గుడివాడలో యాక్టివ్ గా కొడాలి.. జోష్ లో వైసీపీ
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని రాజకీయంగా పూర్తి యాక్టివ్ అయ్యారు.;
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని రాజకీయంగా పూర్తి యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమితో దాదాపు ఏడాదికి పైగా అజ్ఞాతవాసం గడిపిన నాని మళ్లీ గుడివాడలో చురుగ్గా తిరుగుతున్నారు. కూటమి అధికారం చేపట్టిన నుంచి ఆయన అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం, దానికి తగ్గట్టుగా వరుస కేసులు నమోదుతో చాలా కాలం బయటకు కనిపించకుండా గడిపారు కొడాలి నాని. ఈ సమయంలోనే తీవ్ర అనారోగ్యం పాలవడం, గుండెకు శస్త్రచికిత్స చేయడం వల్ల ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సివచ్చింది. దీంతో గుడివాడలో నానికి ప్రత్యామ్నాయంగా మరో నేత కోసం వైసీపీ అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరిగింది. క్రిష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారికను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు జరిగాయని కథనాలు వచ్చాయి. దీంతో కొడాలి నాని రాజకీయం క్లోజ్ అయిందన్న ప్రచారం సాగింది. అయితే కొద్ది రోజులుగా కొడాలి మళ్లీ చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటుండటంతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.
తీవ్ర అనారోగ్యం తర్వాత కోలుకున్న మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు గుడివాడలోనే ఎక్కువగా గడుపుతున్నారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమానికి వెళ్లి వస్తున్నారు. దీంతో ఆయనపై ఇన్నాళ్లు జరిగిన ప్రచారం వట్టి వదంతులుగా తేలిపోయిందంటున్నారు. కూటమి ప్రభుత్వం జోరుతో కొడాలి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని ఒకసారి, ఆయన గతంలో వ్యవహరించిన తీరు, వాడిన పదజాలం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న వైసీపీ నష్టనివారణకు గాను కొడాలికి ప్రత్యామ్నాయం వెదుకుతోందని మరోసారి ప్రచారం జరిగింది. అయితే ఈ దిశగా ఇంతవరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ఇదే సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని అనూహ్యంగా స్పీడ్ పెంచి రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
దీంతో వైసీపీ కార్యకర్తల్లో జోష్ కనిపిస్తోందని చెబుతున్నారు. గుడివాడ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని, వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో ఘోర ఓటమితో ఆయన రాజకీయ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం మెయిన్ టార్గెట్ ఆయనే అన్న ప్రచారంతో గుడివాడ వైసీపీలో నైరాశ్యం చోటుచేసుకుంది. మరోవైపు నాని అనుచరులను అరెస్టు చేసి జైలుకు పంపడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ తో సుమారు 16 నెలలుగా కాలం వెళ్లదీశారు వైసీపీ కార్యకర్తలు. అయితే వారికి భరోసా కల్పిస్తూ ఇప్పుడు నాని తిరుగుతుండటంతో గుడివాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
కోర్టు కేసుల వల్ల తరచూ హైదరాబాద్ వెళ్లిరావడం ఇబ్బందిగా మారడం వల్ల ఏది జరిగితే అదే జరుగుతుందన్న ఆలోచనతో కొడాలి నాని గుడివాడలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఇక ఆరోగ్యం కూడా కుదుటపడటం, ఇప్పటికే ఏడాదిన్నర గడిచిపోవడం, స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటం వల్ల కార్యకర్తలకు అండగా నిలవాల్సివుందన్న ఆలోచనకు కొడాలి వచ్చారని చెబుతున్నారు. చాపకింద నీరులా తన పని చక్కబెడుతున్న నాని, గతంలో మాదిరిగా ప్రకటనలు చేయకుండా కామ్ గా తన పని చేసుకుపోతున్నారు. దీంతో ప్రభుత్వ వర్గాలు కూడా ఆయనపై ఫోకస్ చేయడం లేదని అంటున్నారు.