చేశారని వెల్లడించారు. అక్టోబరు 27న విజయవాడకు చెందిన ఓ కలప, ఫర్నీచర్ వ్యాపారి ద్వారా వైద్యం కోసం హిడ్మా దండకారణ్యం నుంచి బయటకు వచ్చాడని మావోయిస్టు పార్టీ తెలిపింది. హిడ్మా వెళ్లిన తరువాత మరికొందరు విజయవాడ వెళ్లారని, ఈ సమాచారం తెలిసిన పోలీసులు నిరాయుధుడైన హిడ్మాను పట్టుకున్నారని మావోయిస్టు పార్టీ వివరించింది.

గతనెల 9న పార్టీ నుంచి కోసాల్ అనే సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు లొంగిపోయాడని, అతనికి హిడ్మా సమాచారం తెలుసనని వికల్ప్ ఆ లేఖలో పేర్కొన్నారు. కోసాల్ తోపాటు విజయవాడకు చెందిన కలప వ్యాపారి, బిల్డర్-సివిల్ కాంట్రాక్టర్, అల్లూరి జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్ హిడ్మా ఎన్‌కౌంటర్‌ కు కారణమని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. అదే సమయంలో హిడ్మా ఎన్‌కౌంటర్‌ కు మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ కారణమన్న ఆరోపణలను ఖండించింది. అగ్రనేతలు దేవుజీ, రాజిరెడ్డి పార్టీలో సురక్షితంగా ఉన్నట్లు లేఖలో వికల్ప్ వెల్లడించారు.

ఈ లేఖతో కొన్నిరోజులుగా మావోయిస్టు అగ్రనేతలు దేవుజీ, రాజిరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు జరిగిన ప్రచారం ఉత్తదే అని తేలిపోయింది. అదే సమయంలో హిడ్మా ఎన్‌కౌంటర్‌ కు దేవుజీ, రాజిరెడ్డి కారణమ్న ప్రచారం కూడా గిట్టని వారి ఎత్తుగడగానే మావోయిస్టు పార్టీ సందేహిస్తోందని అంటున్నారు. మరోవైపు దేవ్ జీ, రాజిరెడ్డి లొంగిపోయే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తోసిపుచ్చింది.

Tags:    

Similar News