చెల్లెమ్మ కవితకు చెల్లు..కీలక పదవి బాధ్యతల నుంచి తప్పించిన కేటీఆర్‌?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌లో కొంతకాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తూ సంచలనంగా మారారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.;

Update: 2025-07-16 17:48 GMT

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌లో కొంతకాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తూ సంచలనంగా మారారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పార్టీ వ్యవస్థాపకుడు, తండ్రి కేసీఆర్‌ తనకు బాస్‌ అంటూనే ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు పార్టీ వ్యవహారాలపై ఆయనకు రాసిన లేఖ లీక్‌ కావడం కవితలో మరింత ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో రెండు నెలల కిందట ఆమె అమెరికా నుంచి తిరిగివస్తూనే కొత్త పార్టీ ప్రారంభిస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. కానీ, అవేవీ నిజం కాలేదు. కాకపోతే కవిత మాత్రం తన అసంతృప్తిని ఎక్కడా దాచుకోవడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు తన తండ్రికి నోటీసులు ఇస్తే పార్టీ నేతలు ఒక్కరూ మాట్లాడలేదని.. అదే మరొకరికి నోటీసులు ఇస్తే చాలామంది స్పందించారని పరోక్షంగా అన్న కేటీఆర్‌ను టార్గెట్‌ చేశారు. పార్టీలో ఉంటూనే అసమ్మతి నేతగా మారిన కవిత.. సొంతంగా కార్యకలాపాలు కూడా చేపట్టారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంఘం.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (తెబొగకాసం). ఉద్యమ స్ఫూర్తికి తోడు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నింపుకొన్న ఈ సంఘం బీఆర్‌ఎస్‌కు అనుంబంధం. ఉద్యమ సమయంలో కోల్‌ బెల్ట్‌ (సింగరేణి) ఏరియాలో ఈ సంఘం క్రియాశీలంగా ఉండేది. దేశంలోనే అతిపెద్ద బొగ్గు గనుల సంఘంగా కావడంతో అది పరోక్షంగా బీఆర్‌ఎస్‌కు కూడా మేలు చేసింది. ఈ సంఘానికి ఇంతకాలం కల్వకుంట్ల కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. తాజాగా ఆ పదవి నుంచి ఆమెను తప్పించినట్లయింది.

తెబొగకాసం ఇంచారి‍్జగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. వాస్తవానికి ఇటీవల కవిత తరఫున ఈ సంఘం కొంత చురుగ్గా వ్యవహరించింది. అసమ్మతి సమయంలో తెబొగకాసం నాయకత్వంతోనూ సమావేశం అయ్యారు. అలాంటి సంఘం బాధ్యతల నుంచి కవితను తప్పించడం అంటే.. బీఆర్‌ఎస్‌లో కీలక పరిణామమే. ఇటీవల కవిత వ్యవహార శైలి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికితోడు కవితకు బీఆర్‌ఎస్‌ నాయకత్వం నుంచి ఎటువంటి మద్దతు లభించడం లేదు. అసభ్యకర వ్యాఖ‍్యలు చేశారంటూ ఆదివారం నాడు ఓ డిటిజల్‌ చానల్‌ కార్యాలయంపై దాడికి కవిత మద్దతుదారులు దాడికి దిగినా.. బీఆర్‌ఎస్‌ నాయకత్వం స్పందించలేదు. అంతకుముందు తండ్రి కేసీఆర్‌ కాళేశ్వరం విచారణకు వెళ్తున్న సమయంలో ఫాంహౌజ్‌కు వెళ్లి కలిసే ప్రయత్నం చేశారు కవిత. కూతురుపై అత్యంత ప్రేమ కనబరిచే కేసీఆర్‌ అప్పుడు అసలు ఆమెను పట్టించుకోలేదనే కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా అత్యంత కీలకమైన పదవి బాధ్యతల నుంచి తప్పించినట్లయింది.

ఫక్తు తెలంగాణ వాది, ఉద్యమకారుడు అయిన కొప్పుల ఈశ్వర్‌కు తెబొగకాసం ఇంచార్జిషిప్‌ ఇవ్వడం కవితకు చెక్‌ పెట్టినట్లే అని చెబుతున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన కొప్పుల ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వారు. సింగరేణికి ఆయువుపట్టు ఈ జిల్లానే. బీఆర్‌ఎస్‌ స్థాపన నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీకి, కేసీఆర్‌కు పూర్తి విధేయుడు. తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌, మంత్రిగా వ్యవహరించారు. ఈటల రాజేందర్‌ వంటి నాయకుడు వెళ్లిపోయాక బీఆర్‌ఎస్‌లో ఆ స్థాయి నాయకుడు ఎవరంటే కొప్పుల ఈశ్వర్‌ అనే చెప్పాలి. అలాంటి నాయకుడికి తెబొగకాసం పదవి ఇవ్వడం బీఆర్‌ఎస్‌లో పరిణామాలను మున్ముందు ఎక్కడకు తీసుకెళ్తుందో...?

Tags:    

Similar News