కవిత..మా పార్టీలో చేరు.. బీజేపీ బాణం కాదని నిరూపించుకో..
ప్రజాశాంతి పార్టీని బీసీల ఏకైక పార్టీ అని.. నువ్వు బీజేపీ వదిలిన బాణం కాదని నిరూపించుకోవాలని అనుకుంటే తమ పార్టీలో చేరాలని కోరారు.;
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తెకు అనూహ్య పిలుపు దక్కింది. ఇప్పుడున్న పార్టీల్లో తమదే నిజమైన వెనుకబడిన వర్గాల (బీసీ) పార్టీ అని తమ పార్టీలో చేరాలని ఆహ్వానం అందింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెడ్ల పార్టీ అని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బ్రాహ్మణుల పార్టీ అని.. అందుకని తమ పార్టీలోకి రమ్మని అవకాశం ఇచ్చారు. అంతేకాదు.. మరికొద్ది రోజుల్లో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ పోటీ చేద్దామని ప్రతిపాదించారు.
ఈ ఆఫర్ వదులుకోలేనిదే...
కవిత బుధవారం ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ప్రజా శాంతి పార్టీ వ్యస్థాపకుడు, ప్రముఖ మత బోధకుడు కేఏ పాల్ రంగప్రవేశం చేశారు. కవితకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. బీసీల కోసం పోరాడుతాను అంటున్నారు కాబట్టి కవితను తమ పార్టీలో చేరాల్సిందిగా కోరారు. జూబ్లీహిల్స్ లో పోరాడదాం అని, మనల్ని మనం రుజువు చేసుకుందామని పిలుపునిచ్చారు.
బీజేపీ బాణం కాదని నిరూపించుకో...
ప్రజాశాంతి పార్టీని బీసీల ఏకైక పార్టీ అని.. నువ్వు బీజేపీ వదిలిన బాణం కాదని నిరూపించుకోవాలని అనుకుంటే తమ పార్టీలో చేరాలని కోరారు. కాంగ్రెస్ 12 మంది రెడ్లను ముఖ్యమంత్రులను చేసిన రెడ్ల పార్టీ అని, రాష్ట్రంలో రామచంద్రరావు నాయకత్వంలోని బీజేపీ బ్రాహ్మణుల పార్టీ అని కేఎల్ పాల్ ఆరోపించారు. దొరసాని అయిన నిన్ను నమ్మాలంటే.. ప్రజాశాంతి పార్టీతో చేయి కలపాలని ఆహ్వానం పలికారు.
మాది గద్దర్ అన్న చేరిన పార్టీ
ప్రజాశాంతి పార్టీ అనేది ప్ర గద్దర్ అన్న చేరిన పార్టీ అని కేఏ పాల్ వివరించారు. ప్రజల్లో కవిత మీద నమ్మకం కలగాలంటే తమ పార్టీలో చేరడం మంచి మార్గమని సూచించారు. జూబ్లీహిల్స్ లో పోరాడి రుజువు చేసుకుందామని, అందరి మనసులను చూరగొందామని కోరారు. కాగా, కవిత బీఆర్ఎస్ కు రాజీనామా అనంతరం తాను సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేస్తానని వ్యాఖ్యానించారు. ఆమె ప్రెస్ మీట్ అలా ముగిసిందో లేదో ఇలా కేఎల్ రంగంలోకి వచ్చేశారు. ఎక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులోనే కవితను తన పార్టీలోకి ఆహ్వానించారు.