‘లులు’ అవసరం ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ అభ్యంతరం
రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని ప్రయోజనం పొందుతున్న లులూ తిరిగి ప్రభుత్వానికే షరతులు విధించడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.;
ఏపీ కేబినెట్ భేటీలో ‘లలూ’ గ్రూప్ పై వాడివేడి చర్చ జరిగింది. విజయవాడ సమీపంలోని మల్లవల్లి పారిశ్రామిక వాడలో లులూ గ్రూపునకు చెందిన మెస్సర్స్ ఫెయిర్ ఎక్స్ఫోర్ట్సుకు 7.8 ఎకరాలను లీజుకు ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదించారు. ఈ స్థలంలో కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు లులూ ముందుకు వచ్చినట్లు అధికారులు కేబినెట్ ద్రుష్టికి తీసుకువెళ్లారు. అయితే లులూ ప్రాసెసింగ్ యూనిట్ పై సమగ్ర సమాచారం చెప్పాలని అధికారులను కోరిన డిప్యూటీ సీఎం పవన్.. పలు ప్రశ్నలు లేవనెత్తినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ తోపాటు సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ లులూ గ్రూప్ వ్యవహరిస్తున్న తీరుపై వరుస ప్రశ్నలు సంధించినట్లు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని ప్రయోజనం పొందుతున్న లులూ తిరిగి ప్రభుత్వానికే షరతులు విధించడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. లులూ గ్రూపునకు భూ కేటాయింపులపై చర్చ జరుగుతున్న సమయంలో కల్పించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్.. లులూ గ్రూప్ తీసుకునే భూమిలో ఏం చేస్తుందని ప్రవ్నించారు. ఆహారశుద్ధి అని ఊరకే అనుకుంటే కుదరదని, అక్కడ అసలు ఏం చేస్తారు? కూరగాయలు, పండ్లు సాగు చేస్తారా? ఉద్యానవన పంటలు సాగుచేస్తారా? లేక కబేళాను నిర్వహించి గోవధ చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా? అని పవన్ నిలదీశారు. గోవధ జరగడానికి వీల్లేదని, ఇందుకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. దీంతో అధికారులు నీళ్లు నమిలారు.
ఫుడ్ ప్రాసెసింగ్ అంటూ అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని రాష్ట్ర పరిధిలో ఎక్కడ గోవధ జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మాత్రమే అనుమతి ఇవ్వాలని సూటిగా స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. మామిడి, బొప్పాయి వబంటిబ పండ్లు మాత్రమే ప్రాసెస్ చేస్తారని చెప్పారు. ఆ తర్వబాతబ లులూ గ్రూపు వ్యవహారశైలి, దానికి భూ కేటాయింపులు, స్థానికంగా ఉద్యోగాల కల్పన, రెంటల్ అగ్రిమెంట్లు వంటి పలు కీలక అంశాలను పవన్ ప్రస్తావించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇవే అంశాలను లేవనెత్తారు.
లీజు మొత్తాన్ని 5 ఏళ్లకు 5 శాతం మాత్రమే పెంచడంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. నిబంధనల ప్రకారం మూడేళ్లకు 10 శాతం పెంచాలి కదా? అంటూ ప్రశ్నించారు. ‘లులూ’ యాజమాన్యం పదేపదే కోరడం, పెద్ద పరిశ్రమ వస్తుంది, స్థానికులకు ఉద్యోగాలు వస్తాయనే ఆలోచనతో కొన్ని సడలింపులు ఇచ్చినట్లు అధికారులు వివరణ ఇవ్వగా, ఉపముఖ్యమంత్రి పవన్ ఘాటుగా స్పందించినట్లు చెబుతున్నారు. లులూ గ్రూపు ప్రభుత్వ భూములు తీసుకుని, తన అవసరం ప్రభుత్వానికే ఉందన్నట్లు వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. విశాఖ, విజయవాడల్లో ఆ సంస్థకు ఏ ప్రాతిపదికన భూములు కేటాయిస్తున్నారు? ఇందుకు అనుసరిస్తున్న విధానాలు, మార్గదర్శకాలు ఏమిటని పవన్ ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద భూములు తీసుకుని తిరిగి ప్రభుత్వానికే కండీషన్లు పెట్టడం ఎక్కడి చోద్యమంటూ పవన్ ప్రశ్నించారని చెబుతున్నారు.
మూడేళ్లు ఒకసారి లీజు పెంచాలని ప్రభుత్వ అగ్రిమెంట్లలో ఉంటుంది. కానీ, ఆ కంపెనీ పదేళ్లకు ఒకసారి పెంచుతామని అంటోది. దీనిపై మీరేం చెబుతారని పవన్ అధికారులను నిలదీశారు. మాల్స్ నిర్మించాక లులూ షాప్ ల రెంట్స్ ఎలా పెంచుతుంది? మూడేళ్లకు ఒకసారి అద్దెలు పెంచుతారా? పదేళ్లు ఒకసారి పెంచుతారా? కచ్చితంగా పదేళ్లకు ఒకసారి పెంచుతారు కదా? వారికో న్యాయం? ప్రభుత్వానికో న్యాయమా? అంటూ పవన్ ప్రశ్నలు సంధించారు.
ఇక లులూ మల్స్ లో ఉద్యోగాల కల్పనపైనా ఈ సందర్భంగా చర్చ జరిగింది. లులూ మాల్స్ లో వారి మనుషులకే ఉద్యోగాలిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని, మనవాళ్లకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు భూములు ఇచ్చి ప్రయోజనం ఏంటని పవన్ ప్రశ్నించారు. కచ్చితంగా స్థానికులకు ఉపాధి కల్పించాలన్న నిబంధన ఉండాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ కల్పించుకుని ‘లులూ గ్రూపు’ను గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి తరిమేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వారికి ప్రోత్సహాకాలు ఇస్తున్నాం. అయితే లులూ కండీషన్లు పెట్టడాన్ని పరిశీలిస్తున్నాం, రాష్ట్రానికి ప్రజలకు మేలు చేసే నిర్ణయం మాత్రమే తీసుకుందామని ప్రతిపాదించారు. దీంతో ఈ చర్చ ముగిసినట్లు చెబుతున్నారు.