మళ్ళీ అధికారంలోకి వస్తాం...మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్య
తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ కు ఆదరణ ఎన్నటికీ తగ్గదు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా...మళ్ళీ మనమే కొడతాం...అంటూ బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.;
తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ కు ఆదరణ ఎన్నటికీ తగ్గదు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా...మళ్ళీ మనమే కొడతాం...అంటూ బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లి, నర్సన్నపేట, గజ్వేల్ ప్రాంతాల నుంచి గ్రామ సర్పంచులుగా ఎన్నికైన అభ్యర్థులు గౌరవపూర్వకంగా తమ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా పల్లె ప్రజల మద్దతుతో సర్పంచులుగా గెలిచిన వారిని కేసీఆర్ అభినందిస్తూ...రానున్న కాలంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం పక్కా అని భరోసా ఇచ్చారు.
ఈ సందర్బంగా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...బీఆర్ఎస్ ఈసారి అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాలన్నాక అధికారం రావడం పోవడం సర్వసాధారణమని...ఒకసారి అధికారం కోల్పోయినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేనేలేదని అన్నారు. తెలంగాణ ప్రజలు పొరపాటున బీఆర్ఎస్ ను వదులుకున్నామని చింతిస్తున్నారని, అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని కేసీఆర్ అన్నారు. అంతవరకు అందరూ సానుకూల దృక్పథంతో ఉండాలని కోరారు.
తెలంగాణ ఇచ్చింది మేమే అని కాంగ్రెస్...లేదు పోరాడి తెచ్చింది మేమే అని బీఆర్ఎస్ మొదట్నుంచి వాదించుంటున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఘనత కేసీఆర్ కు ఎప్పటికీ ఉంటుంది. అందుకే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా...పోరాటయోధుడిగా కేసీఆర్ ను గుర్తించి అతని పార్టీకే అధికారం కట్టబెట్టింది తెలంగాణ సమాజం. రెండు దఫాలుగా పదేళ్ళపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ...రాష్ట్ర ప్రజలు ఆశించింది ఒనగూరలేదన్న విమర్శలున్నాయి. ఉమ్మడి ఆంధ్ర పాలనలో భంగపడ్డ తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినా...పదేళ్ళ పాలన పలుదారుల్లో మళ్ళిందన్న విమర్శను మూటగట్టుకోవాల్సి వచ్చింది.
తెలంగాణ ఆత్మగా భావిస్తున్న నీళ్ళు...నిధులు...నియామకాల విషయంగా బీఆర్ఎస్ అనుకున్న ప్రగతి సాధించలేదని స ర్వత్రా వినవస్తున్న మాట. తెలంగాణ ప్రతిష్టగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపైనే నీలినీడలు కమ్ముకున్నాయి. సొంతపార్టీ నేతలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీశ్ కుమార్ పై కేసీఆర్ కుమార్తె కవిత తిరుగుబాటు జెండా ఎగురవేయడం...పార్టీనుంచి సస్పెండ్ కావడం బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలుగానే గుర్తించాలి.
ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచుల్ని ఉద్దేశించి కేసీఆర్ అన్నమాటలు బీఆర్ఎస్ నేతలు..కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపడానికే అని భావించాల్సి వస్తుంది. ఈ సందర్భంగా గంగదేవిపల్లిని ఆదర్శంగా తీసుకోవాలని కేసీఆర్ కోరారు. ఆ పల్లె ప్రజలు కలిసికట్టుగా సాగడం వల్ల ప్రగతి సాధ్యపడిందని అన్నారు. పల్లెల్లో నిజమైన ప్రగతి ప్రజలు ఐక్యంగా ఉన్నప్పుడే సాధ్యమని కేసీఆర్ అన్నారు. ఇదే సమయంలో పాలక కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మంచిగా పాలన అందిస్తామన్న కాంగ్రెస్ తన మాట నిలబెట్టుకోలేక పోయిందని ఘాటుగా విమర్శించారు. ఇన్నాళ్ళు కేవలం ఫాం హౌస్ కే కేసీఆర్ పరిమితమయ్యారు...అసెంబ్లీక్కూడా రావడం లేదన్న విమర్శల నుంచి ఈ వ్యాఖ్యల ద్వారా పాత కేసీఆర్ మనకు కనిపించబోతున్నాడా అనిపిస్తోంది...వేచి చూడాలి మరి.