ట్రెండీ టాక్: రజనీకి శాంతి యోగం.. భార్యకు రాజకీయ యోగం?
ఢిల్లీలో జరిగిన ఈ భేటీల నేపథ్యంలో లతా రజనీకాంత్‌కు సంబంధించి ఒక కీలక వార్త వైరల్‌గా మారింది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయారంగేట్రం చేయకుండానే, మిడిల్ డ్రాప్ అయ్యారు. ఆయన మనస్తత్వానికి తగ్గట్టుగా `శాంతి యోగం` సిద్ధించిందని ప్రత్యర్థులు మాట్లాడుకున్నారు. అయితే రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ ప్రయత్నాలు చూస్తుంటే కచ్ఛితంగా ఆ కుటుంబం నుంచి రాజకీయారంగేట్రం ఖాయమైనట్టేనన్న చర్చా సాగుతోంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ తాజాగా నిర్వహించిన సమావేశాలు సామాజిక, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన `భారత్ సేవా` ప్లాట్‌ఫామ్ గురించి లతా రజనీకాంత్ ఆసక్తికర విషయాలను షేర్ చేసారు. భారతీయ సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థను పెంపొందించడం, బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్లాట్‌ఫామ్ పనిచేస్తోంది. ప్రాచీన భారతదేశ విజ్ఞానం, సాంస్కృతిక మూలాలు .. సాంప్రదాయ విలువలను ఆధునిక విద్యా విధానంతో జోడిస్తూ సమాజ సంక్షేమానికి తోడ్పడేలా భారత్ సేవా ఒక రోల్ మోడల్‌గా నిలుస్తోందని లతాజీ పేర్కొన్నారు.
భారతదేశానికి చెందిన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని.. విద్యారంగ మూలాలను పరిరక్షించడంలో భారత్ సేవా ప్లాట్‌ఫామ్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రాచీన విజ్ఞానాన్ని భావితరాలకు అందిస్తూ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఈ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోంది. అయితే లతా రజనీకాంత్ ఇటీవలి పర్యటనలు కేవలం సామాజిక, సాంస్కృతిక పరిధి దాటి రాజకీయ రంగును కూడా పులుముకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆమె మకాం వేసి పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలతో సమావేశమవ్వడం జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తించింది.
ఢిల్లీలో జరిగిన ఈ భేటీల నేపథ్యంలో లతా రజనీకాంత్‌కు సంబంధించి ఒక కీలక వార్త వైరల్‌గా మారింది. లతా రజనీకాంత్ త్వరలోనే పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆమెను `రాష్ట్రపతి కోటా` కింద నామినేటెడ్ సభ్యురాలిగా రాజ్యసభకు పంపేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులను రాష్ట్రపతి కోటాలో ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా లతా రజనీకాంత్ పేరు పరిశీలనకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ పరిణామాల వెనుక తమిళనాడు రాజకీయ సమీకరణాలు కూడా ముడిపడి ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాట తమ పార్టీ ఉనికిని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. రజనీకాంత్ కుటుంబాన్ని రాజకీయంగా దగ్గరకు తీసుకునే వ్యూహంలో భాగమే ఇదని ప్రచారం జరుగుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు తమిళనాడు వ్యాప్తంగా ఉన్న అపారమైన అభిమాన బలాన్ని, క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయన కుటుంబాన్ని రాజకీయ సమీకరణాల్లోకి తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో పార్టీ ప్రభావాన్ని పెంచుకోవాలని కాషాయ పార్టీ వ్యూహరచన చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. ఆయన సతీమణి లతా రజనీకాంత్ ఈ పరిణామంతో నేరుగా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఎంపీ స్థానం కోసం బీజేపీ అధిష్ఠానంతో సంప్రదింపులు జరిగాయనే ప్రచారం సాగుతున్నా.. అటు లతా రజనీకాంత్ వైపు నుంచి గానీ... ఇటు భారతీయ జనతా పార్టీ నాయకత్వం నుంచి గానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. భారత్ సేవా ద్వారా సాంస్కృతిక రంగంలో సాగిస్తున్న సేవలతో పాటు ఈ పొలిటికల్ ఎంట్రీ ఊహాగానాలు ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారాయి.