మెడగాస్కర్ ను కుదిపేస్తున్న జన్ జీ ఉద్యమం..
సెప్టెంబరు 25వ తేదీ నుంచి మడగాస్కర్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. మొదట అవి విద్యుత్ సరఫరా సమస్యలపై నిరసనలుగానే ఉన్నాయి.;
హిందూ మహాసముద్రంలోని అందమైన ద్వీప దేశం ‘మడగాస్కర్’. ఆ దేశ ద్వీపం ఇప్పుడు ఒక అగ్నిగుండంలా మారింది. చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఆందోళనలు జెన్ Z విప్లవం రాజకీయ వ్యవస్థను కుదిపేశాయి. విద్యుత్ కోతలు, నీటి కొరత, అవినీతి, బంధుప్రీతి ఇవన్నీ నిరసనలకు కేంద్రంగా మారాయి. ఇప్పుడు ఆ జ్వాల అధికార గృహాల గోడలను బద్ధలు కొడుతోంది.
యువత ఆగ్రహం
సెప్టెంబరు 25వ తేదీ నుంచి మడగాస్కర్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. మొదట అవి విద్యుత్ సరఫరా సమస్యలపై నిరసనలుగానే ఉన్నాయి. కానీ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది. ఆ తర్వాత అవి క్రమంగా ‘సిస్టమ్ చేంజ్’ ఉద్యమంగా మారాయి. యువత రోడ్లపైకి దిగి ‘మాకు మార్పు కావాలి’ అని నినాదాలు చేయడం మొదలు పెట్టింది. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఆందోళనలను అణచివేయాలనే తపనలో పోలీసులు, సైన్యాన్ని రంగంలోకి దించింది. కానీ ఆశ్చర్యకరంగా, సైన్యం కొంత మంది యువత పక్షాన నిలిచింది. ఈ దశలోనే మడగాస్కర్‌లో ‘సైనిక విభజన’ ప్రారంభమైంది. అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా స్వయంగా ‘ఇది సైనిక తిరుగుబాటే’ అని ప్రకటించాల్సి వచ్చింది.
సైన్యం వర్సెస్ పోలీస్
శనివారం (అక్టోబర్11) జరిగిన ఘర్షణలో సైన్యం, పోలీసులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో ఒక సైనికుడు మరణించాడు. ఇది మడగాస్కర్ రాజకీయ అస్థిరతను బయటపెట్టింది. ఇంత కాలం సైన్యం ప్రభుత్వానికే రక్షణగా ఉండేది. ఇప్పుడు అదే సైన్యం ప్రజల పక్షాన నిలబడటమే పరిస్థితిని సంక్లిష్టం చేసింది. ఈ పరిణామం కేవలం ఒక నిరసన కాదు. అది ప్రభుత్వ వ్యవస్థలపై యువత నమ్మకం పూర్తిగా కూలిపోయిందనే సంకేతం.
కొత్త తరం ఆలోచనలతో జెన్ Z పోరాటం..
జెన్ Z అనే తరాన్ని కేవలం సోషల్ మీడియా తరంగా చూస్తున్నాం. కానీ ఈ తరం ప్రపంచ వ్యాప్తంగా తమ స్వరం వినిపిస్తోంది. నేపాల్, చిలీ, ఫ్రాన్స్, శ్రీలంక, ఇరాన్ ఇప్పుడు మడగాస్కర్.
ఈ తరం మౌనం ఉండదని నిరూపిస్తోంది. అవినీతి, అసమానత, ఆర్థిక అన్యాయంపై డిజిటల్ యుగం ఆందోళన మొదలైంది. మడగాస్కర్ యువతకు ఇంటర్నెట్ వేదికగా మారింది ట్విట్టర్, టిక్‌టాక్, టెలిగ్రామ్ ద్వారా వారి ఉద్యమం వేగం అందుకుంది. ఇది ‘సామాజిక మీడియా విప్లవం’ నుంచి ‘రాజకీయ విప్లవం’గా మారింది.
ఆలోచనలో ప్రభుత్వం..
అందోళనలను అణిచేందుకు అధ్యక్షుడు రాజోలినా ప్రభుత్వం రద్దు చేశారు.
ఒక సైనిక జనరల్‌ను ప్రధానిగా నియమించడం, ప్రభుత్వం స్థిరత్వం తీసుకురావడమే లక్ష్యంగా కనిపించినా.. ప్రజల్లో ఇది ‘సైనిక నియంత్రణకు ప్రారంభం’గా కనిపించింది. ఇదే నిర్ణయం యువతను మరింత ఉద్రేకంగా మారింది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం మెడగాస్కర్ లో 22 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. దేశంలో అత్యవసర వాతావరణం నెలకొంది.
యువత స్వరం వినకుంటే..
ప్రపంచం ఇప్పుడు మార్పు దశలో ఉంది. జెన్ Z తరం పుస్తకాల్లో కాదు, వీధుల్లో పాఠాలు చెబుతోంది. మడగాస్కర్‌లో జరుగుతున్నది కేవలం ఒక దేశం కథ కాదు.. అది ప్రభుత్వాలు యువత స్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్పే పాఠం.
మడగాస్కర్ ప్రభుత్వం పాలనలో విఫలమైంది.. దీనిపై యువత ప్రతిస్పందన సహజం. కానీ సైన్యాన్ని రాజకీయ పోరాటంలోకి లాగడం, ఆ దేశానికి ప్రమాదకరం. సైనిక తిరుగుబాటు శాంతిని తేబోదు. అది మరో చీకటి అధ్యాయాన్ని తెరుస్తుందనేందు ఇది కూడా ఒక ఉదాహరణ.