కేరళం మీదుగా ఏపీకి కాంగ్రెస్ గాలి...వైసీపీకి వడగాలి ?
దక్షిణాదిన కేరళలో కాంగ్రెస్ జెండా పాతితే కచ్చితంగా ఏపీ మీద ఫోకస్ పెడతారు అని అంటున్నారు.;
దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ కి మంచి పట్టు ఉంది. అది ఇందిరమ్మ జమానా అయినా రాజీవ్ గాంధీ రాజ్యం అయినా రాహుల్ గాంధీ ప్రస్తుత సారధ్యం అయినా కాంగ్రెస్ కి దక్షిణాదిన తిరుగులేని బలం ఉంది. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి అక్కున చేర్చుకుంటారు. 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ షాక్ తో కేంద్రంలో అధికారాన్ని తొలిసారి పోగొట్టుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ ని దక్షిణాదిన కర్ణాటక ఉమ్మడి ఏపీ ఎంతగానో ఆదుకున్నాయి. ఇక 1989లో రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఓటమి చెందినా ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాలే ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చి బలమైన విపక్షంగా కేంద్రంలో నిలబెట్టాయి. 2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్ సారధ్యంలో యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలు ఏర్పాటు వెనక ఉమ్మడి ఏపీ పాత్ర ఎంతగానో ఉంది. అలాగే కర్ణాటక సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయంలో భాగం అయ్యాయి. ఇపుడు చూస్తే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ కి కేంద్రంలో విపక్ష హోదా రాహుల్ నాయకత్వంలో దక్కింది అంటే దానికి తెలంగాణా కేరళ వంటి రాష్ట్రాలే కారణం అని చెప్పాలి. అలా కాంగ్రెస్ ని మరోసారి దక్షిణాది ఆదుకోబోతోందా అంటే తాజాగా ముగిసిన కేరళ ఎన్నికలలో ఫలితం కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషణలు వస్తున్నాయి.
మరింతగా బలం :
కేరళలో కనుక పదేళ్ళ తరువాత కాంగ్రెస్ గెలిస్తే దక్షిణాదిన ఉన్న అయిదు రాష్ట్రాలలో అయిదింట మూడు సొంతంగా కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్నట్లు లెక్క. అవి కేరళ, కర్ణాటక, తెలగాణా. ఇక తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ మరో సారి గెలిస్తే ఆ కూటమిలో భాగస్వామిగా కాంగ్రెస్ కూడా గెలిచినట్లే అంటున్నారు. దాంతో దక్షిణాదిన కాంగ్రెస్ కి చిక్కని దక్కని ఒకే రాష్ట్రంగా ఏపీ మాత్రమే ఉంటుంది. అయితే ఈ తాజా ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ మీద కూడా గట్టిగా పడే అవకాశాలు ఉంటాయని విశ్లేషణలు ఉన్నాయి.
ఇరుగు పొరుగు అంతా :
ఏపీ తప్ప ఇరుగు పొరుగు అంతా కాంగ్రెస్ మయం అయితే కచ్చితంగా ఏపీలోనూ రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది అని అంటున్నారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. విపక్షంలో వైసీపీ ఉంది. వైసీపీ అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని తన వైపు తిప్పుకుని రాజకీయం చేస్తున్న పార్టీగా ఉంది. వైసీపీకి రెండే బలాలు ప్రాణాధారం గా ఉన్నాయని కాంగ్రెస్ భావిస్తోంది ఒకటి వైఎస్సార్ వారసత్వం, రెండోది కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంక్. వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్ చేసిన తప్పుడు వ్యూహాల మూలంగా సహజంగా వైఎస్సార్ కుమారుడిగా జగన్ ఆయన వారసత్వాన్ని అందుకున్నారు. ఇక ఉమ్మడి ఏపీ విభజన తరువాత ఏపీ జనాలు కాంగ్రెస్ పట్ల కోపంతో వైసీపీ వైపు మళ్లారు. సహజంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ టీడీపీకి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ఆల్టర్నేషన్ గా వైసీపీని ఎంచుకున్నారు అని అంటున్నారు. దాంతో ఇప్పటికి మూడు ఎన్నికలు ముగిసినా కాంగ్రెస్ ఏపీలో ఎత్తిగిల్లలేకబోతోంది. కానీ పరిస్థితి ఒక్కలా ఉండదని రాజకీయాల్లో మార్పు సహజం అని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది.
ఫుల్ ఫోకస్ తోనే :
దక్షిణాదిన కేరళలో కాంగ్రెస్ జెండా పాతితే కచ్చితంగా ఏపీ మీద ఫోకస్ పెడతారు అని అంటున్నారు. ఏపీలో విపక్ష పాత్రలో వైసీపీ ఏ మేరకు జనాల అభిమానాన్ని దక్కించుకుంది అన్నదే కొలమానంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగే చాన్స్ ఉంటుంది. ఏపీ విభజన తప్పులను కాంగ్రెస్ దిద్దుకోవడానికి సిద్ధంగా ఉంది. అందుకే అమరావతి రాజధానికి పార్లమెంట్ లో మద్దతు ప్రకటించింది. ఇక తాము 2029 లో కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ కనుక ప్రకటిస్తే రానున్న కాలంలో మద్దతు పెరిగే చాన్స్ ఉంటుంది.
కాంగ్రెస్ చాన్స్ తీసుకునే ప్రమాదం :
అంతే కాదు ఏపీని తాము అభివృద్ధి చేస్తామని ఎన్డీయేకు ధీటైన డెవలప్ మెంట్ యాక్షన్ ప్లాన్ తీసుకుంటే వైసీపీకి అది శరాఘాతంగా మారుతుంది అని అంటున్నారు. ఏపీలో వైసీపీ టీడీపీ డెవలపమెంట్ ని విమర్శిస్తోంది. అమరావతి రాజధానిగా వద్దు అంటోంది కానీ ఆల్టర్నేషన్ డెవలప్మెంట్ ని చెప్పలేకపోతోంది. మావిగాన్ అన్నది అమరావతికి ఆల్టర్నేషన్ అన్నది అయితే తప్పుడు వ్యూహమే అంటున్నారు. రాజధాని ఎపిసోడ్ కి తెర దించి వైసీపీ ఏపీ కోసం తాము కచ్చితంగా చేయబోయేది ఏమిటి అన్నది ఇప్పటికైనా చెప్పాలి. లేకపోతే కాంగ్రెస్ చాన్స్ తీసుకునే ప్రమాదం అయితే పొంచి ఉంది అని అంటున్నారు.