కవిత ప్లేస్ ఖరారు.. కానీ.. కాంగ్రెస్ విజయం సాధించేనా?!
కవిత ఖాళీ చేసిన స్థానంలో మంత్రిగా గత ఏడాది ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ మాజీ క్రికెటర్.. అజారుద్దీన్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.;
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ కుమార్తె కవిత.. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు మాసాల అనంతరం.. ఈ రాజీ నామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా ఆమోదించారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానానికి త్వరలోనే భర్తీ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా.. పూర్తయిందని సమాచారం.
కవిత ఖాళీ చేసిన స్థానంలో మంత్రిగా గత ఏడాది ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ మాజీ క్రికెటర్.. అజారుద్దీన్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. గత ఏడాది జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అజారుద్దీన్ పోటీచేయాలని భావించారు. కానీ, ఆయనను అనివార్యంగా తప్పించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌ను మచ్చిక చేసుకునేందుకు.. మంత్రి పోస్టు ఇచ్చారు. కానీ, ఆయన రెండు సభల్లో దేనికీ ప్రాతినిధ్యం వహించడం లేదు.
నిబంధనల మేరకు 6 మాసాల్లో ఏదో ఒక సభ(అసెంబ్లీ/ మండలి)కి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి కవిత రూపంలో ఛాన్స్ చిక్కింది. దీంతో అజారుద్దీన్‌ను ఈ స్థానంలో కూర్చోబెట్టాలన్నది కాంగ్రెస్ నేతల ప్లాన్. అయితే.. ఇది అంత తేలికగా సాధ్యమవుతుందా? అనేది ప్రశ్న. కాంగ్రెస్ భావిస్తున్నప్పటికీ.. అజారుద్దీన్ మండలిలోకి ప్రవేశించడం అంత ఈజీ అయితే కాదు..
ఎందుకంటే..
కవిత.. 2022లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా మండలిలో అడుగు పెట్టారు. అంటే ఇది ప్రత్యక్ష ఎన్నిక. స్థానిక సంస్థల కోటాలో ఆమె విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా అదే పద్దతి పాటించాల్సి ఉంటుంది. దీంతో కాంగ్రెస్‌కు ఏకపక్షంగా విజయం దక్కుతుందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. నిజామాబాద్ ఎంపీ స్థానం బీజేపీ చేతిలో ఉంది. స్థానికంగా బీఆర్ ఎస్ బలంగా ఉంది. సో.. ఇన్ని అవాంతరాలను దాటుకుని కాంగ్రెస్ ఏమేరకు అజారుద్దీన్‌ను గెలిపించుకుంటుందన్నది చూడాలి.