ఇచ్చాపురం...వైసీపీలో ఇష్టా రాజకీయం !
ఇక్కడ చూస్తే వైసీపీ రాజకీయం అంతా వర్గ పోరుగా మారింది. ఎవరికి వారుగా యమునా తీరుగా సాగుతోంది. అంతా ఇష్టా రాజకీయంగా మారింది అని క్యాడర్ గోడు పెడుతోంది.
శ్రీకాకుళం జిల్లాలో చిట్ట చివరి సీటు ఇచ్చాపురం. ఇది ఒడిశా లోపలికి చొచ్చుకుని పోయి ఉంది. ఇక్కడ రాజకీయం కూడా లోతుగానే సాగుతుంది. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ పెట్టిన నాటి నుంచి ఒకటి రెండు సందర్భాలలో తప్ప అన్ని ఎన్నికల్లోనూ గెలుస్తూ వస్తోంది. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే బెందాళం అశోక్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ వైసీపీ గడచిన మూడు ఎన్నికల్లోనూ ముగ్గురు అభ్యర్ధులను పెట్టి ఓటమి పాలు అయింది. అలా హ్యాట్రిక్ ఓటమిని మూట కట్టుకుంది. ఇక్కడ చూస్తే వైసీపీ రాజకీయం అంతా వర్గ పోరుగా మారింది. ఎవరికి వారుగా యమునా తీరుగా సాగుతోంది. అంతా ఇష్టా రాజకీయంగా మారింది అని క్యాడర్ గోడు పెడుతోంది.
అధినేత హెచ్చరించినా :
ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ అధినాయకత్వం స్థానిక సంస్థల విషయంలో హెచ్చరికలు జారీ చేసింది. ఏకగ్రీవాలు వద్దు అని స్పష్టంగా చెప్పేసింది. అంతే కాదు ఎక్కడైనా అలా జరిగితే మాత్రం ఇంచార్జి పదవికే ముప్పు అని తేల్చేసింది. ఈ నేపధ్యంలో అన్ని చోట్లా ఎంతో కొంత కదలిక వచ్చినా ఇచ్చాపురంలో మాత్రం ఎవరి ఇచ్చకు తగినట్లుగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ అసెంబ్లీ ఇంచార్జిగా ఉన్న శ్యాం ప్రసాద్ రెడ్డికి ఇతర నేతల సహాయ సహకారాలు అసలు లేవని అంటున్నారు. ఆయనది పూర్తిగా ఒంటరి పోరుగా మారింది అని అంటున్నారు. రెడ్డిక సామాజిక వర్గం అని ఈ జిల్లాలో ఉంది. దాంతో బీసీ కేటగిరీ కింద ఉన్న ఈ వర్గం నుంచి శ్యాం ప్రసాద్ రెడ్డిని ఎంపిక చేసి గత ఏడాదే జగన్ ఇంచార్జిగా నియమించారు.
బలమైన నేతలుగా :
ఇక ఈ నియోజకవర్గంలో కాళింగుల రాజకీయ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే యాదవులు కూడా బలంగా ఉన్నారు. ఈ రెండు సామాజిక వర్గాల నుంచి వైసీపీలో కీలక నేతలు ఉన్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన నర్తు రామారావుకి ఎమ్మెల్సీ సీటు కూడా వైసీపీ తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చింది. ఆయన ఇచ్చాపురం ఎమ్మెల్యే సీటుని ఆశిస్తున్నారు. ఆయనను ఇంచార్జి చెస్తారని అనుచరులు ఆశించారు. కానీ శ్యాం ప్రసాదరెడ్డిని ఎంపిక చేయడంతో ఆయన వర్గం అంతా దూరంగా ఉంది. అలాగే నిన్నటిదాకా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయకి అసెంబ్లీ బాధ్యతలు అప్పగించారు. ఆమె 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఎన్నికల అనంతరం ఆమెను తప్పించారు. ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ బలమైన నేత. కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆయనకు ఇంచార్జి బాధ్యతలు ఇస్తారని అనుకుంటే దక్కలేదన్న అసంతృప్తి ఉంది. దాంతో ఆయన వర్గం దూరంగా ఉంది.
టీడీపీ పక్కా గెలుపు :
దీంతో ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం సీటు టీడీపీకి కళ్ళు మూసుకుని గెలిచే సీటు అని అనేక సర్వేలు చెబుతూ వస్తున్నాయి. అదే నిజం అని వైసీపీలో వర్గ పోరు కూడా తెలియచేస్తోంది. ఎటూ నియోజకవర్గంలో ఏకగ్రీవాలు తప్పవు అని అంటున్నారు. దాంతో ఇంచార్జిగా ఉన్న శ్యాం ప్రసాద్ రెడ్డిని తప్పించేస్తే తమకు చాన్స్ వస్తుందని సొంత పార్టీలో ప్రత్యర్ధులు భావిస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద మూడు ముక్కలాటగా ఈ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇచ్చాపురం మీద వైసీపీ ఆశలు వదిలేసుకుంటోందా అన్న చర్చ సాగుతోంది.