లోకల్ ఫైట్ : రెబెల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తారా ?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మామూలుగా లేదు. అటు పార్టీ నాయకత్వాలతో పాటు ఇటు ఆశావహులు కూడా తమదైన కార్యాచరణలో ఉన్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మామూలుగా లేదు. అటు పార్టీ నాయకత్వాలతో పాటు ఇటు ఆశావహులు కూడా తమదైన కార్యాచరణలో ఉన్నారు. వస్తే పార్టీ టికెట్ లేకుంటే రెబెల్ గా బరిలోకి దిగి అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారు. దాంతో ఈసారి స్థానిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున రెబెల్స్ బరిలోకి దిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. స్థానిక ఎన్నికలు అంటే ఒక పరిధిలో జరుగుతాయి. దాంతో స్థానికంగా తమకు పలుకుబడి ఉందని భావిస్తే అర్ధ బలం అంగబలం ఉన్న వారు ఎవరైనా రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.
డైరెక్ట్ ఫైట్ తో జోరు :
ఇక డైరెక్ట్ ఫైట్ తో చాలా మంది జోరు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పార్టీ నుంచి టికెట్ కోసం ప్రయత్నిచి విఫలం అయిన వారు కచ్చితంగా తాము పోటీలో ఉండేలా ఏర్పాటు చేసుకుంటారని అంటున్నారు. పార్టీ నుంచి వేరు పడి పోటీ చేసినా తమ సత్తా చాటుకోవడానికే చూస్తారు అని గట్టిగా వినిపిస్తోంది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలు అంటే వేలాది పదవులు పోటీ ఉంటుంది. సింగిల్ గా ఒక పార్టీ అయినా మొత్తానికి మొత్తం చూడలేక సర్దుబాటు చేయలేక చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఏపీలో కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. వారి మధ్య సీట్ల సర్దుబాటు ఎంతలా కుదిరినా అలాగే పొత్తులతో కలసి ముందుకు అడుగులు వేసినా కూడా పోటీ చేయాలనుకునే ఆశావహులను సముదాయించే పరిస్థితి ఉండకపోవచ్చు అని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో జరిగే ఈ పరిణామాలను పై నుంచి అధినాయకత్వం కూడా నియంత్రించలేదని అంటున్నారు.
త్యాగాలకు నో చాన్స్ :
గతంలో పరిస్థితి ఎలా ఉన్నా ఈసారి త్యాగాలకు నో చాన్స్ అని అంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికలు అంటే అది పెద్ద తతంగం. భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా అపుడు అధికారంలోకి రావడం అన్న లక్ష్యం ఉంది. ఈసారి అలా కాదు అధికారంలో ఉన్నామని నేతలు అంటున్నారు. ఇపుడు కూడా త్యాగాలు చేస్తే కనుక మళ్ళీ ఎపుడూ అన్నది కూడా అనేక మందిలో ఉంది. ఇక మూడు పార్టీల నుంచి కూడా ఎక్కువ మంది ఆశావహులే రేసులో ఉన్నారు. గడచిన రెండేళ్ళుగా పోటీ చేయాలని భారీ స్కెచ్ గీసుకుని కూర్చున్న వారికి పొత్తుల పేరుతోనో సర్దుబాటు మాటలతోనో పక్కన పెట్టాలని చూస్తే ఆగే ప్రసక్తి ఉండదని అంటున్నారు. దాంతో కూటమికి సర్దుబాటు ఎంత సవాల్ గా మారుతోందో అంతకు మించి రెబెల్స్ విషయంలో కూడా ఇబ్బంది ఎదురవుతుందని అంటున్నారు.
పార్టీలే కాదు అంటూ :
ఇక పార్టీలు తమకు బలం ఉందని సత్తా చూపుతామని అనుకుంటే అంతకు మించి కీలక నేతలు తమ బలాన్ని కూడా గ్రౌండ్ లెవెల్ లో చూపించాలని ఉబలాటపడుతున్నారని అంటున్నారు. ఉదాహరణకు కూటమిలో ఫలానా పార్టీకి సీటు ఇచ్చినా తాము పోటీ చేయాలని మిగిలిన పార్టీలలో గట్టి నాయకుడు ఎవరైనా అనుకుంటే ఆపేది ఉండదని అంటున్నారు. ఆ విధంగా రెబెల్స్ బరిలోకి పెద్ద ఎత్తున దిగితే అది ప్రధాన అభ్యర్థుల విజయం మీద పెను ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయన్న ఆందోళన అయితే ఉంది. వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేసి గెలిచి వచ్చిన తరువాత తిరిగి చేర్చుకోవడం అన్నది గతంలో చాలా సార్లు జరిగింది. ఈసారి అలా చేయవద్దని రెబెల్స్ గా ఎవరి పోటీకి దిగి కూటమి ఐక్యతను నష్టపరచినా వారి మీద కఠిన చర్యలు తీసుకుని అదే కొనసాగించాలని మిత్ర పార్టీలు కోరుతున్నాయని అంటున్నారు. చూడాలి మరి రెబెల్స్ ఎంత మంది బరిలోకి దూకుతారో, డేంజర్ బెల్స్ మోగేది ఎవరికో.