మంత్రి కొండా సురేఖతో వివాదం.. మలుపు తిప్పిన నాగార్జున!
మంత్రి క్షమాపణ చెప్పడంతో హీరో నాగార్జున సైతం మెత్తబడ్డారు. మంత్రితో గత కొన్ని నెలలుగా చేస్తున్న న్యాయ పోరాటానికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నారు.;
మంత్రి కొండా సురేఖ, సినీ హీరో నాగార్జున మధ్య నెలకొన్న వివాదం కొత్త మలుపు తిరిగింది. రెండు రోజుల క్రితం నాగార్జునకు మంత్రి సురేఖ బహిరంగ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో మంత్రితో వివాదంపై నాగార్జున మనసు మార్చుకున్నారు. కొండా సురేఖపై తాను గతంలో వేసిన పరువు నష్టం కేసును ఉపసంహరించుకున్నట్లు నాగార్జున ప్రకటించారు. మంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పడంతో నాగార్జున మెత్తబడ్డారని, మంత్రితో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.
నాగార్జున కుటుంబంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానని మంత్రి కొండా సురేఖ నిన్న ఎక్స్ లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, వారిని ఇబ్బంది పెట్టాలని కానీ, వారి పరువు-ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది కానీ తన ఉద్దేశం కాదని మంత్రి సురేఖ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చుకున్నారు. నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నా.. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా అని ఆమె పేర్కొన్నారు.
మంత్రి క్షమాపణ చెప్పడంతో హీరో నాగార్జున సైతం మెత్తబడ్డారు. మంత్రితో గత కొన్ని నెలలుగా చేస్తున్న న్యాయ పోరాటానికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రి క్షమాపణ చెప్పిన మరునాడే క్రిమినల్ దావాను ఉపసంహరించుకున్నారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీసింది. సడన్ గా కొండా సురేఖ క్షమాపణ చెప్పడం, ఆ వెంటనే నాగార్జున పరువు నష్టం దావాను వెనక్కి తీసుకోవడం వెనుక ఏద జరిగిందని సందేహిస్తున్నారు. ఇద్దరి మధ్య రాజీ కుదర్చిన ఆ అదృశ్య శక్తి ఎవరై ఉంటారా? అన్న చర్చ ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగే కుటుంబం ఇటీవల అనేక వివాదాలకు కేంద్రంగా మారినట్లు విమర్శలు ఎదుర్కొంటోంది. ఒకవైపు జిల్లా ఎమ్మెల్యేలతో విభేదాలు కొనసాగుతుండగా, సహచర మంత్రివర్గ సభ్యులతోనూ ఆమెకు పొసగడం లేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కొండా సురేఖ అనుచరులు, వ్యక్తిగత సహాయకులపై కేసులు నమోదు వరకు పరిస్థితి వెళ్లింది. మరోవైపు హీరో నాగార్జునతో అనావసర వివాదం ఆమెను మరింత చికాకు పెడుతోందని అంటున్నారు. ఈ క్రమంలో వివాదాలను సెటిల్ చేసుకోవాలని నిర్ణయించిన మంత్రి సురేఖ.. ముందుగా నాగార్జునతో భేషరుతుగా రాజీకి రావాలని నిర్ణయించుకున్నారని, అందులో భాగంగా తనది తప్పేనంటూ క్షమాపణలు చెప్పారని అంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ పెద్దల జోక్యంతో నాగార్జున కూడా మంత్రితో వివాదానికి ముగింపు పలకాలని భావించారని, అందుకే మంత్రి క్షమాపణ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా కోర్టులో తన పిటిషన్ ఉపసంహరించుకున్నారని చెబుతున్నారు.