కొడాలి నాని కొత్త లుక్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయారంతే!

వైసీపీలోనే దూకుడు గల నేతల్లో ఒకరిగా పేరుపొందిన కొడాలి నాని ఇటీవల పూర్తిగా కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.;

Update: 2025-10-27 10:44 GMT

వైసీపీలోనే దూకుడు గల నేతల్లో ఒకరిగా పేరుపొందిన కొడాలి నాని ఇటీవల పూర్తిగా కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ఎప్పుడూ గడ్డం, జుట్టుతో మాస్ లుక్‌లో కనిపించే నాని ఈసారి తిరుమలలో స్వామివారికి తలనీలాలు సమర్పించారు. దీంతో ఆయన పూర్తిగా మారిపోయి, గుర్తుపట్టలేనంతగా కనిపిస్తున్నారు. ఆయన కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది!

తిరుమల శ్రీవారి ఆలయంలో తలనీలాలు సమర్పించడం ఆచారసంబంధంగా ఎంతో ప్రాధాన్యమైనది. ఈ పుణ్యక్షేత్రంలో కొడాలి నాని తరచుగా దర్శనం చేసుకునే వారు. ఈసారి కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, తలనీలాలు సమర్పించి పూర్తిగా మారిపోయిన లుక్‌లో దర్శనమిచ్చారు. తిరుమలలో తెల్ల చొక్కా, తెల్ల పంచకట్టులో నాని కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఓటమి, అనారోగ్యం, ఆ తర్వాత...

2019 నుంచి 2024 మధ్య కాలంలో కొడాలి నాని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తరచూ వార్తల్లో నిలిచారు. టిడిపి, జనసేన పార్టీలపై కఠిన విమర్శలు చేయడంలో ఎప్పుడూ ముందుండేవారు. ఆయన విలేకరుల సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు ఎప్పుడూ హాట్ టాపిక్ అయ్యేవి. రజనీకాంత్‌ వరకు విమర్శించడంలో కూడా వెనుకాడని ఆయన ఓ దశలో తనదైన శైలిలో రాజకీయ వేదికపై చురుకుగా వ్యవహరించారు.

అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో ఓటమిపాలైన తర్వాత కొడాలి నాని పబ్లిక్ లైఫ్‌లో పెద్దగా కనిపించడం లేదు. ఓటమి తరువాత కొంతకాలం హైదరాబాద్‌లో ఉంటూ, ఆపై అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన బరువు గణనీయంగా తగ్గిపోయారు. వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన కొంతకాలంగా రాజకీయంగా దూరంగా ఉన్నారు.

ఇటీవల జగన్ విజయవాడకు వచ్చినప్పుడు కొడాలి నాని మళ్లీ పబ్లిక్‌లోకి వచ్చారు. అప్పుడూ తనదైన ముద్రతో మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇక తాజాగా తిరుమలలో తలనీలాలు సమర్పించడం ఆయన వ్యక్తిగత జీవితంలో ఒక ఆధ్యాత్మిక మలుపుగా చెప్పవచ్చు.

* దూకుడు కొనసాగుతుందా?

ఇప్పుడు కొత్త లుక్‌తో కనిపిస్తున్న కొడాలి నాని మళ్లీ పాత దూకుడు వైసీపీ నేతగా రంగంలోకి వస్తారా? లేక 2029 వరకు రాజకీయాల నుంచి దూరంగా ఉంటారా? అన్నది చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. కొడాలి నాని కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆయన ఈ మార్పుతో మళ్లీ రాజకీయ వేదికపై క్రియాశీలకంగా మారతారేమో చూడాలి.



Tags:    

Similar News