మోడీ గ్రాఫ్‌ను తగ్గిస్తాం... ఎలా గెలుస్తారో చూస్తాం: అన్నదాతల ఆగ్రహం
ఈ క్రమంలో సహనం కోల్పోతున్న రైతులు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.;
వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన కనీస మద్దతు ధరలకు(ఎంఎస్‌పీ) చట్ట బద్ధత కల్పించాలనే డిమాండ్‌తో ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతులను ప్రభుత్వాలు అణిచేస్తున్నాయి. వారిపై సోనిక్ ఆయుధాల ను ప్రయోగిస్తున్నాయి. గురువారం కూడా టియర్ గ్యాస్ సహా వాటర్ క్యానన్లను ప్రయోగించాయి. లాఠీలు తప్ప.. అన్ని రూపాల్లోనూ రైతులను అణిచేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో సహనం కోల్పోతున్న రైతులు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా.. ఓ రైతు.. చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని మోడీ గ్రాఫ్‌ని తగ్గించేస్తాం.. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తాం.. అని వ్యాఖ్యానించారు. దీనికి కొందరు రైతులు మద్దతుగా చప్పట్లతో హోరెత్తించారు. అయితే.. దీనిపై వివాదాలు కూడా ముసురుకున్నాయి. ఇది రైతుల ఉద్యమమని.. రాజకీయాలకు సంబంధం లేదని.. ఆ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని.. రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. తమ డిమాండ్‌ను నెరవేరిస్తే.. తాము ప్రశాంతంగా ఇంటికి వెళ్లిపోతామని చెప్పారు.
ఇక, ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భిన్నంగా రియాక్ట్ అవుతున్నాయి. మోడీపై అన్నదాతలకు ఎంత ఆగ్ర హం ఉందో ఈ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయని.. కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. మోడీ గ్రాఫ్‌ను తగ్గించాలన్న రైతుల వ్యాఖ్యల వెనుక ఆవేదన ఉందని.. దీనిని అందరూ అర్థం చేసుకోవాలని అన్నారు.
ఇవీ కామెంట్లు..
రైతులు ఉద్యమిస్తున్న వాటిలో భారతి కిసాన్ యూనియన్ (ఏక్తా సిద్ధూపూర్) ఒకటి. దీని చీఫ్ జగ్జిత్ సింగ్ దలేవాల్ తాజాగా మోడీపై విమర్శలు చేశారు. ‘‘రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ తర్వాత ప్రధాని మోడీ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ గ్యాప్‌లోనే మోడీ గ్రాఫ్‌ని మనం తగ్గించాలి. ఆయన ఎలా గెలుస్తాడో చూడాలి’’ అని వ్యాఖ్యానించారు. దీనికి కొందరు రైతులు జై కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో హల్చల్ చేస్తోంది.