బ్యాంకులో రూ.7.4 కోట్ల నకిలీ కరెన్సీ: పీఎన్‌బీలో ఇంటి దొంగల పని!

ఈ కరెన్సీ స్థానంలో నకిలీ నోట్లు దాయడం బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపింది. ఈ కుంభకోణానికి బాధ్యులైన ముగ్గురు సీనియర్ మేనేజర్లను అధికారులు సస్పెండ్ చేశారు.

Update: 2026-09-01 08:30 GMT

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహారన్‌పూర్‌లో బ్యాంకు ఉద్యోగుల కుంభకోణం సంచలనం సృష్టిస్తోంది. ప్రజల డబ్బును భద్రంగా దాయాల్సిన బ్యాంకును అక్కడి ఉద్యోగులే లూటీ చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సహారన్‌పూర్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచ్‌లో జరిగిన ఈ ఘరానా మోసంలో ఏకంగా రూ.7.4 కోట్ల అసలు కరెన్సీ మాయం చేశారు. ఈ కరెన్సీ స్థానంలో నకిలీ నోట్లు దాయడం బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపింది. ఈ కుంభకోణానికి బాధ్యులైన ముగ్గురు సీనియర్ మేనేజర్లను అధికారులు సస్పెండ్ చేశారు.

ఆర్బీఐ తనిఖీలతో బయటపడిన బండారం

ఈ భారీ మోసం ఒక్కసారిగా వెలుగులోకి రాలేదు. ఆగస్టు 10న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సహారన్‌పూర్ బ్రాంచ్ నుంచి పంపిన నగదులో స్వల్ప తేడాలు గమనించడంతో అసలు నాటకం బయటపడిందని చెబుతున్నారు. ఆర్బీఐకి చేరిన నగదు కట్టలను పరిశీలించగా, లెక్కల్లో సుమారు రూ.4.36 లక్షలు తక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ చిన్న తేడాపై అనుమానం వ్యక్తం చేసిన ఆర్బీఐ వర్గాలు, వెంటనే సమగ్ర ఆడిట్ నిర్వహించాలని బ్యాంకును ఆదేశించాయి. ఈ తనిఖీల్లోనే అసలు నిజాలు బయటపడటం బ్యాంకు అధికారుల నిర్లక్ల్యాన్ని తేటతెల్లం చేసిందని అంటున్నారు.

అసలు నోట్లకు ఎసరు

బ్యాంకులోని అత్యంత సురక్షితమైన స్ట్రాంగ్ రూమ్‌లోనే ఈ తతంగం నడిచిందని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం స్ట్రాంగ్ రూమ్‌లోని నగదు నిల్వలు ఎంతో పటిష్టమైన భద్రత మధ్య ఉండాలి. అయితే, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న కొందరు మేనేజర్లు తమకున్న అధికారాలను అడ్డం పెట్టుకుని, స్ట్రాంగ్ రూమ్‌ నుంచి దఫదఫాలుగా రూ.7.4 కోట్ల మేర కరెన్సీ నోట్లను తరలించారని అంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ స్థానంలో నకిలీ నోట్లను పెట్టి భర్తీ చేశారని, రిజర్వు బ్యాంకు ఆదేశాలతో చేపట్టిన స్పెషల్ ఆడిట్ లో మొత్తం బండారం బయటపడిందని అంటున్నారు.

ముగ్గురి సస్పెన్షన్

బ్యాంకు పవిత్రతను, ఖాతాదారుల నమ్మకాన్ని కాపాడాల్సిన సీనియర్ అధికారులే ఈ అక్రమాలకు పాల్పడటం గమనార్హం. ఆడిట్ నివేదిక ఆధారంగా ఈ కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ మేనేజర్లను బ్యాంకు యజమాన్యం తక్షణమే సస్పెండ్ చేసింది. అంతేకాకుండా, నిందితులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ భారీ కుంభకోణంలో మరెవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.

ఖాతాదారుల్లో భయాందోళనలు

ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. నమ్మకానికి ప్రతిరూపంగా ఉండాల్సిన బ్యాంకు అధికారులే ఇలాంటి దేశద్రోహపు చర్యలకు పాల్పడితే సామాన్యుల ధనానికి భద్రత ఎక్కడ అనే ప్రశ్న తలెత్తుతోంది. బ్యాంకులు తమ అంతర్గత భద్రతా విధానాలను, ఆడిట్ ప్రక్రియలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన తీవ్రంగా హెచ్చరిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News