హైదరాబాద్‌లో రేవ్ పార్టీ భగ్నం.. చిక్కిన 11 మంది

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడకు చెందిన వాసు, శివం రాయుడు అనే ఇద్దరు వ్యక్తులు ఈ రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.;

Update: 2025-07-27 10:06 GMT

హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ సమీపంలోని కొండాపూర్‌లో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. సకాలంలో స్పందించిన పోలీసుల చర్యతో ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ దాడిలో 11 మందిపై కేసు నమోదు కాగా, 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసుల దాడిలో స్వాధీనం చేసుకున్న వాటిలో 2 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్, 11.57 గ్రాముల మ్యూజిక్ మష్రూమ్, 1.91 గ్రాముల చెరాస్ డ్రగ్స్ తో పాటు 6 కార్లు ఉన్నాయి. పార్టీలో వినియోగం కోసమే ఈ డ్రగ్స్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నిందితులను శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించగా, కేసును అక్కడికి బదిలీ చేశారు. ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు.

విజయవాడ కుర్రాళ్ల ప్లాన్..!

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడకు చెందిన వాసు, శివం రాయుడు అనే ఇద్దరు వ్యక్తులు ఈ రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వీరు ఒక ముఠా తరహాలో పథకం ప్రకారం ఈ పార్టీలను ప్లాన్ చేస్తూ, ఇతరుల ఆధార్ కార్డులు, ఐడీలు ఉపయోగించి తమ అసలు గుర్తింపును దాచిపెట్టే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.

సమాజంపై దుష్ప్రభావం

ఈ తరహా పార్టీల వల్ల యువత డ్రగ్స్ అడిక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. ఇలాంటి సంఘటనలు సమాజంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయి. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, మరిన్ని ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్‌లో ఈ తరహా పార్టీలకు చోటు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం, సరఫరా విషయంలో ఎటువంటి సహనం ఉండబోదని స్పష్టం చేశారు. రేవ్ పార్టీలు కేవలం వినోదం పేరుతో జరిగే సాధారణ వేడుకలు కావు, ఇవి యువత భవిష్యత్తును ప్రమాదంలో పడేసే తీవ్రమైన నేర కార్యకలాపాలు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాల గురించి ప్రజలు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు.

Tags:    

Similar News