కొండా సుష్మిత .. ప్లాన్ బీ ఏంటి ?

ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన అనంతరం కొండా సుష్మిత తండ్రి కొండా మురళి మీడియాతో మాట్లాడిన మాటలు ఇవి.

Update: 2026-08-27 06:39 GMT

‘నా కూతురు సుష్మిత ప్లాన్ ఎలో మాట్లాడింది. ఆమె వద్ద ఉన్న ప్లాన్ బి ఏంటో నాకు తెలియదు. ఆమె వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం. మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకు ఆమెను ప్రశ్నించే హక్కు లేదు. ఆమె వయసు 38. ఆమెకు 12 ఏళ్ల కూతురు ఉంది. ఆమె చిన్న పిల్ల కాదు. మాకు మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచన లేదు. గాంధీ కుటుంబంపై పూర్తి విశ్వాసం ఉంది’.

ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన అనంతరం కొండా సుష్మిత తండ్రి కొండా మురళి మీడియాతో మాట్లాడిన మాటలు ఇవి. రేవంత్ రెడ్డి మీద సుష్మిత ఆరోపణల నేపథ్యంలో క్రమశిక్షణ సంఘం పార్టీ అధిష్టానానికి కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించాలని సిఫారసు చేసిన నేపథ్యంలో కొండా మురళి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

తాను తన కూతురు వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో మల్లు భట్టి విక్రమార్కను కలవలేదని, కేవలం ఒక బిల్లు విషయంలో కలిశానని కొండా మురళి చెబుతున్నారు. అయితే కొండా మురళితో భేటీ అనంతరం ఈ రోజు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బెంగుళూరుకు వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు తన వ్యాఖ్యలకు తాను బాధ్యత వహించనని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేయగా, తన కూతురు వద్ద ఉన్న ప్లాన్ బి ఏంటో తనకు తెలియదని కొండా మురళి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఇంతకుముందే కొండా సురేఖ బెంగళూరు వెళ్లి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో గంట పాటు భేటీ అయ్యారు. ఇప్పుడు భట్టి విక్రమార్క కూడా కొండా మురళితో భేటి అనంతరం ఖర్గే వద్దకే వెళ్లడం గమనార్హం.

పరకాల నుండి వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తిరిగి పోటీ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో, అభ్యర్థులను ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరంటూ సుష్మిత పలు ఆరోపణలు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీలో సుష్మితకు సభ్యత్వం లేకపోవడంతో ఆమె మీద చర్యలు తీసుకునే అంశం కాంగ్రెస్ పార్టీకి క్లిష్టతరంగా మారింది.

పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేరుగా కొండా సురేఖను ఈ విషయంలో తప్పుపట్టారు. కూతురును అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత ఆమె మీదనే ఉందని, గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి రాజీ పడ్డారని, తిరిగి ఇప్పుడు కూడా అలాగే వ్యవహరించి, పార్టీకి నష్టం కలిగిస్తున్నారని వారు అంటున్నారు. క్రమశిక్షణ సంఘం కూడా కొండా సురేఖ పదే పదే పార్టీకీ నియమావళికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని, పలుమార్లు చెప్పినా వ్యవహారశైలి మారడం లేదని, అందుకే ఆమెను పదవి నుంచి తప్పించాలని అధిష్టానానికి చేసిన సిఫార్సులో పేర్కొన్నది.

ఒక వైపు క్రమశిక్షణ సంఘం పదవి నుండి తప్పించాలని సిఫార్సు చేసిన తరువాత కూడా సుష్మిత తండ్రి కొండా మురళి ప్లాన్ బి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వివాదాన్ని వీరు ఎక్కడికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు ? వారి వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి ? వీరిని వెనకనుండి ప్రోత్సహిస్తున్నది ఎవరు ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొండా సురేఖ దంపతులు బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పడం కొసమెరుపు.

Tags:    

Similar News