'నాన్నతో పనిచేయడం చాలా కష్టం'.. మంత్రి లోకేశ్ స్వీయ అనుభవం
ముఖ్యమంత్రి చంద్రబాబుతో పనిచేయడం చాలా కష్టమని.. ఆయన పరుగులు తీస్తూ తమను పరిగెత్తిస్తారని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబుతో పనిచేయడం చాలా కష్టమని.. ఆయన పరుగులు తీస్తూ తమను పరిగెత్తిస్తారని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. బుధవారం మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజనరీ లీడర్ చంద్రబాబుతో పనిచేయడం చాలా కష్టంగా ఉంటుందని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఉదయం 10 గంటలకు ఒక ఫైల్ ఇచ్చి 10.15 నిమిషాలకు ఆ ఫైల్ పురోగతి ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తారని లోకేశ్ వెల్లడించారు.
మంత్రిగా రెండోసారి చంద్రబాబు క్యాబినెట్ లో పనిచేస్తున్న లోకేశ్.. ఆయన నాయకత్వంలో ఎంత వేగంగా పనిచేయాల్సివుంటుందనే విషయమై తన స్వీయ అనుభవాన్ని వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో కొత్త రాజధాని నగరాన్ని ప్రపంచస్థాయిలో నిర్మించేందుకు చంద్రబాబు బ్రాండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని లోకేశ్ వెల్లడించారు. అదేసమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరికీ దక్కని చక్కని అవకాశాలు చంద్రబాబుకు దక్కాయని లోకేశ్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మించిన చంద్రబాబు.. విభజన తర్వాత ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు.
లోకేశ్ వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిరాక్షసుడనే ముద్రను స్థిరం చేసుకున్నారని అంటున్నారు. ఏపీకి నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇందుకోసం తాను స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ, తన మంత్రివర్గ సహచరులను క్రమశిక్షణ తప్పకుండా చూస్తున్నారని అంటున్నారు. అనుక్షణం మంత్రులు, ఎమ్మెల్యేలను పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు.. తన కుమారుడు లోకేశ్ కు ఎటువంటి మినహాయింపు ఇవ్వడం లేదని ఐటీ మంత్రి వ్యాఖ్యల బట్టి అర్థమవుతోందని అంటున్నారు.
తన వయసు 75 ఏళ్లు అయినా 95 సీఎం వలే 45 ఏళ్ల యువకుడిలా పనిచేస్తానని ఏడాది క్రితమే చంద్రబాబు వెల్లడించారు. అప్పట్లో ఆకస్మిక తనిఖీలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన చంద్రబాబు.. ఇప్పుడు అంత దూకుడు చూపడం లేదు. కానీ వినూత్న ఆలోచనలతో పాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ఏడాది కాలంలో పది లక్షల కోట్లు పెట్టుబడులు సాధించిన చంద్రబాబు.. దాదాపు 9 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు తీసుకున్నారు. పెట్టుబడుల ప్రకటనలే కాకుండా వాటిని గ్రౌండింగు చేసేలా అడుగులు వేస్తున్నారని అంటున్నారు.
గత ఎన్నికల్లో 164 సీట్లతో ప్రజలు గెలిపించినందున మరింత బాధ్యతగా పనిచేయాలని చెబుతున్న చంద్రబాబు.. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఐవీఆర్ఎస్ తోపాటు ఇతర మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తూ ఎమ్మెల్యేలు, మంత్రులను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన తండ్రి ఓ పని రాక్షసుడు అంటూ లోకేశ్ గొప్పగా చెప్పుకోవడం చూస్తే, తన కుమారుడికి రాజకీయంగా రాటుదేలేలా చంద్రబాబు శిక్షణ ఇస్తున్నారని అంటున్నారు.