రండి బాబూ రండి.. డాలర్లను దాచండి.. దేశంలోనే పెళ్లి చేసుకోండి.. ఇదీ మోడీసార్ పిలుపు

భారత ఆర్థిక వ్యవస్థ ఏకంగా 7.8 శాతం వృద్ధి రేటుతో రోదసిలోకి దూసుకెళ్తుంటే సగటు భారతీయుడు కాస్త ఊపిరి పీల్చుకుని రిలాక్స్ అవుదామని అనుకున్నాడు.

Update: 2026-09-01 07:54 GMT

భారత ఆర్థిక వ్యవస్థ ఏకంగా 7.8 శాతం వృద్ధి రేటుతో రోదసిలోకి దూసుకెళ్తుంటే సగటు భారతీయుడు కాస్త ఊపిరి పీల్చుకుని రిలాక్స్ అవుదామని అనుకున్నాడు. ఇక సెలవులకు థాయిలాండ్ బీచ్‌కో, కుర్రాడి పెళ్లి కోసం ఇటలీలోని లేక్ కోమోకో వెళ్దామని ప్లాన్‌లు వేసుకుంటున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలందరికీ ఊహించని ఒక భారీ ‘ఆర్థిక హోమ్‌వర్క్’ ఇచ్చారు. "అసలు స్విట్జర్లాండ్ మంచు కొండలు ఎందుకు సామీ? మన కాశ్మీర్, కులు-మనాలి ఉండగా.. విదేశాల్లో రూపీలను డాలర్లుగా మార్చి తగలేసే బదులు.. ఆ స్వదేశీ సొమ్మును మన దేశీ వ్యాపారుల జేబుల్లోనే తిరగనివ్వండి" అంటూ ఒక గట్టి కౌన్సెలింగ్ ఇచ్చేశారు.

ఇటలీ సరస్సులు వర్సెస్ మన ఊరి కళ్యాణ మంటపాలు

మనవాళ్లకు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటే ఒక రేంజ్ క్రేజ్ వచ్చిపడింది. అయితే ఏ ఇటలీ సరస్సు పక్కనో వేల కోట్లు కుమ్మరించి చేసుకునే పెళ్లి కంటే మన ఊరి పందిరి కింద గట్టిగా మైక్ సెట్ పెట్టి చేసుకుంటే వచ్చే మజానే వేరు కదా.. పారిస్, లండన్ వీధుల్లో తిరిగే కంటే మన లోకల్ బస్సు ఎక్కి పర్యాటకాన్ని ఉద్ధరిస్తే దేశానికి ఎంత మేలు.. పైగా ప్రధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం.. మీ ఇంటి పెళ్లి బడ్జెట్ ఏదో విదేశీ హోటళ్లకు పోకుండా మన దేశంలోనే ఖర్చు చేస్తే ఇక్కడి టెంట్ హౌస్ బాబాయ్‌ల నుంచి, ఫొటోగ్రాఫర్లు, డెకరేటర్లు, క్యాటరింగ్ మేస్త్రీల వరకు అందరి ఇళ్లలోనూ దీపావళి వెలుగులు నిండుతాయి. అంటే మీరు చేసుకునే ఒక పెళ్లి డైరెక్ట్‌గా భారత జీడీపీ కి బూస్టర్ డోస్ లాంటిదన్నమాట..

లాకర్ల బంగారం కంటే.. మార్కెట్ రూపాయే ముద్దు..

ఇక మోదీ మరో డెలికేట్ పాయింట్‌పై కూడా చేయి వేశారు. "అవసరం లేకపోతే బంగారం కొనడం కాస్త తగ్గించండి బాబోయ్" అని సున్నితంగా చెప్పారు. మన దేశంలో పండక్కి, పబ్బానికి, చివరకు ఊరికే ఖాళీగా ఉన్నా బంగారం కొనడం ఒక సెంటిమెంట్. కానీ ఆ పసిడి దిగుమతుల వల్ల మన దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు పెట్రోల్ ఆవిరి అయినట్టుగా కరిగిపోతున్నాయన్నది ప్రభుత్వ పెద్దల ఆందోళన. అందుకే "బీరువా లాకర్లలో నిద్రపోయే బంగారం కంటే.. మార్కెట్ వీధుల్లో గలగలలాడే రూపాయే ముద్దు" అని మోదీ పరోక్షంగా సందేశమిచ్చారు.

రాజకీయ మసాలా లేకుండా స్పీచ్ ముగుస్తుందా?

కేవలం ఆర్థిక పాఠాలతోనే ముగిస్తే అది ప్రసంగం ఎలా అవుతుంది? అందుకే రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ ప్రచారానికి కౌంటర్‌గా ‘ఝూట్ కీ గూంజ్’ (అబద్ధాల హోరు) అంటూ ఒక ఊపు ఊపారు. దీంతో ఈ ఆర్థిక సందేశానికి కావాల్సినంత రాజకీయ స్పైసీ మసాలా కూడా తోడైంది.

2047 మాస్టర్ ప్లాన్ అసలు సీక్రెట్ ఇదే

మొత్తానికి 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధించాలంటే.. మనం జేబులోంచి తీసే ప్రతి రూపాయి విదేశీ కంపెనీల ఖాతాల్లోకి కాకుండా స్వదేశీ వ్యాపారుల చేతుల్లోకే వెళ్లాలన్నది ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు సీక్రెట్. 7.8 శాతం గ్రోత్ రేట్ అనేది కేవలం పేపర్ మీదుండే అంకె కాదని.. దాన్ని కాపాడుకోవడానికి 140 కోట్ల మంది ప్రజలు తమ విదేశీ విమాన టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకుని.. దేశీ రైళ్లెక్కి ప్రయాణించడమే మార్గమని మోదీ గట్టిగానే గుర్తుచేశారు.



Tags:    

Similar News