అసెంబ్లీకి కేసీఆర్‌.. ముహూర్తం పెట్టుకున్నార‌ట‌!

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. అసెంబ్లీకి వ‌స్తారా? రారా? అనే విష‌యంపై దాదాపు తెర‌ప‌డినట్టు తెలిసింది.;

Update: 2025-08-30 19:30 GMT

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. అసెంబ్లీకి వ‌స్తారా? రారా? అనే విష‌యంపై దాదాపు తెర‌ప‌డినట్టు తెలిసింది. శ‌నివారం నుంచి ప్రారంభ‌మ‌య్యే అసెంబ్లీ స‌మావేశాల‌కు చాలా ప్ర‌త్యేక‌త ఉంది. ప్ర‌భుత్వం.. ఈ స‌భ‌ల్లో కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ్య‌వ‌హారంపై విచార‌ణ ముగించి ఇచ్చిన పీసీ ఘోష్ నివేదిక‌ను స‌భ‌లో ప్ర‌వేశ పెట్ట‌నుంది. దీనిపై చ‌ర్చ‌కు కూడా ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు కూడా ఓకే చెప్పారు.

ఈ నేప‌థ్యంలో ఇత‌ర విష‌యాల సంగ‌తి ఎలా ఉన్నా.. బీఆర్ ఎస్ అధినేతకు మాత్రం ఈ చ‌ర్చ ఏక‌ప‌క్షం గా సాగితే ఇబ్బంది త‌ప్ప‌దన్న వాద‌న వినిపిస్తోంది. బ‌ల‌మైన గ‌ళం వినిపించేందుకు కేటీఆర్‌, హ‌రీష్ రావు లాంటి నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ.. తెలంగాణ స‌మాజంతో పేగు బంధం ఏర్ప‌రుచుకున్న కేసీఆర్ స్వ‌యం గా దీనిపై మాట్లాడితే వ‌చ్చే గ్రాఫ్‌కు.. వారు మాట్లాడితే వ‌చ్చే రెస్పాన్స్‌కు తేడా ఉంటుంది. అందుకే.. సీఎం రేవంత్ రెడ్డి కూడా.. దీనిపై చ ర్చించే స‌మ‌యంలో కేసీఆర్ రావాల‌ని కోరుతున్నారు.

తాజాగా ఈ విష‌యంపై శ‌నివారం ఉద‌య‌మే త‌న ఫామ్ హౌస్ నుంచి కీల‌క నాయ‌కుల‌తో కేసీఆర్ ఫోన్‌లో సంభాషించిన‌ట్టు తెలిసింది. తాను కూడా అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌స్తున్న‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చార‌ని స‌మాచారం. అయితే.. ఎప్పుడు వ‌చ్చేదీ ఇంకా డేట్లు ఇవ్వ‌క‌పోయినా.. తాను వ‌స్తాన‌ని.. ముందు మీరు వెళ్లాల‌ని ఆయ‌న దిశానిర్దేశం చేశారు. వ‌ర్షాలు, ప్ర‌జ‌ల అగ‌చాట్లు, హైడ్రా, అవినీతి, బ‌న‌క‌చ‌ర్ల స‌హా.. ఇత‌ర ప్ర‌ధాన అంశాల‌ను.. స‌భ‌లో లేవ‌నెత్తాల‌ని సూచించారు. ఈ క్ర‌మంలో తాను కూడా స‌భ‌కు వ‌స్తాన‌ని ఆయ‌న చెప్పారు.

ఎప్పుడు వ‌స్తారంటే..

బీఆర్ ఎస్ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం.. కాళేశ్వ‌రంపై పీసీ ఘోష్ క‌మిష‌న్ ఇచ్చిన నివేదిక అసెంబ్లీలో వచ్చేందుకు రెండు మూడు రోజుల స‌మ‌యం ప‌డుతుంది. అప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ వెయిట్ చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత కూడా.. నివేదిక‌పై ప్ర‌భుత్వ వాద‌న‌ను ఆయ‌న లైవ్‌లో విని... దాని ప్ర‌కారం.. కౌంట‌ర్ రెడీ చేసుకుని వ‌స్తార‌ని స‌మాచారం. ఒక‌వేళ ఈ విష‌యంలో ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గితే మాత్రం కేసీఆర్ వెనుక‌డుగు వేయం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News