అర్ధరాత్రి నాగార్జునపై మంత్రి కొండా సురేఖ ట్వీట్..వైరల్
తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన కుటుంబంపై తాను గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.;
తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన కుటుంబంపై తాను గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా నాగార్జునకి, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణలు తెలియజేశారు.
కొండా సురేఖ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ "నేను నాగార్జున గారి గురించి చేసిన ప్రకటన, ఆయనను లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశంతో చేసింది కాదు. అక్కినేని నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను కించపరచాలనే లేదా అపకీర్తి కలిగించాలనే ఉద్దేశం నాకు లేదు. నా ప్రకటనల ద్వారా ఎవరికైనా అనుకోని అపోహ కలిగినట్లయితే దానికి నేను చింతిస్తున్నాను. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను" అని స్పష్టం చేశారు.
అసలు వివాదం ఏంటి?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ, బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో నాగార్జున కుమారుడు నాగ చైతన్య, నటి సమంత విడాకుల అంశాన్ని ప్రస్తావించారు. నాగ చైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అక్కినేని కుటుంబానికి తీవ్ర మనస్తాపాన్ని కలిగించాయి.
కోర్టులో పరువు నష్టం దావా
కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన నాగార్జున, తన కుటుంబ పరువుకు భంగం కలిగించారంటూ మంత్రిపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు నాంపల్లి కోర్టులో విచారణలో ఉంది. కేటీఆర్ కూడా తనపై చేసిన ఆరోపణలకు గాను సురేఖపై పరువు నష్టం దావా వేశారు.
నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు విచారణకు ఒక రోజు ముందు నవంబర్ 13కు విచారణ ఉండగా సురేఖ ఈ క్షమాపణ ట్వీట్ చేయడం విశేషం. బహుశా న్యాయపరమైన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని తెలుస్తోంది.
నాగార్జున స్పందన ఎలా ఉంటుంది?
మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో నటుడు నాగార్జున ఈ విషయంపై ఎలా స్పందిస్తారు, కోర్టులో దాఖలు చేసిన పరువు నష్టం దావాను వెనక్కి తీసుకుంటారా లేదా అనేది సినీ , రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.