పాక్ ఇక ఎడారి...భారత్ చేతికి మట్టి అంటకుండానే !
ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఒక విధానం అనుసరిస్తోంది. కునార్ నది మీద నిర్మించే ఈ డ్యామ్ కోసం విదేశీ కంపెనీలని పిలవడం లేదుట.;
భారత్ మీద కోటి టన్నుల విషం కక్కుతూ ఎగిరెగిరి పడిన పాక్ కి ఇపుడు అసలు పరిస్థితి బాగులేదు. ఏ మాత్రం కూడా ఆశాజనకంగా వాతావరణం అయితే లేదు. చీటికి మాటికి భారత్ మీద కయ్యానికి కాలు దువ్వడం కాదు తమ మీదకు సమస్యలు అన్ని వైపుల నుంచి వస్తే ఎలా ఉంటుందో పాక్ ఇపుడు స్వయంగా చూస్తోంది, అనుభవిస్తోంది. ఇంటా బయటా పాక్ కి ఇపుడు సంక్షోభాలే దర్శనం ఇస్తున్నాయి. భారత్ తో పెట్టుకున్నందుకు సింధు నదీ జలాలు ఆగిపోయాయి. దాంతో ఒక వైపు గొంతు ఎండుతోంది. ఇపుడు దానికి తోడు ఆఫ్ఘనిస్తాన్ తయారు అయింది.
అడ్డుకట్టగా :
ఆఫ్ఘనిస్థాన్ వైపు నుంచి పాకిస్థాన్ వైపుగా ప్రవహించే ఒక నది ఉంది. ఆ నది మీద ఆఫ్ఘనిస్తాన్ ఇపుడు ఒక భారీ డ్యామ్ కట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ డ్యామ్ కడితే కనుక పాక్ పూర్తిగా ఏడారిగా మారడం ఖాయమని అంటున్నారు. ఇంతకీ ఆ నది పేరు ఏమిటి అంటే కునార్ . దీని మీదనే ఒక డ్యామ్ ని కట్టి పాక్ గొంతునే ఎడారి చేయడానికి తాలిబన్ ప్రభుత్వం చూస్తొంది. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వ అధినేత మౌలవీ హిబతుల్లా అఖుంద్‌జాదా తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నదీ జలాలను తాము పూర్తిగా ఉపయోగించుకుని జలవిద్యుత్ ప్రాజెక్టులతో సహా స్థిరమైన నీటి నిర్వహణ కోసం ఆఫ్ఘన్ ప్రభుత్వం కృషి చేస్తోంది.
సొంతంగానే నిర్మాణం :
ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఒక విధానం అనుసరిస్తోంది. కునార్ నది మీద నిర్మించే ఈ డ్యామ్ కోసం విదేశీ కంపెనీలని పిలవడం లేదుట. తామే దేశీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని వీలైనంత త్వరగా ప్రాజెక్టును ప్రారంభించాలని చూస్తోంది. ఈ మేరకు ఆ దేశ మంత్రి అబ్దుల్ లతీఫ్ మన్సూర్ కి తాలిబాన్ అధినేత నుంచి ఆదేశాలు వెళ్ళాయని అంటున్నారు. ఇక ఈ నదీ జలాల విషయానికి వస్తే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతానికి అత్యంత కీలకంగా ఉన్నాయి. ఈ నదిపై ఆఫ్ఘనిస్తాన్ డ్యామ్ నిర్మిస్తే కనుక పాకిస్తాన్ ఇప్పటికే ఎదుర్కొంటున్న జల సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
భారత్ మద్దతు :
ఇక ఈ కునార్ నది మీద నిర్మించే డ్యాం విషయంలో ఆఫ్ఘాన్ కి తాము మద్దతు ఇస్తామని భారత్ చెబుతోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇదే విషయం మీద కీలక ప్రకటన ఢిల్లీ నుంచి చేశారు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్ గతంలో కూడా ఎంతో సాయం చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో హెరత్ ప్రావిన్స్‌లో సల్మా ఆనకట్టను నిర్మించిన విషయాన్ని కూడా రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కునార్ మీద నిర్మించే డ్యాం విషయంలో భారత్ మద్దతు ఇవ్వడం ద్వారా . పాక్-ఆఫ్ఘాన్ వైరాన్ని మరింతగా పెంచే విధంగా రాజనీతిని ప్రయోగించారు అని అంటున్నారు. కునార్ నది కాబూల్ నదితో కలిసి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతానికి జీవనాధారంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇపుడు ఆఫ్ఘాన్ ఈ నది మీద అడ్డుకట్ట వేస్తే కనుక పాకిస్తాన్ తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ముప్పు పొంచి ఉందని అంటున్నారు.