ట్రంప్ వద్దు.. మోడీ చాలు.. బ్రెజిల్‌ అధ్యక్షుడు డిసిల్వా సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన చర్చల ఆహ్వానాన్ని బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డిసిల్వా స్పష్టంగా తిరస్కరించారు.;

Update: 2025-08-06 15:30 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన చర్చల ఆహ్వానాన్ని బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డిసిల్వా స్పష్టంగా తిరస్కరించారు. ‘‘ట్రంప్‌కి కాల్‌ చేయను.. నాకు అవసరం అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీకి, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఫోన్‌ చేస్తాను. పుతిన్‌కు కూడా కాల్‌ చేయను. ఎందుకంటే ఆయన మాతో ప్రయాణించడం లేదు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బ్రెజిల్‌ రాజధాని బ్రసిలియాలో జరిగిన మీడియా సమావేశంలో డిసిల్వా మాట్లాడుతూ ‘‘మా దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) సహా అన్ని ఆప్షన్లను వినియోగిస్తాం. విదేశీ వాణిజ్యాన్ని బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. అమెరికాలో ట్రంప్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశీయ కంపెనీలకు మద్దతుగా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయాలు ఇతర దేశాలను తీవ్రంగా దెబ్బతీశాయి,’’ అని ఆరోపించారు.

అలాగే తన సన్నిహితుడైన మాజీ అధ్యక్షుడు జైరో బోల్సెనారోపై జరిగిన దర్యాప్తుపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా అసహనం వ్యక్తం చేశారు. ట్రంప్‌ ప్రభుత్వం బ్రెజిల్‌ ఉత్పత్తులపై 50 శాతం వరకు భారీ పన్నులు విధించిందని గుర్తుచేశారు. ఈ కారణంగా వాషింగ్టన్‌ – రియో డి జనీరో మధ్య సంబంధాలు మరింత క్షీణించాయని తెలిపారు.

అయితే వచ్చే సంవత్సరంలో బ్రెజిల్‌లో జరిగే కాప్‌30 వాతావరణ సదస్సు విషయమై మాత్రం డిసిల్వా సానుకూలంగా స్పందించారు. ‘‘ఈ సదస్సులో వాతావరణ మార్పులపై ట్రంప్‌ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఉంది. అందుకే ఆహ్వానం పంపిస్తాను. అయితే ఆయన రావాలనుకుంటే వస్తారు, వద్దనుకుంటే గైర్హాజరవుతారు. కానీ మేమైతే చర్చలకు సిద్ధమే’’ అని అన్నారు.

ఈ వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయం , వాణిజ్య సంబంధాల్లో కొత్త మలుపు తీసుకొస్తాయన్నది నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాలకు బ్రెజిల్‌ ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో అమెరికాతో ఉదాసీన సంబంధాలపై ఆసక్తికర చర్చలు నెలకొన్నాయి.

Tags:    

Similar News