సాయిరెడ్డి పార్టీ...వైసీపీ ఓట్లు చీల్చడమేనా ?
ఆయన తాజాగా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ జగన్ మత మార్పిడులు ప్రోత్సహించారు అని అతి పెద్ద బండ వేసేశారు.
వైసీపీ లో పునాది నుంచి ఉంటూ ఇటీవల బయటకు వచ్చిన మాజె ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ అంటున్నారు. అయితే ఆయన ఆ మధ్య చెప్పిన జూన్ నెల ముహూర్తం దాటేసింది. ఇక లేటెస్ట్ ఆయన చెప్పిన శ్రావణమాసం మూడో శుక్రవారం కూడా వెళ్ళిపోయింది. అయితే కొత్త ముహూర్తం ఎపుడు అన్నది చూడాల్సి ఉంది. అయినప్పటికీ విజయసాయిరెడ్డి వెనక్కి తగ్గేది ఉండదని కచ్చితంగా కొత్త పార్టీ పెట్టి తీరుతారని అంటున్నారు. మరి విజయసాయి రెడ్డి కొత్త పార్టీ లక్ష్యాలు ఏమిటి అన్నది కూడా ఇదే సందర్భంలో చర్చ వస్తుంది. ఏపీలో ఇప్పటికే అనేక పార్టీలు ఉన్నాయి. వాటి సరసన ఈ పార్టీ చేరుతుందా లేదా ఎంతో కొంత ఉనికి చాటుకుంటుందా అంటే దానికి జవాబు తర్వాత తెలుస్తుంది కానీ టార్గెట్ మాత్రం వైసీపీయే అని అంటున్నారు.
అందుకే ఘాటు విమర్శలు :
విజయసాయిరెడ్డి వైసీపీ మీద ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన తాజాగా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ జగన్ మత మార్పిడులు ప్రోత్సహించారు అని అతి పెద్ద బండ వేసేశారు. నిజానికి జగన్ ని ప్రత్యర్ధులు ఎవరూ ఎపుడూ అనని పెద్ద మాట ఇది. వైసీపీ పెట్టిన తరువాత జగన్ రాజకీయ కెరీర్ లో ఈ తరహా విమర్శలను ఎపుడూ ఎదుర్కోలేదు. దాంతోనే వైసీపీ మీద సాయి రెడ్డి గురి పెట్టారని అంటున్నారు. ఇక హార్డ్ కోర్ హిందూత్వతో ఆయన రావాలని అనుకుంటున్నట్లుగా కూడా ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతోంది. జగన్ ని వైసీపీని ఎంతగా టార్గెట్ చేస్తే అంతగా తన పార్టీ ఉనికి బలపడుతుందని కూడా వ్యూహం ఏదో ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఆ సామాజిక వర్గంతో :
ఇక వైసీపీకి బలమైన రెడ్డి సామాజిక వర్గం అండ ఉంది. అయితే ఆ వర్గంలో కూడా గతంలో అసంతృప్తి చెలరేగి 2024 ఎన్నికల్లో పూర్తిగా వైసీపీకి ఓట్లు పడలేదని విశ్లేషణలు ఉన్నాయి. కూటమి వైపు ముప్పయి నుంచి నలభై శాతం ఓటు షేర్ మళ్ళింది అని కూడా విశ్లెషించారు. ఇక తాజాగా కొందరు రాజకీయ విశ్లేషకులు కూటమికి అనుకూలంగా ఉండే వారి మాటలలో చూస్తే యాభై శాతం దాకా రెడ్డి సామాజిక వర్గం మద్దతు కూటమికే ఉందని అంటున్నారు. ఆ ప్రకటనల సంగతి పక్కన పెడితే వైసీపీకి హార్డ్ కోర్ ఓటు షేర్ గా ఉంటున్న ఈ బలమైన వర్గంలో చీలిక తెస్తే అది వైసీపీకి భారీ దెబ్బ అవుతుందని కూడా అంటున్నారు. విజయసాయిరెడ్డి గురి కూడా ఈ సామాజిక వర్గం మీద ఉందని కూడా ప్రచారం సాగుతోంది.
వేరు చేయడమేనా :
జగన్ ని కుల పరంగా తమ వాడని సొంతం చేసుకునే రెడ్లలో చీలిక తెచ్చేందుకే ఆయన మీద మత ముద్ర వేశారు అని అంటున్నారు. మత మార్పిళ్లకు జగన్ హయాంలో ప్రోత్సహించారని చెప్పడం ద్వారా బలమైన రెడ్డి సామాజిక వర్గం మీద మతపరంగా పెద్ద విభజన గీత గీయాలని వారిని వేరు చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. నిజానికి వైసీపీకి 2024 ఎన్నికల్లో రెడ్లు పూర్తిగా సహకరించలేదన్నది తెలుసు అని చెబుతున్నారు. ఆ పార్టీ ఈ విషయంలో అంతర్మధనం చెందిన మీదట దగ్గర చేసుకునే ప్రయత్నాలు ఎంత మేరకు చేసింది అన్నది పక్కన పెడితే పార్టీ గ్రాఫ్ పెరిగితే అంతా చక్కబడుతుందని వారు ఎక్కడికి పోరని ధీమాతో ముందుకు సాగుతోంది.
వైసీపీ ఓట్లకు తూట్లు :
అయితే విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరుతో వైసీపీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. రేపటి రోజున ఆయన మరింత ఘాటుగా ధాటీగా విమర్శలు ఎక్కుపెడితే పార్టీ పెట్టాక ఆయన రాజకీయ జోరు పెంచితే అది కచ్చితంగా ఎంతో కొంత వైసీపీ మీద ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. 2024 ఎన్నికల్లో షర్మిల మూలంగా రాయలసీమలో వైసీపీకి కొంత నష్టం వాటిల్లింది అని గుర్తు చేస్తున్నారు. ఈసారి సాయిరెడ్డి పార్టీ ద్వారా వైసీపీ ఓట్లకు తూట్లు ఎంతో కొంత పడినా ఆ మేరకు నష్టమే అని అంటున్నారు. ఎందుకంటే ఈసారి ఎన్నికలు హోరాహోరీగా ఉంటాయని చెబుతున్నారు. ఏ ఒక్క ఓటు తగ్గినా కూడా అది భారీగానే షాక్ ఇస్తుందని అంటున్నారు.