20 ఏళ్ల తర్వాత ఉద్యోగం.. జాయిన్ అయ్యేలోపే రిటైర్!

పరీక్ష రాసిన అభ్యర్థికి కేవలం అంటే కేవలం 20 ఏళ్ల తర్వాత ఉద్యోగ నియామక ఉత్తర్వు పంపించి పరిపాలనా చరిత్రలోనే ఒక సరికొత్త 'మైలురాయి'ని క్రియేట్ చేసింది. మలప్పురానికి చెందిన అబ్దుల్ మజీద్ కథ వింటే నవ్వాలో, ఏడవాలో అర్థం కానంత విచిత్రంగా ఉంటుంది.

Update: 2026-05-31 05:57 GMT

మన ప్రభుత్వ కార్యాలయాల వేగం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? "నత్తనడక" అనే పదం కూడా సిగ్గుపడేలా పని చేయడం మన సిస్టమ్ స్పెషాలిటీ. తాజాగా కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్.సీ) ఈ విషయాన్ని మరోసారి నిరూపించి ప్రపంచ రికార్డులకెక్కే ఘనత సాధించింది. పరీక్ష రాసిన అభ్యర్థికి కేవలం అంటే కేవలం 20 ఏళ్ల తర్వాత ఉద్యోగ నియామక ఉత్తర్వు పంపించి పరిపాలనా చరిత్రలోనే ఒక సరికొత్త 'మైలురాయి'ని క్రియేట్ చేసింది. మలప్పురానికి చెందిన అబ్దుల్ మజీద్ కథ వింటే నవ్వాలో, ఏడవాలో అర్థం కానంత విచిత్రంగా ఉంటుంది.

ఆశ చచ్చాక... లెటర్ వచ్చింది!

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే... 2005వ సంవత్సరంలో అబ్దుల్ మజీద్ గారు ఎంతో ఉత్సాహంతో ‘అరబిక్ టీచర్’ పోస్టుకు పరీక్ష రాశారు. అప్పట్లో ఉద్యోగం వస్తుందనే ఆశతో రోజూ పోస్టుమ్యాన్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూశారు. కొన్నేళ్లు గడిచాయి... ఆశ వదిలేశారు. మరికొన్నేళ్లకు పిల్లలు పెద్దవారై చదువులు పూర్తి చేసుకున్నారు. ఇంకొన్ని ఏళ్లకు వారికి పెళ్లిళ్లు కూడా అయిపోయి, మజీద్ గారు తాత కూడా అయిపోయారు!

కట్ చేస్తే... ఈ నెల 27న ఆయన తన 60వ పుట్టినరోజు జరుపుకున్నారు. అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయనకు 'రిటైర్మెంట్' వయసు వచ్చేసింది. సరిగ్గా అదే రోజు... పీఎస్.సీ నుంచి ఒక అద్భుతమైన నియామక ఉత్తర్వు ఆయన ఇంటి తలుపు తట్టింది! "ఉత్తర్వు అందిన మూడు నెలల్లోగా విధుల్లో చేరాలి" అని అధికారులు అందులో ఆదేశించారు. దీనిపై మజీద్ గారు స్పందిస్తూ... "సరే జాయిన్ అవుతాను, కానీ జాయినింగ్ రోజే ఫేర్‌వెల్ వీడ్కోలు పార్టీ కూడా ఇస్తారా?" అని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం

ఈ విచిత్రమైన ఘటనపై నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్లతో రెచ్చిపోతున్నారు. "ఇది ఉద్యోగ నియామకం కాదు బ్రదర్... ప్రభుత్వం ఇచ్చిన రిటైర్మెంట్ గిఫ్ట్!" అని ఒకరు, "మరో 20 ఏళ్లు ఆలస్యమై ఉంటే... నేరుగా స్వర్గంలో డ్యూటీకి రిపోర్ట్ చేయమని లెటర్ పంపించేవారేమో!" అని ఇంకొకరు కౌంటర్లు వేస్తున్నారు.

మరోవైపు పాపం మజీద్ గారు మాత్రం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. "సామీ.. 20 ఏళ్లు ఓపిగ్గా వేచి చూశాను. కనీసం ఒక ఏడాది అయినా బడికి వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పే అవకాశం ఇవ్వండి" అంటూ విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం పంపారు.

భవిష్యత్తు ప్రణాళికలు అద్భుతం!

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కేరళ ప్రభుత్వ శాఖలు ఈ విజయంతో ఆగిపోవాలని అనుకోవడం లేదు. ఈ అద్భుతమైన స్పీడ్‌ను భవిష్యత్తులోనూ కొనసాగించాలని చూస్తున్నాయట.

ఈ వినూత్న విద్యా విధానంపై అధికారులు తీవ్రంగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా "నిదానమే ప్రధానం... ఆలస్యమే అమృతం" అనే సామెతను మన ప్రభుత్వాలు ఇంత అక్షరాలా పాటిస్తాయని ఎవరు ఊహించి ఉంటారు చెప్పండి!



Tags:    

Similar News