బండి మీద రూ.10 కోట్ల పరువునష్టం దావా అవసరమా కేటీఆర్?
రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు.. ప్రతి విమర్శలు.. ఆరోపణలు.. ప్రత్యారోపణలు సహజం. వర్తమాన రాజకీయాల్లో అవి మరింత పెరిగిపోయాయి;
రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు.. ప్రతి విమర్శలు.. ఆరోపణలు.. ప్రత్యారోపణలు సహజం. వర్తమాన రాజకీయాల్లో అవి మరింత పెరిగిపోయాయి. హద్దులు మీరిపోతున్న సందర్భాలు లేకపోలేదు. తమ మీద చేసే ఆరోపణలపై కేసులు వేసే వరకు వెళ్లే ఉదంతాలు తక్కువగా ఉంటాయి. తాజాగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మీద రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కం సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై బండి సంజయ్ చేసిన ఆరోపణలపై ఆయన తాజాగా పరువు నష్టం దావాను సిటీ సివిల్ కోర్టులో దాఖలు చేశారు.
దీనికి సంబంధించిన పిటిషన్ పై విచారణను డిసెంబరు 15కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పై బండి సంజయ్ ఘాటు విమర్శలతో పాటు.. సంచలన ఆరోపణలు చేశారు.అయితే.. ఈ విమర్శలు.. ఆరోపణలు ఇప్పుడు చేసినవి కావు. ఆగస్టులో చేసినవి. ఎమ్మెల్యే ఫోన్లు.. తన కుటుంబ సభ్యుల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేసినట్లుగా బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై తనకు తక్షణమే సారీ చెప్పాలని.. లేదంటే పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ అప్పట్లో హెచ్చరించారు.
కేటీఆర్ ఇచ్చిన గడువు లోపు.. బండి సంజయ్ స్పందించింది లేదు. కేటీఆర్ కోరినట్లుగా ఆయన ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు. దీంతో.. తాజాగా ఆయన పరువు నష్టం దావా పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో పాటు..మరికొన్ని అంశాల్ని కేటీఆర్ ప్రస్తావించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని టీవీ చానెళ్లు.. డిజిటల్ ప్లాట్ ఫారమ్ లు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం జరిగాయని.. ఈ వ్యాఖ్యలు తన పరువుకు భంగం వాటిల్లేలా చేయటమే కాదు.. తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేవిగా ఉన్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. బండి సంజయ్ తో పాటు డజన్ కు పైగా టీవీ చానళ్లు.. మీడియా సంస్థలపైనా పరువు నష్టం దావా వేసినట్లుగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తనకు బండి సంజయ్ భేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. తదుపరి పరువు నష్టం కలిగించే కంటెంట్ ప్రచురించకుండా.. ప్రసారం చేయకుండా ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. అంతేకాదు.. ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ లు.. మీడియాపోర్టల్స్నుంచి పరువు నష్టం కలిగించే కథనాలు.. వీడియోలు.. పోస్టుల్ని తక్షణమే తొలగించాలని కోరారు. అయితే..ఈ పిటిషన్ పై విచారణను కోర్టు డిసెంబరు 15కు వాయిదా వేసిన నేపథ్యంలో.. అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకునే వీలుంది. అప్పటి వరకు కేటీఆర్ ఇబ్బంది పడుతున్న పోస్టులు ఆన్ లైన్ లో దర్శనమిస్తూనే ఉంటాయి. కోర్టు నిర్ణయం నేపథ్యంలో కేటీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.