కేశినేని నాని అడుగులు ఆ పార్టీ వైపుగా ?

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వరసగా రెండు సార్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు, లగడపాటి రాజగోపాల్ తర్వాత కేశినేని నాని ఆ ఫీట్ సాధించారు.;

Update: 2025-11-24 03:27 GMT

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వరసగా రెండు సార్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు, లగడపాటి రాజగోపాల్ తర్వాత కేశినేని నాని ఆ ఫీట్ సాధించారు. అంతకు ముందు కొందరు గెలిచినా అపుడు రాజకీయాలు వేరు. తరువాత కాలం వేరు. అంతటి పోరులో సైతం నాని తన గెలుపుతో గట్టి ముద్ర వేయగలిగారు అంటే ఆయన జనాలకు చేరువగా ఉన్నారనే లెక్క. అయితే 2019 తర్వాత ఆయనకు ఎందుకో టీడీపీ అధినాయకత్వంతో గ్యాప్ ఏర్పడింది. లోకల్ గా ఉన్న టీడీపీ నాయకులతో ఆయన సర్దుబాటు చేసుకోలేకపోయారు, అలాగే వారు సైతం ఆయనను దూరం పెట్టారు. మరీ ముఖ్యంగా 2021లో జరిగిన విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్ధిగా పోటీ పడిన తన కుమార్తె కేశినేని శ్వేతను వైసీపీ కంటే సొంత వారే ఓడిచారు అన్న బాధ ఆయనను సైకిల్ పార్టీకి దూరం చేసింది అన్న చర్చ కూడా ఉంది.

వైసీపీలో చేరి :

ఇక కేశినేని 2024 ఎన్నికల ముందు దాకా టీడీపీలో ఉన్నా లేనట్లుగానే వ్యవహరించారు. ఆయన వైసీపీలో చివరి నిముషంలో చేరడం బిగ్ ట్విస్ట్ గా అయింది. ఇక అప్పటికే వైసీపీ పట్ల జనంలో వ్యతిరేకత ఉండడం, పైగా విజయవాడ ఎంపీ సీటు ఆ పార్టీ ఎన్నడూ గెలవకపోవడం వంటి వాటి నేపథ్యంలో కేశినేని నాని వైసీపీ చాయిస్ రాంగ్ అని అనుకున్నారు. చివరికి అది అలాగే జరిగింది. ఇక ఎన్నికల తరువాత తన రాజకీయ జీవితానికి స్వస్తి అని ఒక భారీ ప్రకటన చేసిన కేశినేని నానికి మళ్ళీ రాజకీయాల పట్ల ఆసక్తి పెరుగుతోంది అని అంటున్నారు.

ఒత్తిడి కూడా :

ఇక కేశినేని నానిని నమ్ముకుని ఆయన అనుచర గణం ఉంది. దాంతో వారందరి కోసం వీలుంటే తన కుమార్తెకు మంచి రాజకీయ భవిష్యత్తు కోసం తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని కేశినేని నాని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఆయన ఆ మధ్యనే విజయవాడలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు విజయవాడ ప్రజలు అంటే ఎంతో ఇష్టమని వారి కోసం ప్రజా సేవ చేస్తూనే ఉంటాను అని ప్రకటించారు. ప్రజా సేవ చేయాలంటే రాజకీయాల కంటే సరైన వేదిక వేరేది ఉండదు. అందుకే ఈసారి చాలా జాగ్రత్తగా తన రాజకీయ అడుగులు వేస్తున్నారు ఈ మాజీ ఎంపీ అని అంటున్నారు.

బీజేపీలోనేనా :

ఇక కేశినేని నాని రెండు సార్లు ఎంపీగా ఉన్నారు. ఆ సమయంలో ఆయనకు కేంద్ర బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో గుడ్ రిలేషన్స్ ని ఆయన మెయింటెయిన్ చేస్తూ వస్తున్నారు దాంతో ఆయన బీజేపీలో చేరాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. దేశంలో బీజేపీ హవా చూస్తే బాగుంది. అనేక రాష్ట్రాలను వరసగా గెలుచుకుంటోంది మరో వైపు ఇండియా కూటమి వీక్ గా ఉంది. ఇక ఈ రెండు కూటములలో లేని పార్టీల పరిస్థితి కూడా ఏమంత బాగులేదు. అందుకే కేశినేని ఈసారి జాతీయ పార్టీగా ఉన్న కాషాయ దళంలో చేరాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు.

డెసిషన్ అపుడేనట :

తొందరలోనే కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించి తన అభిమానులు అనుచరులతో చర్చించి అందరితో పాటుగా తాను బీజేపీ తీర్ధం పుచ్చుకోవాలని చూస్తున్నారుట. ఇక 2029 ఎన్నికల నాటికి బీజేపీ ఏపీలో మరిన్ని సీట్లు ఎక్కువగా కోరుతుందని అందులో విజయవాడ ఒకటిగా ఉంటుందని కేశినేని నాని అనుచరులు నమ్ముతున్నారు. రెండు సార్లు ఎంపీగా చేసిన నాని కంటే మంచి నాయకుడు బీజేపీకి ఉండరు కాబట్టి ఆయన వివాద రహితుడు కూడ కావడంతో కచ్చితంగా ఆయనకు ఎంపీ టికెట్ దక్కుతుందని అంటున్నారు. కూటమి పార్టీల మద్దతుతో సులువుగా మరోసారి ఎంపీ కావచ్చు అన్నది కేశినేన్ నాని ప్లాన్ అని అంటున్నారు. సో కేశినేని నాని అడుగులు బీజేపీ వైపుగా సాగుతున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో. కేశినేని నాని సెకండ్ ఇన్నింగ్స్ ఏ విధంగా స్టార్ట్ అవుతాయో.

Tags:    

Similar News