మోస్ట్ వాంటెడ్.. ఆర్థిక నేరస్తుల 'బర్త్ డే' పార్టీ.. కేంద్రానికి సెగ!
వారిద్దరూ పలు బ్యాంకులను మోసం చేశారు. వందల కోట్ల రూపాయల ధనాన్ని ఎగవేశారు. ఎంచక్కా.. దేశం విడిచి వెళ్లిపోయారు. పైగా.. తరచుగా కవ్విస్తున్నారు కూడా.;
వారిద్దరూ పలు బ్యాంకులను మోసం చేశారు. వందల కోట్ల రూపాయల ధనాన్ని ఎగవేశారు. ఎంచక్కా.. దేశం విడిచి వెళ్లిపోయారు. పైగా.. తరచుగా కవ్విస్తున్నారు కూడా. వీరిపై దేశంలో అనేక కేసులు కూడా నమోదయ్యాయి. వారే.. ఒకరు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధిపతి విజయ్ మాల్యా, మరొకరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ. వీరిద్దరూ.. భారత్‌కు మోస్ట్ వాంటెడ్. నేరస్తుల జాబితాలో వీరిద్దరూ ఉన్నారు. వీరిని భారత్‌కు తీసుకువచ్చే ప్రయత్నాలు కొన్నాళ్లుగా సాగుతున్నా అవి ఫలించడం లేదు.
వారి గొంతెమ్మ కోరికలు అలా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో జైళ్లను తయారు చేయాలని.. తమకు అందించే వైద్య, ఆహారం ప్రపంచ స్థాయిలో ఉండాలని.. స్థానిక కోర్టుల్లో సదరు ఆర్థిక నేరస్తులు .. పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ కొనసాగుతూ నే ఉంది. ఇదిలావుంటే.. తాజాగా ఈఇద్దరు నేరస్తులు కలిసి.. భారీ ఎత్తున బర్త్ డే పార్టీ చేసుకున్నారు. పుట్టినరోజు ఒక్కరిదే అయినా.. భాగస్వామ్యం మాత్రం ఇద్దరిదీ. లలిత్ మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన సతీమణి ఇచ్చిన భారీ విందు పార్టీకి విజయ్ మాల్యా కూడా హాజరయ్యారు.
ప్రస్తుతం వీరిద్దరూ లండన్‌లోనే సురక్షితంగా ఉన్నారు. ఈ క్రమంలో లండన్‌లోని మేఫెయిర్‌లో ఉన్న ఖరీదైన మ్యాడాక్స్ క్లబ్‌లో మోడీ సతీమణి రీమా భారీ విందు ఇచ్చారు. అత్యంత తక్కువ మంది సన్నిహితుల మధ్యే ఈ పార్టీ జరిగినా.. దీనికి సంబంధిం చిన విజువల్స్, ఫొటోలు లీకయ్యాయి. ఈ వ్యవహారం కాస్తా రాజకీయంగా చర్చకు వచ్చింది. ఇంత జరుగుతున్నా.. మోడీ సర్కారు వారిని తీసుకురాలేక పోయిందని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. ``లండన్‌లో వారు ఖుషీగా ఉన్నారు. పార్టీలు కూడా చేసుకుంటున్నారు. కానీ, మోడీ మాత్రం వారి వంక కన్నెత్తి చూడరు. పన్నెత్తి పలకరించరు.`` అని కాంగ్రెస్ ఎంపీలు వ్యాఖ్యానించారు.
ఇవీ..మోసాలు!
విజయ్ మాల్యా, లలిత్ మోడీలు భారీ ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనల కేసుల్లో లలిత్ మోడీపై కేసులు నమోదయ్యాయి. వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఈడీ ఆరోపించింది. ఈయన 2010లోనే దేశాన్ని వీడి వెళ్లిపోయారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. ఇక, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధిపతి, వ్యాపార వేత్త.. విజయ్ మాల్యా ఎస్ బీఐ సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగవేశారన్న కేసులు వెంటాడుతున్నాయి. దీంతో వీరిద్దరినీ కేంద్ర ప్రభుత్వం 2020లోనే ఆర్థిక నేరస్తుల జాబితాలో చేర్చింది.