మామా ఏక్ పెగ్ లా... టాప్ 10 రాష్ట్రాల్లో తెలుగువారి స్థానం ఆసక్తికరం!

అవును... భారతదేశంలోని లిక్కర్ మార్కెట్ లో దక్షిణాది రాష్ట్రాలు 58% వాటాను కలిగి ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి!;

Update: 2025-10-31 10:05 GMT

అకేషన్ ఏదైనా, లొకేషన్ ఎక్కడైనా.. అక్కడ మద్యం స్థానం ఇటీవల కాలంలో తప్పనిసరిగా మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలసట నుంచి ఉపశమనమో, ఒంటరి తనానికి తోడు కోసమో, లేని ధైర్యం తెచ్చుకోవడం కోసమో, ఉన్న కోపం తగ్గించుకోవడం కోసమో, సంతోషాన్ని పంచుకోవడానికో, బాధను దిగమింగుకోవడానికో.. కారణం ఏదైనా మామా ఎక్ పెగ్ లా ఇటీవల రొటీన్!

ఈ క్రమంలోనే ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) విభాగంలో 2025 ఆర్థిక సంవత్సరంలో 40.17 కోట్ల కేసుల అమ్మకాలు నమోదయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే 1.4% స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. లిక్కర్ మార్కెట్‌ లో దక్షిణాది రాష్ట్రాలు 58% వాటాతో ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నాయని అంటున్నారు.

అవును... భారతదేశంలోని లిక్కర్ మార్కెట్ లో దక్షిణాది రాష్ట్రాలు 58% వాటాను కలిగి ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి! ఈ సందర్భంగా అవి ఏయే రాష్ట్రాలు, ఎంతెంత మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి, ఎన్నేసి కోట్ల కేసుల వినియోగాన్ని కలిగి ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దామ్...!

1. కర్ణాటక!:

ఆల్కహాల్ వినియోగంలో 2025 ఆర్థిక సంవత్సరంలో కర్ణాటక 17% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది సుమారు 6.83 కోట్ల విస్కీ కేసుల వినియోగాన్ని కలిగి ఉంది. బెంగళూరులో బలమైన పట్టణ డిమాండ్ తో పాటు బాగా స్థిరపడిన రిటైల్ పర్యావరణ వ్యవస్థ ఈ ప్రదేశానికి మద్దతు ఇస్తుందని అంటున్నారు.

2. తమిళనాడు!:

దేశంలోని లిక్కర్ అతిపెద్ద వినియోగదారులలో తమిళనాడు రాష్ట్రం ఒకటిగా కొనసాగుతోంది. అక్కడి పంపిణీ వ్యవస్థలు రాష్ట్ర నియంత్రణలో ఉండగా.. ఇవి క్రమంగా మార్కెట్ వాటాలో 13% వరకు దోహదపడుతున్నాయి. ఈ క్రమంలో 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు 6.44 కోట్ల కేసుల మద్యాన్ని వినియోగించాయి!

3, 4. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్!:

ఇక రెండు తెలుగు రాష్ట్రాలైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు ఈ జాబితాలో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ క్రమంలో.. తెలంగాణ 3.71 కోట్లు, ఏపీ 3.55 కోట్ల కేసులతో ఐ.ఎం.ఎఫ్.ఎల్ అమ్మకాలలో చెరో 9 శాతం వాటాను అందించాయి.

5. మహారాష్ట్ర!:

మహారాష్ట్ర మొత్తం జాతీయ అమ్మకాలలో సగటున 7% వాటాను కలిగి ఉంది. ఈ క్రమంలో.. 2.71 కోట్ల విస్కీ కేసుల అమ్మకాలను కలిగి ఉంది. నియమాలు, పన్నులలో సంక్లిష్టతలు ఉన్నప్పటికీ ఇది చాలా బలమైన వినియోగాన్ని సూచిస్తుంది! పట్టణ ప్రాంతంలోని ముంబై - పుణే మార్కెట్ ఇక్కడ కీలకమని చెబుతున్నారు.

6. ఉత్తరప్రదేశ్:

ఉత్తరాధి రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఈ విషయంలో బలమైన వాటాను కలిగి ఉందనే చెప్పాలి. ఇందులో భాగంగా... ఐ.ఎం.ఎఫ్.ఎల్. అమ్మకాల్లో యూపీ వాటా 6% కాగా... సుమారు 2.50 కోట్ల కేసులు అమ్మకాలను నమోదు చేసింది. జనాభా, పెరుగుతున్న పట్టణ వినియోగదారుల శైలి దీనికి కారణంగా చెబుతున్నారు!

7. కేరళ:

దేశంలోని మార్కెట్ వాటాలో సుమారు 6%, 2.29 కోట్ల కేసుల అమ్మకాలను కేరళ రాష్ట్రం కలిగి ఉంది. ఫలితంగా ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇది మద్యానికి వ్యతిరేకంగా బలమైన సాంస్కృతిక సంప్రదాయం కలిగి ఉన్నప్పటికీ.. మారుతున్న జీవనశైలి దీనికి ఒక కారణమని అంటున్నారు!

8. పశ్చిమ బెంగాల్:

పశ్చిమ బెంగాల్ సుమారు 4% మార్కెట్ వాటా, 1.49 కోట్ల కేసుల అమ్మకాల వాటాను కలిగి ఉంది. ఫలితంగా ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. కోల్‌ కతా వంటి పట్టణ కేంద్రాలలోని హై-ఎండ్ ఉత్పత్తులకు కూడా ఈ స్థానం ప్రయోజనం చేకూరుస్తుందని అంటున్నారు!

9. రాజస్థాన్:

రాజస్థాన్ రాష్ట్రంలో సుమారు 3% మార్కెట్ వాటాతో 1.37 కోట్ల కేసులు వినియోగించబడ్డాయి. దీంతో లిక్కర్ అమ్మకాల్లో ఈ రాష్ట్రం దేశంలోనే తొమ్మిదో స్థానంలో ఉంది.

10. ఢిల్లీ:

ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ 10వ స్థానంలో నిలిచింది. ఐ.ఎం.ఎఫ్.ఎల్. అమ్మకాల్లో ఇది 3% వాటాను కలిగి ఉంది. ఇక్కడ 1.18 కోట్ల కేసుల అమ్మకాలు ఉన్నాయి. నగరంలో డిమాండ్ ఎక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు.

Tags:    

Similar News