మమత హల్ చల్...బీజేపీకి హుషార్ !
రాజకీయాల్లో ఒక కొండ గుర్తు ఉంది. అదేంటి అంటే పోలింగ్ ముగిసిన తరువాత ఇది అన్యాయం అక్రమం అని ఎవరు అంటారో వారు ఓడిపోతున్నట్లుగా లెక్క అన్నది.;
రాజకీయాల్లో ఒక కొండ గుర్తు ఉంది. అదేంటి అంటే పోలింగ్ ముగిసిన తరువాత ఇది అన్యాయం అక్రమం అని ఎవరు అంటారో వారు ఓడిపోతున్నట్లుగా లెక్క అన్నది. రిగ్గింగ్ జరిగింది, ఎన్నికల్లో తప్పుడు విధానాలు అనుసరించారు అని ఎవరైనా ఆరోపిస్తే వారు ఓటమి బాటన ఉన్నారని కూడా విశ్లేషిస్తారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారీ పోలింగ్ జరిగింది. ఈవీఎంలలో ఓటర్ల తీర్పు పదిలంగా ఉంది. అయితే సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం హల్ చల్ చేస్తున్నారు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఆమె హడావుడి చేస్తున్నారు. దీంతో ఆమెది ఓటమి భయం అని బీజేపీ అంటోంది.
ఈవీఎంల మీద అనుమానమా :
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రజలు ఓట్లు వేసిన తరువాత ఈవీఎం లను స్ట్రాంగ్ రూములలో భద్రపరిచిన తర్వాత అక్కడ ఏదైనా జరగొచ్చు ఏమో అన్న అనుమానం మమత దీదీని వెంటాడుతుంది. అందుకే ఆమె ఈవీఎంల భద్రతను నిర్ధారించుకోవడానికి మమతా బెనర్జీ ఏకంగా అర్ధరాత్రి భవానీపూర్‌లోని స్ట్రాంగ్ రూమ్‌ను సందర్శించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద అర్ధరాత్రి హల్ చల్ చేశారు.అధికార పార్టీ కేంద్రంలో ఉన్న పార్టీ బిజెపి ఈవీఎంలు ప్రభావితం చేస్తున్న అనుమానంతో ఆమె ఒక విధంగా కాపలా కాశారు. మహారాష్ట్ర బీహార్ హర్యానా తదితర రాష్ట్రాల్లో జరిగినట్లుగా బెంగాల్ లో జరగనివ్వమని, ఈవీఎంల ద్వారా టాంపరింగ్ చేసే చర్యలను అడ్డుకుని తీరుతామని మమత స్పష్టం చేస్తున్నారు.
దీదీ ఏమిటిది :
నిజం చెప్పాలీ అంటే మమత గతంలో ఎప్పుడూ ఇలా వ్యవహరించలేదు అని అంటున్నారు. 2021 లో జరిగిన ఎన్నికలు ఈవీఎంలతోనే నిర్వహించారు. ఆనాడు మమత వాటి ద్వారానే గెలిచారు. అంతకు ముందు కూడా ఈవీఎంలతోనే పలు మార్లు ఎన్నికలు జరిగాయి. ఇలా వరుసగా మూడుసార్లు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆమె ఏనాడు అని ఈవీఎంల విషయంలో ఇలా తీవ్రమైన ఆరోపణలు చేయలేదు. కానీ ఈసారి మాత్రం మేనేజ్ చేస్తారని బిజెపి మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. దాంతో మమత తీవ్ర అసహనంతో ఉన్నారని బిజెపి నేతలు అంటున్నారు ఓటమి భయం మమతను వెన్నాడుతోందని బిజెపి నేతలు విమర్శిస్తున్నారు.
క్యాడర్ కి పిలుపు :
ఒక సీనియర్ నాయకురాలుగా ముమ్మారు ముఖ్యమంత్రిగా చేసిన కీలక నేతగా దేశంలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీకి అధినేతగా ఉన్న మమత బెనర్జీ ఇలా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే గడిచిన రెండు మూడేళ్లలో దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేస్తున్నారు అన్న దాని మీద అనుమానాలను ఇండియా కూటమి వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇండియా కూటమిలో లో కీలక నేతగా ఉన్నా మమతా బెనర్జీ కూడా బీజేపీ ఈ మధ్య కాలంలో వివిధ రాష్ట్రాలలో సాధించిన విజయాలను అసలు ఒప్పుకోవట్లేదు. ఈవీఎంలను మేనేజ్ చేయడం ద్వారానే ఈ విజయం లభిస్తున్నాయి ఆమె గతంలో ఆరోపించారు కూడా. ఇప్పుడు మీరు నేరుగా తన రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈవీఎంల మీద అప్రమత్తంగా ఉండాలని ఆమె కార్యకర్తలను కోరుతూనే బీజేపీ మీద పూర్తి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈసీ వివరణ :
ఇదిలా ఉంటే మమతా బెనర్జీ ఆరోపణ కేంద్ర ఎన్నికల సంఘం కొట్టి పారేసింది ఈవీఎంల వద్ద గట్టి భద్రత నిఘా ఉన్నాయని అందువల్ల ఎటువంటి అక్రమాలకు తావు లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. అదే సమయంలో బీజేపీ నేతలు అయితే మమత ఓటమి అంచుల్లో ఉన్నారని అందుకే ఆమె ఈ రకంగా మాట్లాడుతున్నారని కౌంటర్ వేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పక్కన పెడితే మమతా బెనర్జీ మొదటి దశ ఎన్నికల తర్వాత నుంచి కొంత అసహనంతోనే వ్యవహరిస్తున్నారని అంటున్నారు. భారీ ఎత్తున పోలింగ్ రెండు దశల్లో జరగడం బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టం కావడం అదేవిధంగా ప్రజా వ్యతిరేకత అన్నది బెంగాల్ ఎన్నికల్లో స్పష్టం కావడంతో మమతా బెనర్జీ సహా తృణమూల్ కాంగ్రెస్ పెద్దల్లో ఒక రకమైన కలవరం రేగుతోందని అంటున్నారు. అందుకే తాను గెలిస్తే ప్రజా విజయమని అదే బిజెపి గెలిస్తే మేనేజ్ చేసారని మమత చెప్పదలిచారు అన్న విశ్లేషణ కూడా ఉన్నాయి వాస్తవంగా చూస్తే బెంగాల్ ఎన్నికల్లో ఎవరు లేని విధంగా మధ్యతరగతి యువత అలాగే మహిళలు ప్రత్యేకించి ఓటు చేయడం జరిగింది. దాంతో ఎన్నికల్లో అధికార మార్పు తద్యమని సహజంగా ఒక విశ్లేషణ ఉంది.
అధిక పోలింగ్ భయం :
ఇంకో వైపు చూస్తే అధిక పోలింగ్ జరిగినప్పుడు అధికార పార్టీలు ఓటమిని అందుకోవడం భారతీయ రాజకీయ చరిత్రలో ఉంది ఇప్పుడు అదే భయం మమతను ఆవహించిందా లేక నిజంగానే బీజేపీ ఈవీఎంలను మేనేజ్ చేస్తున్న భయం ఆమెను వెంటాడుతోందా అన్నది తెలియదు కానీ మమత పోకడలను చూసిన వారికి మాత్రం బెంగాల్ లో ఏదో జరగబోతోంది అని మాత్రం అర్థం అవుతోంది. చూడాలి మరి మే 4న వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది.