అమ్మ రాయ‌బారం: బీఆర్ఎస్‌లో ఏం జ‌రుగుతోంది?

క‌త్తికి లొంగ‌నిది కూడా.. క‌న్న‌త‌ల్లికి లొంగుతుంద‌న్న సామెత‌ను నిజం చేసే దిశ‌గా బీఆర్ ఎస్‌లో నెల‌కొన్న వివాదా ల‌ను ప‌రిష్క‌రించేందుకు శోభ ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.;

Update: 2025-09-12 08:18 GMT

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిపక్షం బీఆర్ ఎస్‌లో నెల‌కొన్న అంత‌ర్గ‌త రాజ‌కీయ‌ కుంప‌టిని చ‌ల్లార్చే దిశ‌గా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించారా? ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. భ‌విష్య‌త్తులో ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో పార్టీ ప‌రిణామాల‌ను స‌రిచేసేందుకు ఆయ‌న రెడీ అయ్యారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. తాజాగా కేసీఆర్ స‌తీమ‌ణి.. క‌ల్వ‌కుంట్ల శోభ‌.. త‌న కుమార్తె, జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత ఇంటికి వెళ్లారు. అయితే.. ఆమె చెబుతున్న కార‌ణం వేరే ఉన్నా.. ఈ `రాక` వెనుక‌.. `రాయ‌బారం` ఉంద‌న్న వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది.

క‌త్తికి లొంగ‌నిది కూడా.. క‌న్న‌త‌ల్లికి లొంగుతుంద‌న్న సామెత‌ను నిజం చేసే దిశ‌గా బీఆర్ ఎస్‌లో నెల‌కొన్న వివాదా ల‌ను ప‌రిష్క‌రించేందుకు శోభ ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. తండ్రికి మ‌ద్ద‌తు ఇస్తున్న క‌విత‌.. హ‌రీష్‌రావు, సంతోష్ రావుల‌ను తీవ్రంగా విభేదిస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి జ‌ర‌గ‌లేద‌ని విప‌క్ష నేత‌లు చెబుతుంటే.. జ‌రిగింద‌న్న‌ట్టుగా మాట్లాడి మ‌రో ర‌చ్చ చేశారు. దీంతోనే ఆమెపై బ‌హిష్క‌ర‌ణ వేటు వేయాల‌ని పార్టీ నాయ‌కులు ఒత్తిడి తెచ్చారు. కానీ, కేసీఆర్ అంత ప‌నిచేయ‌లేక‌.. కేవ‌లం స‌స్పెన్ష‌న్‌కే ప‌రిమితం చేశారు.

అయితే.. ఈ విష‌యంలోనూ.. కేసీఆర్‌పై ఒత్తిళ్లు ప‌నిచేస్తున్నాయ‌ని తెలుస్తోంది. క‌న్న బిడ్డ‌పై వేటు వేయ‌డం ద్వారా.. పార్టీని బ‌ల‌హీన ప‌రుచుకోవ‌డం స‌రికాద‌ని సీనియ‌ర్లు, ఉద్య‌మ కాలం నుంచి కేసీఆర్‌తో ఉన్న వారు కూడా చెబుతున్నారు. త‌ప్పులు జ‌రుగుతాయ‌ని.. త‌ప్పులు జ‌ర‌గ‌క‌పోతే రాజ‌కీయాలు లేవ‌ని.. అంత మాత్రాన‌.. ఇంటి బిడ్డ‌పై వేటు వేస్తే.. అది త‌ప్పుడు సంకేతాలు ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని వారు చెబుతున్నట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌.. మున్ముందు ఈ ప‌రిణామాలు పెర‌గ‌కుండా.. ప్ర‌స్తుతం నెల‌కొన్న ఇబ్బందుల‌ను త‌గ్గించుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇక‌, తాజాగా గురువారం శోభ‌.. త‌న కుమార్తె ఇంటికి వ‌చ్చారు. త‌న అల్లుడు అనిల్ కుమార్ పుట్టిన రోజును పుర‌స్క రించుకుని కూతురు, అల్లుడికి కొత్త బ‌ట్ట‌లు తీసుకువ‌చ్చారు. పైకి ఈ కార‌ణ‌మే చెబుతున్నా.. లోలోప‌ల మాత్రం చ‌ర్చ‌ల దిశ‌గానే కుమార్తెను ఊర‌డించేందుకు సంయ‌మ‌నం పాటించేలా స‌ర్దుబాటు చేసేందుకు శోభ ప్ర‌య‌త్నించార‌ని స‌మాచారం. ఎందుకంటే.. వారం కింద‌ట మ‌న‌వ‌డి పుట్టిన రోజుకు రావాల‌ని పిలిచినా రాని శోభ‌.. అల్లుడి పుట్టిన రోజుకు రావ‌డం వెనుక రాజ‌కీయ కార‌ణాలే ఉంటాయ‌ని అంటున్నారు. మ‌రి ''అమ్మ రాయ‌బారం'' ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.

Tags:    

Similar News