ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రశ్న అడిగితే సీఎంగా ఉన్నప్పుడు జవాబు

ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ సభలో మాట్లాడుతూ.. అధికారుల అలసత్వంతో అంశాన్ని లేవనెత్తారు.;

Update: 2026-02-25 08:30 GMT

చట్టసభల్లో ప్రశ్న అడిగితే.. దానికి సమాధానం ఎప్పుడు వస్తుంది? అని ప్రశ్నిస్తే.. ఒక రోజు.. రెండు రోజులు కాదంటే.. అసెంబ్లీ సమావేశాలు జరిగే సెషన్ లో. మరీ ఆలస్యమనుకుంటే ఆ తర్వాతి సెషన్ లో అని చెబుతారు. కానీ. ఇందుకు భిన్నంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు నోరెళ్లబెట్టాల్సిందే. ఇలా కూడా జరుగుతుందా? అన్న సందేహం కూడా రావొచ్చు. కానీ.. సదరు విషయాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా చెప్పిన తర్వాత నమ్మకుండా ఉండలేని పరిస్థితి. ఇంతకూ అదేమంటే.. మహారాస్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా అసెంబ్లీలో చెప్పిన ఉదంతం గురించి తెలిసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు.

అదేమంటే.. అధికార బీజేపీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి సుధీర్ ముంగంటివార్ సభలో మాట్లాడుతూ.. తాము అసెంబ్లీలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఆలస్యంగా వస్తున్నట్లు పేర్కొకొన్నారు. చట్టసభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు అధికారులు ఆలస్యం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇదే అంశంపై స్పందించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. తనకూ ఇలాంటి సమస్యే ఎదురైందని పేర్కొంటూ తనకు ఎదురైన అనుభవాన్ని పేర్కొన్నారు.

తాను 2009లో అడిగిన ప్రశ్నకు 2021లో సమాధానం వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడిగిన ప్రశ్నకు 2021లో సమాధానం వచ్చిందని.. అప్పటికే తాను ముఖ్యమంత్రిని అయినట్లుగా పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా కూడా పని చేసినట్లుగా గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ సభలో మాట్లాడుతూ.. అధికారుల అలసత్వంతో అంశాన్ని లేవనెత్తారు. ఎమ్మెల్యేలు రాసే లేఖలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైతం స్పందించటం లేదని పేర్కొంటూ తాను అడిగిన ప్రశ్నకు నాలుగేళ్ల తర్వాత సమాధానం వచ్చిందన్నారు.

అధికారుల జవాబుదారీ తనం.. తప్పు చేసే అధికారులపై చర్యలు తీసుకోవటానికి వీలుగా చట్టం తీసుకురావాలన్నారు. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న స్పీకర్ రాముల్ నర్వేకర్ రియాక్టు అవుతూ.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు వేగంగా సమాధానం ఇచ్చేలా డిజిటల్ వేదికల్ని సిద్ధం చేస్తున్నామని.. దీంతో ఆలసత్వానికి బాధ్యులైన వారి వివరాలు తేలతాయని చెప్పటంతో ఈ ఇష్యూ అక్కడితో ముగిసింది.

Tags:    

Similar News