ఎవరీ లభీషా మీనా.. కేంద్రమంత్రిని ఆమె అడిగిన ప్రశ్నతో కోట్ల మందికి రిలీఫ్
ఇంతకూ లభీషా మీనా ఎవరు? ఆమె ఏ సందర్భంలో.. ఏ అంశంపై కేంద్రమంత్రిని ప్రశ్నించింది? ఆ తర్వాత ఏమైంది? అన్న వివరాల్లోకి వెళితే..
నిన్నటి వరకు సాదాసాదీ రీసెర్చ్ స్కాలర్ ఇప్పుడు మొయిన్ స్ట్రీమ్ మీడియా సైతం ఆమె గురించి మాట్లాడుతోంది. సోషల్ మీడియాలో అయితే ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. లక్షలాది మంది నిత్యం ఎదుర్కొనే ఒక సమస్యను.. ధైర్యంగా కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించిన వైనం.. అందుకు ఆయన అంతే వేగంగా స్పందించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకూ లభీషా మీనా ఎవరు? ఆమె ఏ సందర్భంలో.. ఏ అంశంపై కేంద్రమంత్రిని ప్రశ్నించింది? ఆ తర్వాత ఏమైంది? అన్న వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని ప్రతిష్ఠాత్మక మాలవ్య నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్ఐటీ)లో హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగంలో పీహెచ్ డీ చేస్తున్నారు. ఆమె ఒక సాదాసీదా విద్యార్థిని. అయితే.. తను చదువుతున్న విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ క్వాంటం కంప్యూటింగ్ ల్యాబ్ ను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వచ్చారు. సదరు కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు.
ఈ సందర్భంగా లభీషా మీనా అనే పీహెచ్ డీ స్కాలర్ మైక్ అందుకొని.. ‘సార్, దయచేసి ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ఎదురవుతున్న క్యాప్చా, సర్వర్ క్రాష్, ఓటీపీల సమస్యను పరిష్కరించండి. తత్కాల్ సమయంలో సైట్ అస్సలు ఓపెన్ కావటం లేదు. సామాన్యులకు టికెట్లు దొరకటం లేదు’ అంటూ ప్రశ్నించారు. వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్.. వేదిక మీద ఉన్న తన మొబైల్ ఫోన్ చేసి ఐఆర్ సీటీసీ ఉన్నతాధికారులకు లైవ్ కాల్ చేశారు.
సదరు అధికారితో మంత్రి మాట్లాడుతూ.. ఇక్కడ విద్యార్థులంతా ఐఆర్ సీటీసీ సరికొత్త వెబ్ సైట్ కావాలని గట్టిగా కోరుతున్నారు. మనం దీన్ని రాబోయే 30 రోజుల్లో తయారు చేయగలమా? అని ప్రశ్నించారు. దీనికి సదరు ఉన్నతాధికారి సానుకూలంగా స్పందించారు. దీంతో ఫోన్ పెట్టేసిన కేంద్రమంత్రి విద్యార్థులతో.. విద్యార్థుల అందరి డిమాండ్ మేరకు సరికొత్త సాంకేతికతతో కూడిన కొత్త ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ రానుంది. రాబోయే 30 రోజుల్లో అంటే.. జులై 15న దీన్ని మేం లాంచ్ చేస్తామని ప్రకటించారు.
దీంతో.. ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి స్పందించటమే కాదు.. తక్షణ పరిష్కారాన్ని చెప్పటం ఆసక్తికరంగా మారింది. దీనంతటికి కారణమైన విద్యార్థిని లభీషా మీనా ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక అంచనా ప్రకారం రోజు దాదాపు 9 లక్షల టికెట్లను ఐఆర్ సీటీసీ ద్వారా ప్రయాణికులు బుక్ చేసుకుంటారని చెబుతుంటారు. ఇలా రోజుకు లక్షలాది మంది వినియోగించే సైట్ ఆధునీకరించే విషయంలో ఒక విద్యార్థి చూపించిన చొరవ ఎంతోమందికి మేలు కాబోతోంది.