70 కోట్లు ఖర్చు పెట్టిన.. కొండా మురళీ మరో దుమారం!
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి.;
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. వరంగల్‌లో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను 16 ఎకరాల భూమిని అమ్మి రూ. 70 కోట్ల వరకు ఖర్చు చేశానని, రాజకీయంగా గెలిచేందుకు ఎవరి మీదా ఆధారపడలేదని స్పష్టం చేశారు. "నాకింకా 500 ఎకరాల భూమి ఉంది. ఎవరి డబ్బులు అవసరం లేదు. నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి" అంటూ కొండా మురళి గట్టిగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
కాంగ్రెస్‌లోనే ఒత్తిడులు, కుట్రలు?
తమను సైడ్ చేయాలని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కుట్ర చేస్తున్నారని మురళి ఆరోపించారు. కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి వంటి నేతలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరి వెనుక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ఈ విషయాలన్నీ పార్టీ హైకమాండ్‌కు తెలియజేశానని, న్యాయం కోసం పోరాడుతానని మురళి పేర్కొన్నారు.
గాంధీ భవన్‌లో విచారణ.. తగ్గని హవా
కొన్ని రోజుల క్రితం కొండా మురళి గాంధీభవన్‌లోని క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. అయితే అక్కడ వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ధోరణిలో మార్పు రాలేదు. "నన్ను తొక్కాలని చూస్తే చూస్తూ ఊరుకోను. నేను ఏదైనా చేయగలను, ఎన్నో చేశాను" అంటూ స్వేచ్ఛగా వ్యాఖ్యానించారు.
"సురేఖకు ఆదాయం లేదు.. ఖర్చులన్నీ నేనే భరిస్తున్నా"
తన భార్య కొండా సురేఖకు ఆదాయం రాని శాఖలను అప్పగించారని మురళి ఆరోపించారు. "దేవాదాయ శాఖలో దేవుడు మాత్రమే ఉంటాడు. రూపాయి ఆదాయం ఉండదు. పర్యావరణ శాఖలో చెట్లు, గుట్టలు తప్ప వేరేం ఉండవు. అలాంటప్పుడు ఆదాయం ఎలా వస్తుంది? ఆమెకు ప్రతి నెల ఖర్చులకు ఐదు లక్షల వరకు నేనే పంపిస్తున్నా" అని వివరించారు.
-రాజకీయ సంకేతాలేనా?
కొండా మురళి వ్యాఖ్యల వెనుక రాజకీయంగా కొన్ని సంకేతాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని, కాంగ్రెస్ లో తాను గుర్తించబడాలని ఆయన ప్రయత్నిస్తున్నారా? లేక భవిష్యత్ రాజకీయ మార్గానికి ముహూర్తం వేస్తున్నారా? అనే చర్చ చురుకుగా సాగుతోంది.
కొండా మురళి వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సునామిలా మారాయి. పార్టీ శ్రేణుల్లో కలకలం, రాజకీయ విశ్లేషణల్లో ఊహాగానాలు... అన్నీ కలసి ఈ వ్యవహారాన్ని మరింత కీలకంగా మార్చాయి. ఇలాంటి సమయంలో పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో, మురళి తదుపరి ప్లాన్ ఏమిటో వేచి చూడాల్సిందే.