'అప్పుడు నేనేమీ చేయలేను' ఇదేం మాట కేసీఆర్?
అప్పుడు నేనేమీ చేయలేను" అని వ్యాఖ్యానించిన ఆయన.. మరో సందర్భంలో మాత్రం "మళ్లీ ఉద్యమాలు చేయాల్సి వస్తుంది" అని పేర్కొనటం గమనార్హం.;
గులాబీ బాస్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాది మందిని కదిలించే స్వరం.. ఆయన మాటల శక్తి తెలుగు వారికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. సమయానికి.. సందర్భానికి అనుగుణంగా తన మాటల్ని మార్చుకునే నేర్పు కేసీఆర్ సొంతం. అలాంటి ఆయన.. తొలిసారి రోటీన్ కు భిన్నంగా.. కాస్తంత బేలతనం.. మరికాస్త తెంపరితనం.. ఇంకాస్త బెదిరింపు ధోరణిని రంగరించి మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో తమను గెలిపించకుంటే.. తమకు అధికారాన్ని ఇవ్వకుంటే రాష్ట్రం ఆగమాగం అవుతుందన్న అంశంతో పాటు.. కాంగ్రెస్ తో పెద్ద దెబ్బ అంటూ ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు విస్మయానికి గురి చేస్తున్నాయి. గడిచిన పదేళ్లలో ఎప్పుడూ రాని రెండు మాటలు కేసీఆర్ నోటి నుంచి వచ్చాయి. "పైరవీకారులైన కాంగ్రెస్ ను అధికారంలోకి రానివ్వొద్దు.
ఆ పార్టీతో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దళారుల రాజ్యం రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏమరుపాటుగా ఉంటే ప్రమాదం. అప్పుడు నేనేమీ చేయలేను" అని వ్యాఖ్యానించిన ఆయన.. మరో సందర్భంలో మాత్రం "మళ్లీ ఉద్యమాలు చేయాల్సి వస్తుంది" అని పేర్కొనటం గమనార్హం.
తమ పదేళ్ల పాలన గురించి వివరించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ చేతికి అధికార పగ్గాలు చిక్కితే తెలంగాణ రాష్ట్రంలో ఆరాచకమే నడుస్తుందని పేర్కొన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా 24 గంటల కరెంటు ఇస్తున్నది తెలంగాణ ఒక్కటేనని.. కాంగ్రెస్ చేతికి అధికారం వెళితే.. మూడు గంటల కరెంటు మాత్రమే వస్తుందని వ్యాఖ్యానించారు. రైతుల భూములపై హక్కులు రైతులకే ఉండాలనే ఉద్దేశంతో తాను ధరణి పోర్టల్ ను తీసుకొస్తే.. కాంగ్రెస్ నేతలు దానిని రద్దు చేస్తామని చెబుతున్న విషయాన్ని ప్రస్తావించారు.
రైతుల భూములు భద్రంగా ఉండాలన్నా.. 24 గంటలూ కరెంటు రావాలన్నా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్న కేసీఆర్.. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా చాలా పెద్ద తగులుతుందన్నారు. అప్పుడు తాను ఏమీ చేయలేని పరిస్థితి వస్తుందన్న హెచ్చరిక చేసిన కేసీఆర్.. "మళ్లీ ఉద్యమాలు చేయడం తప్ప చేయగలిగేది ఏమీ ఉండదు" అంటూ జనగామ..
భువనగిరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల కాలంలో అధికార బీఆర్ఎస్ బలం తగ్గుతుందని.. కాంగ్రెస్ గాలి బలంగా వీయటం మొదలైందన్న అంచనాల వేళ.. వాటికి బలం చేకూరేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.