హుటాహుటిన ముంబైకి తరలింపు.. కొడాలి నానికి ఏమైంది?
ఈ సమయంలో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ఆయనను ముంబైకి తరలించినట్లు చెబుతున్నారు!;
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను హుటాహుటిన ముంబైకి తరలించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హార్ట్ ఆపరేషన్ నిమిత్తమే ఆయనను సడన్ గా ముంబైకి తరలించినట్లు సమాచారం.
అవును... గత కొన్ని రోజుల క్రితం కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ఆయనను ముంబైకి తరలించారు.
ఈ సందర్భంగా ఎయిరిండియా ప్రత్యేక విమానంలో కొడాలి నానిని ముంబైకి తీసుకెళ్లగా... ఆయనతో పాటు ఆయన సతీమణి, మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. ఇదే సమయంలో వైద్యుల బృందం కూడా కొడాలి నాని వెంట ఉన్నారని తెలుస్తోంది.
వాస్తవానికి ఇటీవల కొడాలి నాని టీమ్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా... కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారని... ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా... ఆయన ఆరోగ్యం గురించి మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకండని తెలిపారు.
అయితే.. ఇంతలోనే ఆయనను మెరుగైన చికిత్స కోసమని ముంబైకి తరలించారు. ఈ సమయంలో ముంబై నుంచి ఆయన హెల్త్ బులిటెన్ కానీ.. కుటుంబ సభ్యుల నుంచి అప్ డేట్స్ గానీ రావాల్సి ఉంది. ఈ సమయంలో.. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు.. కొడాలి నాని గుండెకు సంబంధించిన మూడు వాల్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారించారనే కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించినట్లు సమాచారం. ఈ సమయంలో.. ఆపరేషన్ కోసం ముంబై వెళ్లాలని నిర్ణయించారు!
దీంతో... హైదరాబాద్ నుంచి ముంబైకి కొడాలి నానిని ప్రత్యేక విమానంలో ముంబై తరలించారు. ఈ సమయంలో.. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కు నానీని తరలించారని చెబ్బుతున్నారు. అక్కడ నానీకి స్టంట లేదా బైపాస్ సర్జరీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా.. కొడాలి నాని ఆరోగ్యంపై వైసీపీ శ్రేణులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ కూడా వివరాలు తెలుసుకుంటున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. జగన్ ఆదేశాలతోనే నానీని ముంబై తరలించినట్లు చెబుతున్నారు. ఈ ప్రత్యేక విమానం ఏర్పాట్లు కూడా జగన్ చేశారని అంటున్నారు.