జ‌ల వివాదాల‌పై కేసీఆర్ గ‌ళం.. స‌క్సెస్ అయ్యేనా?

మళ్లీ సెంటిమెంట్ రాజకీయాల దిశగానే బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ అడుగులు వేస్తున్నారు.;

Update: 2025-12-15 17:30 GMT

మళ్లీ సెంటిమెంట్ రాజకీయాల దిశగానే బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, ఉద్యోగాల నినాదం ఏ విధంగా అయితే పనిచేసిందో ఇప్పుడు కూడా జల వివాదాలకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ గళం విప్పాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 19న విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి దీనిపై కీలక నిర్ణయం తీసుకోవాలని భావించారు. అయితే, జలవివాదాల విషయంలో కేసీఆర్ వాదన ఎలా ఉన్నప్పటికీ ఇప్పటికే కాళేశ్వరం సహా మేడిగడ్డ వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ అవినీతి చేసింద‌ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల మ‌ధ్య‌కు తీసుకువెళ్ళింది. దీనిపై విచారణలు కూడా చేపట్టింది.

ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. ప్రస్తుతం దీనిపై నివేదిక కూడా సిద్ధమైంది. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి నల్గొండలో పర్యటించినప్పుడు కూడా ఎస్ఎల్బీసీ అంశాన్ని ప్రస్తావించారు. ఎస్ ఎల్ బి సి ని ఉద్దేశపూర్వకంగా కెసిఆర్ పక్కన పెట్టారని... దీంతో నల్గొండ ప్రజలకు నీరు అందకుండా పోయిందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అంతేకాదు తన నియోజకవర్గానికి, తన కుమారుడి నియోజకవర్గానికి, తన మేనల్లుడు నియోజకవర్గానికి మేలు చేసుకున్న కేసీఆర్.... ప్రజలకు సంబంధించిన అంశాలను మాత్రం పక్కదారి పట్టించారని వ్యాఖ్యానించారు. ఇది ప్రజల్లో బలంగా చర్చకు వ‌స్తోంది. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, దీనికి అనుబంధంగా చేపట్టిన మేడిగడ్డ ప్రాజెక్టులు వివాదాల్లో చిక్కుకోవడం, అదే సమయంలో అవినీతి ఆరోపణలు కూడా రావడం వంటివి ఆయనకు ప్రతిబంధుకంగా మారాయి.

ముందు వీటికి సమాధానం చెప్పకుండా ఇప్పుడు ఏపీ కావేరి జలాలను అడ్డుపెట్టి తెలంగాణ నీటిని తోడేసేందుకు ప్రయత్నిస్తుందని వాదన తీసుకురావడం ద్వారా మరోసారి ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారన్నది స్పష్టమవుతుంది. జల వివాదాలపై కేసీఆర్ గళం విప్పినప్పటికీ.. అవి ఏ మేరకు ప్రజలకు చేరువ అవుతాయి అన్నది చూడాలి. ఎందుకంటే కాళేశ్వరాన్ని భారీ ప్రాజెక్టుగా పేర్కొన్న కేసీఆర్.. ఈ విషయంలో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ముందు వీటికి ఆయన సమాధానం చెప్పకుండా ఇతర ప్రాజెక్టుల గురించి మాట్లాడినా, ఏపీ పై ఆయన ఆరోపణలు చేసినా సానుభూతి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరి ఆయన ఏం చేస్తారు? జలవివాదాలుపై ఆయన చేపడుతున్న కార్యక్రమాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయి అనేది చూడాలి.

Tags:    

Similar News