యాదాద్రి గుడిలోనూ ఆంధ్రా- తెలంగాణ వివాదమా? కవిత తీరుపై మండిపాటు

దశాబ్ద కాలం కిందటి ప్రాంతీయ విభజన రేఖలను మళ్లీ గీసేలా ఆమె మాట్లాడటంపై సామాజిక వర్గాలు, మేధావుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2026-08-27 12:54 GMT

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత యాదాద్రి దేవస్థానం బోర్డు నియామకాలపై.. ప్రముఖ నటుడు చిరంజీవి సతీమణికి ఇచ్చిన పదవిపై చేసిన పరోక్ష వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. దశాబ్ద కాలం కిందటి ప్రాంతీయ విభజన రేఖలను మళ్లీ గీసేలా ఆమె మాట్లాడటంపై సామాజిక వర్గాలు, మేధావుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ ఉనికి కోసం పాత మంత్రమేనా?

తెలంగాణ సాధన సఫలీకృతమై ఎన్నో ఏళ్లు గడిచినా.. ఇంకా "ఆంధ్రా-తెలంగాణ" ముద్రలతో విద్వేషాలను రగిలించే ప్రయత్నం చేయడం కవిత రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భక్తి, దేవాలయాలకు ప్రాంతీయ విద్వేషాలను ఆపాదించడం ప్రజాస్వామ్యంలో ఏమాత్రం సమంజసం కాదనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి సెటిల్ అయ్యింది తెలంగాణలోనే..

చిరంజీవి కుటుంబం చెన్నై వదిలిన తర్వాత దశాబ్దాలుగా హైదరాబాద్‌లోనే స్థిరపడింది. వారి పిల్లలు ఇక్కడే పెరిగారు.. ఇక్కడే నటులుగా గుర్తింపు పొందారు. ఆస్తులు, వ్యాపారాలు, జీవితం అంతా తెలంగాణతోనే ముడిపడి ఉన్నప్పుడు.. ఇంకా వారిపై 'ఆంధ్ర' ముద్ర వేయడం ఎంతవరకు సమంజసం? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు.

చిరంజీవి సతీమణి పుట్టి పెరిగిన ప్రాంతం ఆంధ్రా కావచ్చు, కానీ ఆమె నివాస ప్రాంతం హైదరాబాద్. తెలంగాణలోనే జీవిస్తూ ఈ ప్రాంతంతో మమేకమైన వారిని కూడా "పరాయి"వారిగా చూడటం సంకుచిత మనస్తత్వానికి అద్దం పడుతోంది. యాదాద్రి దేవస్థానంలో ఒక ప్రముఖురాలికి పదవి ఇస్తే, దానిని ప్రాంతీయ హక్కుల పోరాటంగా చిత్రీకరించడం సమర్థనీయం కాదు. ఆధ్యాత్మిక క్షేత్రాలు అందరికీ సమానమేనన్న కనీస ధర్మాన్ని ఇక్కడ విస్మరించారు.

అభివృద్ధి రాజకీయం కావాలో.. ప్రాంతీయ విద్వేషాలు కావాలో..

తెలంగాణ ప్రయోజనాలు, స్థానికులకు ప్రాధాన్యత అనే నెపంతో పాత వివాదాలను మళ్లీ తెరపైకి తెచ్చి ప్రజల మధ్య చీలికలు తేగలమని భావించడం భ్రమ మాత్రమే. తెలంగాణ ప్రజలు ఈ తరహా ప్రాంతీయ విద్వేష రాజకీయాలను ఎప్పుడో దాటి ముందుకు వెళ్లారు.

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించి రాజకీయాలు చేయాల్సింది పోయి.. దేవాలయాల వేదికగా ప్రాంతీయ ముద్రలు వేస్తూ వివాదాలు సృష్టించడం తెలంగాణ రాజకీయ సంస్కృతికే మచ్చ అని నెటిజన్లు, విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో రాజకీయంగా ప్రాధాన్యం పొందిన ఆంధ్రా, తెలంగాణ అంశాలను మరోసారి తెరపైకి తీసుకురావడం వల్ల ప్రజల్లో ప్రాంతీయ విభేదాలు పెరిగే అవకాశం ఉందని కొందరు మేధావులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి అంశాలను రాజకీయంగా ఉపయోగించుకోవడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

మొత్తంగా యాదాద్రి దేవస్థానం అంశంతో మొదలైన ఈ వివాదం మరోసారి ఆంధ్రా, తెలంగాణ ప్రాంతీయ రాజకీయాలపై చర్చకు తెరతీసింది. కవిత వ్యాఖ్యలు నిజంగా తెలంగాణ హక్కుల పరిరక్షణలో భాగమా? లేక పాత ప్రాంతీయ విభేదాలను మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నమా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.



Tags:    

Similar News