రెండు రోజులకు ఒకసారి భోజనం.. నడిసంద్రంలో 23 రోజుల నరకం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలానికి చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ 23 రోజుల అనంతరం తెలిసింది.
ఒక పూట భోజనం ఆలస్యమైతే అల్లాడిపోతాం.. అటువంటిది సముద్రంలో 23 రోజుల పాటు ప్రతికూల వాతావరణంలో ఇంటికి చేరుతామో లేదోనన్న ప్రాణభయంతో బిక్కుబిక్కుమన్న మత్స్యకారులు ప్రాణాలు కాపాడుకోడానికి రెండు రోజులకు ఒకసారి మాత్రమే భోజనం చేసి 23 రోజుల అనంతరం ఒడ్డుకు చేరుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు జెట్టీ నుంచి బయలుదేరిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో ఎదుర్కొన్న దైన్యస్థితి, ప్రాణాలతో బయటపడేందుకు సాగించిన సుదీర్ఘ పోరాటం ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలానికి చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ 23 రోజుల అనంతరం తెలిసింది. ఓడలరేవు జెట్టీ నుంచి కొమరగరిపట్నానికి చెందిన రామకృష్ణవర్మ బోటులో ఆయనతో పాటు ఓడలరేవుకు చెందిన కొల్లాటి శ్రీనుబాబు, ఏసుదాసు, పాలెపు శాంతారావు, కర్రి రాముడు, పశువుల్లంకకు చెందిన కాటాడి సతీష్‌కుమార్, కాకినాడ జిల్లాకు చెందిన సంగాడి తాతారావు ఈ నెల 3న సముద్రంలోకి వేటకు వెళ్లారు. అంతా సజావుగా సాగుతుందనుకున్న తరుణంలో విధి మరోలా తలచింది. సెప్టెంబరు 4వ తేదీ ఉదయం 12 గంటలకు బోటు క్లచ్‌ప్లేట్లు పాడయ్యాయి. అప్రమత్తమైన మత్స్యకారులు వాటిని అమర్చినప్పటికీ, ఆ తర్వాత ఇంజిన్ గేర్‌బాక్సు కూడా పాడైంది. ఎలాగైతేనేమి శ్రమించి 5న దాన్ని సరిచేసుకుని తిరుగుముఖం పట్టారు. అయితే విధి వారిని పరీక్షించడానికే అన్నట్లుగా, ఒడ్డుకు చేరుకునే క్రమంలో 50 నాటికల్ మైళ్ల దూరం వచ్చేసరికి ఇంజిన్ పూర్తిగా మొరాయించి నిలిచిపోయింది. సమీపంలో మరే ఇతర బోట్లు లేకపోవడంతో, బలమైన గాలుల తీవ్రతకు వారి పడవ పశ్చిమబెంగాల్ వైపు కొట్టుకుపోయింది.
సాధారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లేటప్పుడు 15 రోజులకు సరిపడే సరకులు మాత్రమే తీసుకెళ్తారు. కానీ బోటు మధ్యసంద్రంలో నిలిచిపోవడంతో పరిస్థితి తలకిందులైంది. ఇంటికి చేరేసరికి 23 రోజులు పట్టింది. ఉన్న కొద్దిపాటి ఆహార పదార్థాలు అయిపోతాయనే భయంతో, ప్రాణాలు కాపాడుకోవడానికి వారు సరకులను అత్యంత పొదుపుగా వాడుతూ రెండ్రోజులకోసారి మాత్రమే భోజనం చేశారు. భగభగలాడే ఎండ, కుండపోత వాన, దారుణమైన ఆకలిని దిగమింగుతూ రోజుల తరబడి సముద్రంలో నరకయాతన అనుభవించినట్లు చెబుతున్నారు.
ఎట్టకేలకు దక్కిన ఊరటసముద్రంలో సుదీర్ఘ పోరాటం తర్వాత, బుధవారం ఉదయం పశ్చిమబెంగాల్ పరిధిలోని దిగా ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వారికి కోల్‌కతాకు చెందిన ఓ బోటు కనిపించింది. ఆ బోటు సిబ్బంది వీరిని గమనించి మానవతా దృక్పథంతో ఆదుకున్నారు. ఆహారం అందించారు. సముద్రంలో సెల్‌ఫోన్ సిగ్నళ్లు పూర్తిగా లేకపోవడంతో, మత్స్యకారులు తమవద్ద ఉన్న శాటిలైట్ ఫోన్ ద్వారా శంకర్‌పూర్‌లో ఉన్న బోటు యజమానికి సమాచారం అందించారు. తాము ఆంధ్రా బోటును రక్షించి తీరానికి తీసుకొస్తున్నామని, వారి కుటుంబసభ్యులకు చెప్పాలని కోరారు. దీంతో యజమాని రామకృష్ణవర్మ వెంటనే తన కుటుంబానికి, అధికారులకు సమాచారం చేరవేశారు.