వరంగల్ లో మంత్రి జోక్యంపై కొండా ఫైర్.. కొండా మురళి ఏమన్నారంటే..?

వరంగల్ జిల్లాలో పార్టీ నిర్ణయాలపై పొంగులేటి పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారని, జిల్లా నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని కొండా మురళి ఆరోపిస్తున్నారు.;

Update: 2025-10-11 10:39 GMT

తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ అంతర్గత ఉద్రిక్తతలు తలెత్తాయి. జిల్లాలో పార్టీ వ్యవహారాలు కొత్త దిశలో మలుపు తిరుగుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారింది. ఈ విషయంపై సీనియర్‌ నేత కొండా మురళి అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీ అంతర్గత సమీకరణాలకు మరింత ప్రాధాన్యతను తెచ్చింది. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకలాపాలపై మంత్రి పొంగులేటి అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని.. స్థానిక నేతల స్వేచ్ఛను హరించడమే కాకుండా, నిర్ణయ ప్రక్రియలో ఆధిపత్యం చూపిస్తున్నారని ఆరోపించారు. దేవాదాయ శాఖలో, మేడారం టెండర్ల వ్యవహారంలో పొంగులేటి స్వప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.

మేడారం జాతర టెండర్లలో పొంగులేటి సొంత కంపెనీకి పనులు అప్పగించారని, ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఫిర్యాదు కేవలం రాష్ట్ర స్థాయిలో కాకుండా, నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ కు పంపినట్టు కొండా తెలిపారు.

పెత్తనంపై ఆరోపణలు

వరంగల్ జిల్లాలో పార్టీ నిర్ణయాలపై పొంగులేటి పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారని, జిల్లా నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని కొండా మురళి ఆరోపిస్తున్నారు. పార్టీ కేడర్‌లోనూ ఇదే అసంతృప్తి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘వరంగల్ జిల్లాలో పొంగులేటి పెత్తనం ఎందుకు?’ అనే ప్రశ్నను ఆయన బహిరంగంగా లేవనెత్తడం, కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.

నేను చేసిన ఫిర్యాదుపై హైకమాండ్‌ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు కొండా మురళి వెల్లడించారు. పార్టీ క్రమశిక్షణ, పరస్పర గౌరవం, సమన్వయ వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా ఉన్నతాధికారులు సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ లోపలి విభేదాలు బయటకు రావడాన్ని నియంత్రించేందుకు ఏఐసీసీ ప్రత్యేక సమీక్ష చేపట్టే అవకాశం ఉంది. అదే సమయంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి వర్గం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. మంత్రి జోక్యం అనే మాటే అసత్యమని, అన్ని నిర్ణయాలు పార్టీ సమష్టి చర్చల ద్వారానే జరిగాయని వాదిస్తున్నారు.

పార్టీ సమన్వయానికి సవాలు

వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎప్పటి నుంచో అంతర్గత గందరగోళాలకు కేంద్రంగా ఉంది. గతంలోనూ కొండా మురళి, పొంగులేటి వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు మళ్లీ ఫిర్యాదు స్థాయికి చేరుకోవడం, పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది. 2026 లో జరిగే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుంటే, ఈ విభేదాలు పార్టీ బలహీనతకు దారితీసే ప్రమాదం ఉంది.

రాజకీయంగా చూస్తే, మేడారం టెండర్‌ వివాదం ఒక ఆర్థిక అంశం మాత్రమే కాకుండా, ‘పార్టీ అంతర్గత కలహాలు’ అనే పెద్ద చర్చకు దారితీయవచ్చు. పార్టీకి బలం చేకూర్చే స్థానంలో ఉండే నేతల మధ్య విభేదాలు బహిర్గతం కావడం కాంగ్రెస్‌ పునర్నిర్మాణ యత్నాలకు ప్రతికూలం.

వరంగల్ కాంగ్రెస్‌లో పొంగులేటి, కొండా మురళి వర్గాల మధ్య ఈ విభేదం కేవలం వ్యక్తిగత విరోధం కాదు. ఇది నాయకత్వం, పారదర్శకత, సమన్వయ సామర్థ్యాల మధ్య జరిగే పోరాటం. హైకమాండ్‌ సమయానుసారంగా జోక్యం చేసుకుంటే ఈ వివాదం తగ్గుతుంది.లేకుంటే, ఇది కాంగ్రెస్‌ భవిష్యత్తు సమీకరణాలను ప్రభావితం చేసే మరో అంతర్గత అగ్నిపర్వతంగా మారే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News