మంగళగిరి మలుపులో : లోకేష్ వర్సెస్ గంజి చిరంజీవి ...!

గుంటూరు జిల్లాలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం గురించి ఇపుడు చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే రేపటి రాజకీయాన్ని మార్చే శక్తి ఈ నియోజకవర్గానికి ఉంది.

Update: 2023-12-12 16:02 GMT

గుంటూరు జిల్లాలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం గురించి ఇపుడు చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే రేపటి రాజకీయాన్ని మార్చే శక్తి ఈ నియోజకవర్గానికి ఉంది. మంగళగిరి అమరావతి రాజధాని పరిధిలో ఉంది. పైగా మాజీ సీఎం కుమారుడు మాజీ మంత్రి తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ రెండవ సారి పోటీ చేస్తున్న నియోజకవర్గంగా మంగళగిరిని ప్రత్యేకంగా చూడాలి.

మంగళగిరిలో 2019 ఎన్నికల్లో లోకేష్ 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన్ని ఓడించిన వారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి. ఆయనకు అలా అద్భుత విజయం సాధించారు. అప్పటికి గంజి చిరంజీవి టీడీపీలో ఉన్నారు. అయినా లోకేష్ ఓటమి పాలు అయ్యారు. ఇక ఈ గంజి చిరంజీవి విషయం చూస్తే ఆయన 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ ఎమ్మెల్యేతో పోటా పోటీగా ఓట్లు తెచ్చుకున్నారు. కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

మంగళగిరి సామాజిక ముఖ చిత్రం చూస్తే బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఇక్కడ ఉంటారు. అందుకే వామపక్షాల విజయాలకు ఇది అనేకసార్లు కేంద్రంగా నిలిచింది. ఇప్పటికి నాలుగు పర్యాయాలు ఈ సీటులో వామపక్షాలు గెలిచాయి. ఇక తెలుగుదేశం పార్టీ పెట్టాక 1983, 1985లలో ఎంఎస్ఎస్ కోటేశ్వరావు అనే నాయకుడు గెలిచారు. ఆయన అప్పటి ఎన్టీఆర్ మంత్రి వర్గంలో వైద్య ఆరోగ్య శాఖలను చూశారు.

ఆయనే మంగళగిరికి టీడీపీ తరఫున తొలి చివరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తరువాత అంటే ఇప్పటికి నాలుగు దశాబ్దాలుగా టీడీపీ మంగళగిరిలో గెలిచింది లేదు. ఇక ఈ మధ్యలో అనేక సార్లు కాంగ్రెస్ కమ్యూనిస్టులు వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచాయి. ఒక విధంగా రాజకీయంగా చూస్తే టీడీపీకి ఇది టఫ్ సీటు. ఇపుడు సామాజిక వర్గం పరంగా కూడా ఇబ్బంది పడేలా ఈ సీటు చేస్తోంది.

Read more!

ఎందుకంటే ఇక్కడ చేనేత సామాజికవర్గం అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అదే విధంగా చూస్తే కనుక మంగళగిరి నియోజకవర్గంలో 1989 నుంచి 2009 వరకు పద్మశాలి ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒక మహిళతో సహా పద్మశాలి అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంది. ఇక చరిత్ర చూస్తే చేనేత కులస్తులు అయిదు వందల ఏళ్ళ నుంచి మంగళగిరిలో స్థిరపడ్డారు.

బీసీలకు ఇక్కడ ఎపుడూ అవకాశం ఉంటుంది. ఒక విధంగా చూస్తే అనేక పర్యాయాలు చేనేత కులస్తులు ఎమ్మెల్యేలుగా ఉండడంతో ఈ సీటు తమకు అనధికారికంగా రిజర్వ్ అయింది అన్నది చేనేత సామాజిక వర్గీయుల భావనగా ఉంది. మొత్తం నియోజకవర్గంలో చూస్తే సాలిడ్ గా నియోజకవర్గంలో తమకు 55 వేలకు పైగా ఓట్లు ఉన్నాయని, ఎక్కువ మంది ఓటర్లు మంగళగిరి పట్టణంలోనే ఉన్నారని చేనేత సంఘం నాయకులు చెబుతున్నారు.

ఇలా పార్టీలు వేరు అయినా తమ అభ్యర్ధి ఎమ్మెల్యేగా ఉండాలన్నది వారి వాదనగా ఉంటూ వస్తోంది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు వైసీపీ కరెక్ట్ డెసిషన్ తీసుకుని గంజి చిరంజీవిని నిలబెట్టిందని అంటున్నారు. మరి నారా లోకేష్ కి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే టీడీపీ వేవ్ ఉంది కాబట్టి సామాజిక పరిణామాలు ప్రభావం చూపవని ఆ పార్టీ భావిసోంది.

అదే విధంగా యువగళం పాదయాత్రను నారా లోకేష్ ఎక్కువ రోజులు మంగళగిరిలో చేశారు. అలాగే చూస్తే కనుక తమ వైపు జనాల మొగ్గు ఉందని టీడీపీ ధీమాగా ఉంది. ఎవరు గెలుస్తారు అన్నది కాదు కానీ మంగళగిరి అయితే ఇపుడు రసవత్తరమైన రాజకీయానికి తెర తీసింది అని అంటున్నారు. లోకేష్ గంజి చిరంజీవిల మధ్య టఫ్ ఫైట్ అయితే సాగుతుందని అంటున్నారు.

Tags:    

Similar News