క్లైమాక్స్ : ఫ్లైటెక్కిన 'కొండా'
విదేశాల నుండి తిరిగి వచ్చిన పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిసేందుకు సురేఖ అనుమతి కోరగా వెంటనే రావాలని సూచించినట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి ఢిల్లీకి రావాలని మంత్రి కొండా సురేఖకు పిలుపువచ్చిందని సమాచారం. దీంతో ఆమె బయలుదేరినట్లు తెలుస్తుంది. విదేశాల నుండి తిరిగి వచ్చిన పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిసేందుకు సురేఖ అనుమతి కోరగా వెంటనే రావాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఆమెతో పాటుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కూడా వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మంత్రివర్గ విస్తరణ, కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం, చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి నుండి తొలగించాలని క్రమశిక్షణ సంఘం హైకమాండ్ కు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దీనిపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాడు. ఇదే విషయమై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి బయలుదేరారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
కొండా సురేఖ తన కుమార్తె సుష్మిత సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చింది తప్పితే ఎక్కడా తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. అదే సమయంలో కొండా సురేఖ భర్త కొండా మురళి కూడా తన కుమార్తె ప్లాన్ బీ ఏంటో తనకు తెలియదని చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.
ఇన్ని వ్యాఖ్యలు చేసినా రాఖీ పండుగ రోజు రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చిన కొండా సురేఖతో రాఖీ కట్టించుకోవడమే కాకుండా, తన మనవడికి కూడా రాఖీ కట్టించాడు. కానీ కొండా సురేఖను పదవి నుండి తొలగించే విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడేది లేదని సన్నిహితులతో స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తేలిగ్గా తీసుకుని వదిలేస్తే పార్టీలో మరింత మంది నేతలు బయలుదేరుతారని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు మేరకు అటు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇటు కొండా సురేఖ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లడంతో కథ క్లైమాక్స్ కు చేరినట్లేనని భావించాలి. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ సంఘం సిఫారసు మేరకు పార్టీ అధిష్ఠానం కొండా సురేఖ మీద వేటు వేస్తుందా ? మంత్రి పదవి నుంచి వైదొలగాలని ఆదేశాలు ఇస్తుందా ? లేక కొండా సురేఖ వివరణ తీసుకుని, సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపి ఈ వివాదాన్ని ఇంతటితో ముగిస్తుందా ? అన్న ఉత్కంఠ నెలకొంది.
కాంగ్రెస్ అధిష్ఠానం కొండా సురేఖ విషయంలో బీసీ సామాజికవర్గం అన్న కోణంలోనే చూస్తుందని, అందుకే చర్యలకు వెనకాడుతుందని భావిస్తున్నారు. మరో వైపు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి ఏఐసీసీ నుండి ఎలాంటి పిలుపు రాలేదు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం కొండా సురేఖను తొలగించాలని భావిస్తే ఖచ్చితంగా చిన్నారెడ్డిని కూడా పదవి నుండి తప్పించాలి. లేకుంటే బీసీ మంత్రిని తప్పించి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాపాడిందని విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఆలోచన ఏమిటి అన్న సంధిగ్దత నెలకొంది.