మాజీ సీఎం కిరణ్ కి బీజేపీ బంపర్ ఆఫర్ ?
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి చిట్ట చివరి సీఎం గా పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పుష్కర కాలంగా పదవీ యోగం పట్టకుండా పోయింది.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి చిట్ట చివరి సీఎం గా పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పుష్కర కాలంగా పదవీ యోగం పట్టకుండా పోయింది. 2014 మార్చిలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత సమైక్యాంద్ర పార్టీని ఏర్పాటు చేసి ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన ఫలితం లేకపోయింది. కాంగ్రెస్ లో తిరిగి చేరినా ప్రాధాన్యత దక్కలేదని బయటకు వచ్చేశారు, బీజేపీలో చేరితే 2024 ఎన్నికల్లో రాజంపేట లోక్ సభ ఎన్నికల్లో గెలుపు పిలుపు వినిపించలేదు. దాంతో రాజ్యసభ సీటు కోసం కిరణ్ కుమార్ ప్రయత్నం చేస్తున్నారు అని ప్రచారం అయితే ఊపందుకుంది. ఆ విధంగా పెద్దల సభలో చేరి కేంద్ర మంత్రి కావాలన్నది ఆయన ఆలోచన. అయితే అది కూడా తీరకుండా పోతోంది.
గోల్డెన్ చాన్స్ దక్కేనా :
ఈ నేపధ్యంలో కేంద్ర పెద్దలతో కిరణ్ కుమార్ టచ్ లో ఉంటున్నారు అని అంటున్నారు. అయితే ఆయన నిబద్ధత నిజాయతీ అంకిత భావం వంటివి బీజేపీ పెద్దలను ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. మాటకు కట్టుబడి ఉండే నైజంతో పాటు రాయలసీమలో బలమైన సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి సేవలను పరోక్షంగా వినియోగించుకోవాలని బీజేపీ పెద్దలు తలపోస్తున్నారు. దాంతో ఆయనకు ఆయన హోదాకు తగినట్లుగా సముచితమైన స్థానం కల్పించాలని భావిస్తున్నారు. ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డిని ఒక కీలక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించాలని కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
ఖాళీలలో ఒకటి ఖాయం :
ఇక దేశంలో త్వరలో పలు రాష్ట్రాలలో గవర్నర్ పదవులకు ఖాళీలు ఏర్పడతాయి. దాంతో వాటిలో ఒక పదవికి ఏపీకి చెందిన కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారని ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. సీనియర్ నాయకుడిగా దశాబ్దాల కాలం అనుభవం కలిగిన కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ గా కూడా పనిచేశారు. దాంతో రాజ్యాంగబద్ధ హోదాతో ఆయనను రాజ్ భవన్ కి పంపించాలని చూస్తున్నారు అని అంటున్నారు. అదే జరిగితే కిరణ్ కుమార్ రెడ్డి జాక్ పాట్ కొట్టినట్లే అని అంటున్నారు. కీలక రాష్ట్రానికి గవర్నర్ గా బాధ్యతలు చేపట్టడం అంటే ఆయన హోదాకు అది సముచితమైన గౌరవం అని అంటున్నారు. అయితే దీని మీద అధికారికంగా ఎక్కడా సమాచారం అయితే లేదు, గతంలోనూ పలు మార్లు కిరణ్ కుమార్ రెడ్డి పేరు గవర్నర్ల జాబితాలో పరిశీలనలోకి వచ్చినా కూడా చివరి నిముషంలో అది జరగలేదు, అయితే ఈసారి ఖాయమని ఆయన వర్గీయులలో అయితే ఆశాభావం వ్యక్తం అవుతోంది.
సెప్టెంబర్లో నే అన్నీ :
బీజేపీ సెప్టెంబర్ నెలలోనే కీలక మార్పులు అన్నీ చేస్తుందని చెబుతున్నారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరపడం, అందులో సీనియర్లు పలువురిని గవర్నర్లుగా నియమించడంతో పాటు ఏపీకి చెందిన సీనియర్ బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డికి కూడా చోటు కల్పిస్తారు అని అంటున్నారు. ఇక ఇదే వరసలో టీడీపీ నుంచి ఒకరికి గవర్నర్ పోస్టు బీజేపీ ఇచ్చే చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. మరి టీడీపీ నుంచి ఎవరు ఆ అదృష్టవంతులు అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సెప్టెంబర్ నెల రాజకీయంగా చాలా కీలకంగా మారబోతోంది అన్నది నిజమని హస్తిన వర్గాలు చెబుతున్నాయి.