హిడ్మా ఊళ్లో ఇంటికో మావోయిస్టు.. 50 ఇళ్లలో 90 మంది మావోయిస్టులే..

మావోయిస్టు మిలట్రీ ప్లటూన్ సుప్రీం మడ్వి హిడ్మా మృతదేహం ఆయన స్వస్థలం పూవర్తికి చేరింది.;

Update: 2025-11-20 12:30 GMT

మావోయిస్టు మిలట్రీ ప్లటూన్ సుప్రీం మడ్వి హిడ్మా మృతదేహం ఆయన స్వస్థలం పూవర్తికి చేరింది. అల్లూరి జిల్లా రంపచోడవరం మండలంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన కాల్పుల్లో హిడ్మా మరణించిన విషయం తెలిసిందే. మృతదేహానికి పోస్టుమార్టం చేసిన అనంతరం ఆయన స్వగ్రామం పూవర్తికి తరలించారు. చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దక్షిణ సుక్మా జిల్లా పూవర్తి. ఒకప్పుడు మావోయిస్టులు నడిపిన జనతన సర్కార్ కు పూవర్తి కేంద్రంగా ఉండేది.

ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత భద్రతాబలగాలు పట్టు పెరగడంతో మావోయిస్టులు పూవర్తిని సైతం వీడాల్సివచ్చింది. ఈ కారణంగా మడ్వి హిడ్మా కూడా తన సొంతూరికి వెళ్లలేకపోయాడు. ఆయన సోదరుడు, సోదరి కూడా మావోయిస్టులే కావడం గమనార్హం. వీరిద్దరూ గతంలోనే మరణించారు. ఇక హిడ్మా సొంతూరు పూవర్తిలో 50 ఇళ్లు ఉండగా, గ్రామంలో దాదాపు 90 మంది వరకు మావోయిస్టు ఉద్యమంలో చేరారు. గత ఏడాది హిడ్మా సొంతూరు పూవర్తిపై పట్టు సాధించిన బలగాలు.. ప్రస్తుతం నిరంతరం పహరా కాస్తున్నారు.

గత లోక్ సభ ఎన్నికల్లో పూవర్తిలో పోలింగ్ ఏర్పాటు చేయడం అధికార యంత్రాంగానికి సవాల్ గా మారింది. ఈ గ్రామంలోని పోలింగ్ బూత్ పరిధిలో సుమారు 547 ఓట్లు ఉంటే కేవలం 31 మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక పూవర్తిలో ఒక్కరు కూడా ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. ఇదే గ్రామానికి చెందిన బార్స దేవా కూడా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా భద్రతా బలగాలు చెబుతున్నాయి. హిడ్మా నేతృత్వం వహించే పీఎల్జీఏ ప్లటూన్ కు నంబర్ వన్ పొజిషన్ లో హిడ్మా ఆ తర్వాత స్థానం దేవాదిగా చెబుతున్నారు. ప్రస్తుతం దేవా కూడా పరారీలోనే ఉన్నాడు.

ఇక హిడ్మా ఎన్కౌంటరు వార్తలతో ఆయన స్వగ్రామం పూవర్తిలో నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. హిడ్మా మరణించాడనే సమాచారం తెలుసుకున్న బంధువులు, చుట్టుపక్కల గ్రామాల వారు ఆయన తల్లి మాంజును పరామర్శించేందుకు వస్తున్నారు. వృద్ధాప్యంతో నడవలేని స్థితిలో ఉన్న మాంజు కుమారుడు మరణంతో బాగా కుంగిపోయారు. హిడ్మా పోలీసులకు లొంగిపోవాలంటూ కొద్దిరోజుల క్రితమే మాంజు వీడియో విడుదల చేశారు. ఇంతలోనే ఆయన ఎన్కౌంటరు అవడంతో ఆమె తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

Tags:    

Similar News