ఇరాన్ మసీదుపై ఎగిరిన ఎర్ర జెండా.. ప్రపంచం వణుకుతోంది...

ముఖ్యంగా పవిత్ర నగరం కోమ్‌లోని జామ్కరన్ మసీదు గోపురంపై ఎగిరిన ఎర్ర జెండా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అది కేవలం ఒక జెండా కాదు..ఒక భావోద్వేగం, ఒక హెచ్చరిక, ఒక ప్రతిజ్ఞ.;

Update: 2026-03-03 12:18 GMT

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు మిన్నంటుతున్నాయి. ఖమేనీ మరణంతో ఇరాన్ రాజకీయ వ్యవస్థలో ఏర్పడిన శూన్యత ఒక్క దేశానికే పరిమితం కాలేదు.. అది ప్రపంచ శాంతి సమీకరణాలపై కూడా పడగవేస్తోంది. ముఖ్యంగా పవిత్ర నగరం కోమ్‌లోని జామ్కరన్ మసీదు గోపురంపై ఎగిరిన ఎర్ర జెండా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అది కేవలం ఒక జెండా కాదు..ఒక భావోద్వేగం, ఒక హెచ్చరిక, ఒక ప్రతిజ్ఞ.

ఇరాన్ షియా సంప్రదాయంలో మసీదు గోపురంపై ఎర్ర జెండాను ఎగురవేయడం అంటే ‘అన్యాయం జరిగింది.. రక్తానికి రక్తం’ అనే సంకేతం. న్యాయం జరిగే వరకు విశ్రమించమనే ప్రతీకార సంకల్పానికి అది ప్రతీక. ఖమేనీ మరణాన్ని అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల ఫలితమని ఇరాన్ అధికారికంగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఆవేదన, ఆగ్రహం ఉప్పొంగాయి. ఈ నేపథ్యంలో ఎర్ర జెండా ఎగరడం యాదృచ్ఛికం కాదు.. అది ప్రతీకార రాజకీయానికి బహిరంగ ప్రకటన.

ఇరాన్ అత్యున్నత దళం ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇప్పటికే కఠిన హెచ్చరికలు జారీ చేసింది. ఖమేనీ మరణానికి కారణమైన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది. మరోవైపు దేశంలోని కొంతమంది ప్రజలు న్యాయం కోసం వీధుల్లోకి వస్తుండగా మరికొందరు టెహ్రాన్‌లో సంబరాలు చేసుకోవడం దేశ అంతర్గత విభేదాలను కూడా బయటపెడుతోంది. ఇది కేవలం విదేశీ దాడుల కథ కాదు..ఇది ఇరాన్ భవిష్యత్ రాజకీయ దిశను నిర్ణయించే సున్నిత దశ.

ఈ సంక్షోభ సమయంలో ఇరాన్ పాలనలో తాత్కాలిక నాయకత్వ మండలి ఏర్పాటైంది. అధ్యక్షుడు మసూద్ పెజేష్ క్కైన్, చీఫ్ జస్టిస్ గోలం హుస్సేన్ మోహసానీ తదితరులు బాధ్యతలు చేపట్టారు. ఇక శాశ్వత వారసుడిని ఎంపిక చేసే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్ పర్ట్స్ పై ఉంది. ఈ ఎంపిక ఇరాన్ భవిష్యత్తును మాత్రమే కాదు.. పశ్చిమాసియా రాజకీయ సమీకరణాలను కూడా ప్రభావితం చేయనుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ పరిణామాలను తమకు అనుకూలంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఖమేనీ అంతం ప్రాంతీయ శాంతికి దారితీస్తుందని వారు భావిస్తుండగా, ఇరాన్ మాత్రం దీనిని దాడి, అవమానం, జాతీయ గౌరవానికి గండిగా చూస్తోంది. ఇలాంటి విభిన్న వ్యాఖ్యానాల మధ్య నిజమైన ప్రశ్న ఏమిటంటే ఈ ఎర్ర జెండా ప్రతీకారం దిశగా నడిపిస్తుందా, లేక చర్చల బాట పట్టిస్తుందా?

చరిత్ర చెబుతోంది

షియా ఇస్లాం సంప్రదాయంలో ఎరుపు రంగు త్యాగానికి వీరమరణానికి చిహ్నం. క్రీ.శ. 680లో కర్బలా యుద్ధంలో అమరుడైన ఇమామ్ హుస్సేన్ రక్తాన్ని ఈ ఎరుపు రంగు సూచిస్తుంది. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేయడాన్ని ఇది గౌరవిస్తుంది.

ఇరాన్ సంస్కృతిలో ఎరుపు జెండాను ఎగురవేయడం అంటే "తీవ్రమైన ప్రతీకారం" తీర్చుకోబోతున్నాం అని అర్థం. అన్యాయంగా చంపబడిన వారి రక్తం గడ్డకట్టదు అని దానికి పగ తీర్చుకునే వరకు విశ్రమించబోమని ఈ జెండా చాటి చెబుతుంది.

జమ్కరాన్ మసీదుపై ఎరుపు జెండా

ఆధునిక చరిత్రలో 2020లో ఇరాన్ మొదటిసారిగా అత్యంత పవిత్రమైన జమ్కరాన్ మసీదు గోపురంపై ఎరుపు జెండాను ఎగురవేసింది. దీనికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.. 2020లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ మరణించినప్పుడు, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించడానికి ఈ జెండాను ఎగురవేశారు. సాధారణంగా మసీదులపై నీలం లేదా పచ్చ రంగు జెండాలు ఉంటాయి. కానీ ఎరుపు జెండా ఎగిరిందంటే అది యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు లేదా పెద్ద ఎత్తున ప్రతీకార చర్య చేపట్టబోతున్నట్లు సంకేతం.

భావోద్వేగాలపై నిర్మితమైన నిర్ణయాలు తరచుగా దీర్ఘకాల అస్థిరతకు దారితీస్తాయి. ఇరాన్‌కు ఇది ఆత్మపరిశీలన సమయం. ప్రతీకారం తక్షణ సంతృప్తి ఇవ్వవచ్చు కానీ శాంతి మాత్రమే శాశ్వత భద్రతను ఇస్తుంది. అదే సమయంలో అమెరికా-ఇజ్రాయెల్ వంటి శక్తులు కూడా ప్రాంతీయ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా అడుగులు వేయాలి.

కోమ్‌లో ఎగిరిన ఎర్ర జెండా ఒక దేశపు ఆవేదనను ప్రతిబింబించవచ్చు. కానీ అది ప్రపంచానికి యుద్ధ సంకేతంగా మారకూడదు. పశ్చిమాసియా ఇప్పటికే అనేక యుద్ధ గాయాలను మోస్తోంది. ఈసారి చరిత్ర మరో రక్తచరిత్ర రాయకుండా నాయకులు సంయమనం, దౌత్యం, సంభాషణలకు ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే ఆ ఎర్ర జెండా కేవలం మసీదు గోపురంపైనే కాకుండా, ప్రపంచ శాంతి పటంలోనూ రెపరెపలాడే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News